వల్లభనేని వంశీ క్షమాపణ తర్వాత టీడీపీ డైలమాలో పడిందా..?

గౌరవ సభల పేరుతో టీడీపీ రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇంట్లో ఆడవాళ్లని కూడా చట్టసభల్లో దూషిస్తూ కౌరవ సభలుగా మారుస్తున్నారని ఆరోపిస్తూ ప్రజల్లోకి వెళ్లాలన్నది ప్రణాళిక. అయితే ఈ వివాదానికి మూల కారణమైన వల్లభనేని వంశీ.. క్షమాపణలు చెప్పేశారు. అయినప్పటికీ ఆ కామెంట్సే అజెండాగా గౌరవ సభలు నడపాలా.. ఆగాలా..? అన్నది ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న చర్చ. వంశీ క్షమాపణలు తర్వాత టీడీపీ డైలమాలో పడ్డట్టుగానే కన్పిస్తోంది.

ఏపీలో గౌరవ సభలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయం..!
ఇంతలో తన కామెంట్స్‌పై సారీ చెప్పిన వల్లభనేని వంశీ..!

సుమారు 45 రోజులకు ముందు టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లోకేష్‌ను ఉద్దేశించి కొన్ని కామెంట్స్‌ చేశారు. ఆ వ్యాఖ్యలు పరోక్షంగా చంద్రబాబు భార్య భువనేశ్వరిని కించపరిచే విధంగా ఉన్నాయి. ఇదే అంశంపై అసెంబ్లీలో అనుచిత కామెంట్స్‌ చేశారని ఆరోపిస్తూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆపై మీడియా ఎదుట బోరున విలపించారు. గౌరవ సభగా ఉండాల్సిన అసెంబ్లీ.. కౌరవ సభలా మారిందని.. మళ్లీ తిరిగి సీఎంగానే సభకు వస్తానని సవాల్ చేసి బయటకొచ్చేశారు చంద్రబాబు. ఆ తర్వాత టీడీపీ నాయకత్వం రాష్ట్రంలో గౌరవ సభలు నిర్వహించాలని నిర్ణయించింది. రాజకీయపరమైన ఆరోపణలు.. విమర్శలే కాకుండా.. రాజకీయాలకు దూరంగా ఉండే ఇంట్లో ఆడవాళ్లని కించపరిచేలా కామెంట్స్‌ చేస్తున్నారని.. వారి తీరును ప్రజలకు చెబుతామని ప్రకటించి గౌరవ సభల కాన్సెప్ట్‌నకు ప్రణాళికలు రచించారు. ఇదే సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరీకి క్షమాపణలు చెప్పారు. తన మీద టీడీపీ చేసిన విమర్శలకు మానసిక ఒత్తిడికి లోనై పొరపాటున ఆ కామెంట్స్‌ చేశానంటూ సారీ చెప్పారు వంశీ.

వంశీ సారీ చెప్పినందున గౌరవ సభలు నిర్వహించాలా.. వద్దా..?
వారం వారం నిర్వహించే స్ట్రాటజీ సమావేశంలోనూ సభలకే మొగ్గు..!

వంశీ చెప్పిన క్షమాపణలే టీడీపీలో చర్చగా మారాయి. ఏ ఉద్దేశ్యంతో గౌరవ సభల ప్రణాళికను రూపొందించుకున్నామో.. దాన్ని అదే అజెండాతో కొనసాగించాలా.. వద్దా? అనే చర్చ జరుగుతోంది. వంశీ క్షమాపణలు చెప్పాక కూడా ఇంకా దానినే పట్టుకుని వైసీపీని.. వైసీపీ నేతలను విమర్శిస్తూ ఉంటే.. ఆడవాళ్లని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారనే విమర్శలు టీడీపీ ఎదుర్కొవాల్సి ఉంటుందని కొందరు నేతలు అభిప్రాయ పడుతున్నారట. ఈ క్రమంలో గౌరవ సభల అజెండా నుంచి వంశీ కామెంట్స్‌ ఎపిసోడును పక్కకు తప్పించి ప్రజా సమస్యల అంశాన్ని టేకప్ చేస్తే మంచిదనే చర్చ నడుస్తోందట. కొందరు నేతలు ఈ ప్రతిపాదనకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. వంశీ సారీ చెప్పినా.. సభలో మిగిలిన వారు చేసిన వ్యాఖ్యలకు ఇంకా క్షమాపణలు చెప్పలేదనే వాదన తెస్తున్నారు. అందుకే అజెండా ప్రకారం ప్రజల్లోకి వెళ్లాలనేది వారి డిమాండ్‌. ప్రతి వారం నిర్వహించే స్ట్రాటజీ కమిటీ సమావేశంలోనూ ఈ అంశాన్ని కొనసాగించాలనే దిశగానే నిర్ణయం తీసుకున్నారట.

మంత్రి కొడాలి నాని కామెంట్స్‌ ఆధారంగా అజెండా ఫిక్స్‌ చేస్తారా?
బాబు ఆలోచనలతో మింగిల్‌ కాని నేతల అభిప్రాయలు?

వైసీపీ ఆలోచనలను పట్టించుకోకుండా.. వారి వ్యూహాలను పరిశీలించకుండా ఈ విషయంలో ముందుకెళ్తే తమకే నష్టమనే భావన కొందరు టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారట. వంశీ క్షమాపణలు చెప్పినా మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్స్‌ను పరిగణనలోకి తీసుకుని అజెండాను ఫిక్స్ చేసుకోవాలని అంటున్నారు. భువనేశ్వరీ విషయంలో వంశీ 5 శాతం తప్పు చేస్తే.. చంద్రబాబు 95 శాతం తప్పు చేశారని.. రాజకీయం కోసం భార్యను కూడా చంద్రబాబు రాజకీయంలో లాగారనే విమర్శలు చేశారు. టీడీపీపై దాడికి బహుశా వైసీపీ ఇదే వ్యూహం ప్లాన్‌ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారట. అయితే చంద్రబాబు ఆలోచనలు.. పార్టీ నేతల అభిప్రాయాలు ఎక్కడా మింగిల్‌ కావడం లేదట. ఇంతటి సున్నితమైన విషయాల్లో ప్రత్యర్థి శిబిరం వ్యూహాలకు తగ్గట్టుగా ప్రతివ్యూహాలు రచించుకోకుంటే ఎలా అని తల బాదుకుంటున్నారట కొందరు టీడీపీ నేతలు.

Related Articles

Latest Articles