విశాఖ టీడీపీకి మొదలైన కార్పొరేటర్ల షాక్…!

అంతా ఊహించనట్టే జరుగుతోంది. విశాఖ తెలుగుదేశంపార్టీకి కార్పొరేటర్ల షాక్‍ మొదలైంది. వైసీపీ వ్యూహాలను తట్టుకుని నిలబడటం సీనియర్లకు కష్టంగా మారిందట. దీంతో పలువురు కార్పొరేటర్లు అధికారపార్టీకి టచ్‌లో ఉన్నట్టు సమాచారం.

18 లక్షల మందికిపైగా జనాభా.. రూ.4 వేల కోట్ల బడ్జెట్‌
జీవీఎంసీలో ప్రస్తుతం వైసీపీ బలం 59

ఏపీ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ విశాఖపట్నం.. రాష్ట్రంలోనే అతిపెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌. భీమునిపట్టణం, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనం తర్వాత గ్రేటర్‌ విశాఖ పరిధి 98 డివిజన్లకు విస్తరించింది. జనాభా 18లక్షల పైమాటే. ప్రజల అవసరాలను తీర్చేందుకు జీవీఎంసీ రూపొందించే వార్షిక బడ్జెట్ నాలుగు వేల కోట్లు. అభివృద్ధి, రాజకీయ పరంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన నగరంపై పట్టు సాధించేందుకు టీడీపీ, వైసీపీలు గట్టిగా పనిచేశాయి. నాలుగేళ్ల విరామం తర్వాత ఎన్నికలు నిర్వహించగా పోరు హోరాహోరీగా జరిగింది. వైసీపీ 58, టీడీపీ 30 డివిజన్లను గెలుచుకున్నాయి. ప్రస్తుత కౌన్సిల్లో టీడీపీ తర్వాతి స్థానంలో జనసేన ఉంది. నలుగురు ఇండిపెండెంట్‌లలో ఇప్పటికే ముగ్గురు వైసీపీలో చేరిపోయారు. దీంతో అధికార పార్టీ బలం 61కి పెరిగినా.. వైసీపీ నుంచి గెలిచిన వారిలో ఇద్దరు చనిపోవడంతో 59కి చేరుకుంది.

టీడీపీకి 69వ డివిజన్‌ కార్పొరేటర్‌ రాజీనామా
మరో నలుగురైదుగురు టీడీపీ కార్పొరేటర్లు పక్కచూపు

ఇక లాభం లేదని భావించిందో ఏమో.. వైసీపీ వ్యూహం మార్చేసింది. టీడీపీ నుంచి వలసలకు గ్రీన్‌ సిగ్నల్‌ పంపింది. పైగా రాజకీయంగా సీనియర్‌ కార్పొరేటర్లు ఒత్తిడిలో ఉన్నారు. కౌన్సిల్‌లో గళం విప్పి సమస్యలపై అవగాహనతో మాట్లాడేవారు.. పోరాడేవారు అధికారపార్టీ వైపు ఓరచూపులు చూస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే 69వ వార్డు కార్పొరేటర్, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ కాకి గోవిందరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. వార్డు అభివృద్ధి కోసం ఎంపీ విజయసాయిరెడ్డితో సమావేశమై తన భవిష్యత్ ప్రయాణం ఏమిటో చెప్పకనే చెప్పేశారు. ఇదేదారిలో మరో నలుగురైదుగురు అధికారపార్టీకి టచ్‌లో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వరసలో ముందు ఉన్నట్టు చెప్పుకొంటున్న కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు తన మనసులో మాట బయట పెట్టారు. ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న సమయంలో పార్టీ నాయకత్వం సహకరించడం లేదనేది ఆయన ఆవేదన.

జీవీఎంసీ నుంచి టీడీపీని ఖాళీ చేయిస్తామన్న ఎంపీ విజయసాయిరెడ్డి

వాస్తవానికి ఎన్నికలు పూర్తయి తొలి కౌన్సిల్ సమావేశం జరిగిన రోజే భవిష్యత్ పరిణామాలను బహిర్గతం చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. రెండు నెలల్లో జీవీఎంసీ నుంచి టీడీపీని ఖాళీ చేయిస్తామన్న ఆయన ప్రకటన యాధృచ్చికమే అయినా ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. కార్పొరేటర్ల ఆకర్ష మంత్రం వెనుక రాజకీయాల కంటే అభివృద్ధి కోణమే కీలకం. సమీప భవిష్యత్‌లో విశాఖలో వందల కోట్ల రూపాయల వర్స్క్ జరుగనున్నాయి. సిటీని మురికివాడల రహిత నగరంగా మార్చాలని ప్రణాళికలు ఉన్నాయి. ఈ పనులన్నీ కౌన్సిల్ చర్చించడం, ఆమోదించడం అనేది కీలకమైన వ్యవహారం. అందుకే నగరంపై పట్టు సాధించడం, టీడీపీని మరింతగా బలహీనపర్చడం లక్ష్యంగా ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభమైందని చెవులు కొరుక్కుంటున్నారు.

ఈ నెల 23న జీవీఎంసీ కౌన్సిల్‌ భేటీ

ఎన్నికలు జరిగి ముచ్చటగా 3 నెలలు కూడా పూర్తికాక ముందే రాజకీయం మలుపు తిరుగుతోంది. ఈనెల 23న కౌన్సిల్ భేటీ ఉంది.135 అంశాల అజెండాను చర్చకు పెడుతున్నారు. ఈలోపుగానే కార్పొరేటర్లు మార్పులు జరగవచ్చని సమాచారం. ఆపరేషన్‌ ఆకర్ష్‌పై టీడీపీ విమర్శలు గుప్పిస్తున్నా… అవి తేలిపోతున్నాయి. మరి.. రానున్న రోజులు విశాఖ పొలిటికల్‌ సీన్‌ ఎలా మారబోతుందో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-