వెనుకబడ్డ చంద్రబాబు.. అందుకే రెడీ చేసుకుంటున్నాడు?

గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది గతంలో ఎన్నడూ రీతిలో కేవలం 23సీట్లకే పరిమితమైంది. ఆ ఓటమి నుంచి కోలుకోవడానికి చంద్రబాబుకు చాలా సమయమే పట్టింది. ఇదే సమయంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో చంద్రబాబు ఇంటికే పరిమితమయ్యారు. దాదాపు ఏడాదిన్నరగా చంద్రబాబు యాక్టివ్ గా పని చేసిన దాఖలాల్లేవు. ఏదో మొక్కుబడిగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతేకానీ టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపే కార్యక్రమాలు పెద్దగా చేయలేదు. అయితే ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు తిరిగి యాక్టివ్ పాలిటిక్స్ కు సిద్ధమవుతున్నారు.  

చంద్రబాబు నాయుడు ఎక్కువగా జనాల్లో ఉండేందుకే ఇష్టపడుతుంటారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయన ప్రజలతో మమేకం అవుతుంటారు. కానీ గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆయన కేవలం ఇంటికే పరిమితమయ్యారు. హైదరాబాద్ కేంద్రంగానే పార్టీ కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు. అడపాదడపా విజయవాడ, విశాఖపట్నం వచ్చి వెళ్లిపోయేవారు. జూమ్ లోనే పార్టీ నేతలతో మాట్లాడి పరిస్థితులను చక్కదిద్దే వారే. కానీ ప్రస్తుతం ఏపీలో అన్ని పార్టీలు ఎన్నికల మూడ్లోకి వెళుతున్నాయి. టీడీపీని పక్కకు తోసేస్తూ అధికార వైసీపీతో జనసేనాని పవన్ తలపడుతున్నాడు. టీడీపీని ఓవర్ టేక్ చేసేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే  చంద్రబాబు కూడా అలర్ట్ అవుతున్నారు.

వైఎస్ జగన్మోహన్ డిసెంబర్ నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో టీడీపీ అధినేత సైతం ముందుస్తుగానే అన్ని అస్త్రాలను రెడీ చేసుకుంటున్నారు. అక్టోబర్ నుంచే జనాల్లోకి వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. దసరా తర్వాత ఆయన జిల్లాల వారీగా పర్యటనలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో జిల్లాలో కనీసం మూడు నాలుగురోజులపాటు పర్యటనలు చేపట్టనున్నారు. కొన్ని చోట్ల రోడ్డు షోలు, మరికొన్ని బహిరంగ సభలు నిర్వహించనున్నారు. అలాగే ప్రతీరోజు ఉదయం నియోజకవర్గాల వారీగా సమావేశం నిర్వహించనున్నారని సమాచారం.

ఆయా జిల్లాలో నేతల మధ్య విబేధాలను పరిష్కరించనున్నారు. అందరూ కలిసి పని చేయాలని హితబోధ చేయనున్నారు. ఇక ఆయన జిల్లా పర్యటలనకు ముందుగానే నియోజకవర్గ ఇన్ ఛార్జిలను నియమించనున్నారు. అదేవిధంగా పార్టీలోని సీనియర్లతో ప్రత్యేకంగా సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. జిల్లాల పర్యటనలో భాగంగా అన్నివర్గాలను కలుపుకొని పోయేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఆయా జిల్లాలోని ప్రముఖులను, తటస్థులకు కలుసుకొని వారి మద్దతును కూడగట్టనున్నారని సమాచారం. ఏ పార్టీతో సంబంధం లేని వ్యక్తుల ఇంటికి చంద్రబాబు స్వయంగా వెళ్లి తమను టీడీపీవైపు ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారని టాక్ విన్పిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలువకపోతే ఆపార్టీ అడ్రస్ గల్లంతు అనే టాక్ ఆపార్టీ నేతల్లో విన్పిస్తోంది. దీనికితోడు వైసీపీ సర్కారు వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలను టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈమేరకు తమతో కలిసి వచ్చే అన్ని వర్గాలను, వ్యక్తులను చంద్రబాబు కలుపుకుపోవాలని భావిస్తున్నారట. దీనిలో భాగంగానే చంద్రబాబు జిల్లా పర్యటనలు చేస్తూ వలసలను ప్రోత్సహించే అవకాశం కన్పిస్తోంది. మొత్తంగా వైసీపీ ముందుస్తు ఎన్నికలకు వెళుతుందనే ప్రచారం సాగుతుండటంతో టీడీపీ అధినేత సైతం ముందుగానే అన్ని ఏర్పాటు చేసుకుంటుండటం ఆసక్తి  రేపుతోంది.

-Advertisement-వెనుకబడ్డ చంద్రబాబు.. అందుకే రెడీ చేసుకుంటున్నాడు?

Related Articles

Latest Articles