బద్వేలులో బీజేపీకి టీడీపీ సాయం.. బీజేపీ సాధించే ఓట్లెన్ని?

బద్వేలులో ఉప ఎన్నిక సమరం ముగిసింది. ఈనెల 2న ఫలితం తేలనుంది. అయితే ఉప ఎన్నికలో గెలుపు వైసీపీకే అనుకూలంగా ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తున్నా.. బరిలో నిలిచిన బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయన్నది కీలకంగా మారింది. ఎందుకంటే బద్వేల్ ఉప ఎన్నికలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు.

అయితే తెరచాటున బీజేపీకి టీడీపీ సాయం చేసిందని జరిగిన పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. బద్వేల్ నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. పలు చోట్ల బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలు కూర్చున్నారు. దీంతో టీడీపీ నేతలు తమకు ఉన్న ఓటు బ్యాంకును బీజేపీకి షిఫ్ట్ చేయించారని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బద్వేల్ ఉప ఎన్నికలో 69 శాతం పోలింగ్ నమోదు కాగా ఇందులో బీజేపీ ఓటు శాతం ఎంతో కౌంటింగ్ రోజు బహిర్గతం కానుంది. అయితే 2019 ఎన్నికల్లో 77 శాతం పోలింగ్ నమోదు కాగా వైసీపీకి గుంపగుత్తగా ఓట్లు పడ్డాయి. మొత్తం పోలైన ఓట్లలో వైసీపీకి 60 శాతం ఓట్లు పడగా టీడీపీకి 32 శాతం ఓట్లు పడ్డాయి. అప్పుడు టీడీపీకి పడ్డ ఓట్లు ఉప ఎన్నికలో ఏ పార్టీకి పడతాయన్న అంశం ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ టీడీపీ మద్దతుదారులు ఓటింగ్‌కు దూరంగా ఉంటే 69 శాతం పోలింగ్ నమోదు కాదు. పైగా 2019లో బీజేపీకి పడిన ఓట్లు 735. మరి ఇప్పుడు నమోదైన 69 శాతం పోలింగ్‌లో టీడీపీ సహకారం లేకపోతే బీజేపీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశమే లేదు. కాబట్టి పోలింగ్ ఏజెంట్లే లేని బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి… టీడీపీ మద్దతుదారులు తమ ఓట్లు బీజేపీకి మళ్లించారా లేదా అధికారపార్టీకే వేశారా అన్న విషయం మరో రెండు రోజుల్లో తేలిపోనుంది.

Read Also: పోరు ముగిసింది.. ఫలితమే మిగిలింది..పార్టీల్లో టెన్షన్

Related Articles

Latest Articles