టీడీపీకి కాపుల ఓట్లే కీలకమా.?

రాజ్యాధికారం దిశగా కాపు సామాజికవర్గం యాక్టివ్‌ కావడం టీడీపీలో గుబులు రేపుతోందా? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే కాపుల ఓట్లే కీలకమని లెక్కలేసుకుంటున్న తరుణంలో.. కొత్త పరిణామాలు టీడీపీని కలవర పెడుతున్నాయా? విపక్ష పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి?

బీసీల తిరిగి దగ్గరయ్యారనే అంచనాల్లో టీడీపీ
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటింది. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని.. క్షేత్రస్థాయిలో తమ పార్టీకి అనుకూల వాతావరణం ఉందని లెక్కలేస్తోంది టీడీపీ. గత ఎన్నికల్లో టీడీపీ ఓటమికి బీసీ, కాపు సామాజికవర్గాలు ఒకేసారి దూరం కావడం ప్రధాన కారణమనే చర్చ పార్టీలో ఉంది. అందువల్లే తెలుగుదేశానికి ఓట్లశాతం.. సీట్ల సంఖ్య గణనీయంగా పడిపోయిందని విశ్లేషించారు పార్టీ నాయకులు. ఈ రెండున్నరేళ్ల కాలంలో బీసీలు తిరిగి టీడీపీకి దగ్గరయ్యారనే అభిప్రాయం నేతల్లో ఉందట. ఇదే సమయంలో కాపు సామాజికవర్గం సీఎం జగన్‌పై కోపంతో ఉందని అంచనా వేస్తోంది. ప్రత్యేకించి పవన్‌ కల్యాణ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి.. మంత్రులు చేస్తున్న కామెంట్స్‌పై కాపు సామాజికవర్గం మండిపడుతుందన్నది టీడీపీ లెక్క. అందుకే కాపులు కూడా తిరిగి దగ్గరవుతారని.. వచ్చే ఎన్నికల్లో బీసీ, కాపు కాంబినేషన్‌తో గట్టెక్కుతామని భావిస్తూ వస్తున్నారు. అయితే ఆ అంచనాలకు తూట్లు పడేలా పరిణామాలు జరుగుతున్నాయని ఆందోళన చెందుతోందట టీడీపీ.

కాపు ఓట్లు చీలిక పేలికలైతే పరిస్థితి ఏంటన్నది అంతుచిక్కడం లేదట..!
వివిధ పార్టీలలోని కాపు నాయకులు ప్రత్యేకంగా సమావేశమై.. ప్రత్యామ్నాయ కూటమి దిశగా చర్చలు జరపడం టీడీపీ పెద్దలకు నిద్ర కరువైందట. ఈ సందర్భంగా పార్టీలో రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. రాజ్యాధికారం దిశగా ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసుకోవడం వల్ల కాపు సామాజికవర్గానికి ఒరిగేదేం ఉండబోదని.. కాకపోతే టీడీపీకి వచ్చే కాపు ఓట్లు చీలిక పేలికలైతే పరిస్థితి ఏంటన్నదే అంతుచిక్కడం లేదట. గడిచిన ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ బరిలో ఉన్నప్పటికీ.. జనసేనవైపు మొగ్గు చూపకుండా.. టీడీపీని గద్దె దించాలనే లక్ష్యంతో కాపు సామాజికవర్గం వైసీపీవైపు మొగ్గు చూపిందని భావిస్తున్నారు. ఇప్పుడు వైసీపీని గద్దె దించాలని అనుకుంటే.. కాపుల ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయా.. లేదా అనే మీమాంస తెలుగుదేశం వర్గాల్లో ఉంది.

ప్రత్యామ్నాయ వేదిక వెనక ఎవరున్నారో అని ఆరా..!
గతంతో పోల్చుకుంటే జనసేన పుంజుకున్న పరిస్థితుల్లో ఆపార్టీకి కాపుల ఓట్లు పెరిగే అవకాశం ఉంది. అందుకే జనసేనతో పొత్తు ఉంటే ఫర్వాలేదని అనుకుంటున్నారట. ఇదే టైమ్‌లో ప్రత్యామ్నాయ వేదిక పేరుతో కాపులు ముందుకొస్తే టీడీపీకి కష్టమన్నది కొందరు నాయకుల అభిప్రాయం. అసలు ప్రత్యామ్నాయ వేదిక ఆలోచన వెనక ఎవరున్నారు? ఆ అవసరం ఏమొచ్చింది అనే ఆరాలో కొందరు టీడీపీ నేతలు ఉన్నారట. అధికార వైసీపీ తెరవెనక నుంచి నడిపిస్తున్న మంత్రాంగం కాదుకదా అనే అనుమానం కూడా పార్టీలో ఉందట. ఒకవైపు చిరంజీవి.. మరోవైపు పవన్‌ ఫెయిలయ్యారనే రీతిలో కాపుల సమావేశం జరిగిన తీరు తమ అనుమానాలకు కారణం అంటున్నారు టీడీపీ నాయకులు.

కాపుల ఓట్లు చీలితే వైసీపీకే కలిసి వస్తుందని టీడీపీ అనుమానం
ప్రజాకర్షక నేత లేకుండా.. కాపులు కావొచ్చు.. మిగిలిన సామాజికవర్గాలు కావొచ్చు జనాలను ఆకట్టుకోవడం సాధ్యం కాదని టీడీపీలో మరికొందరి అభిప్రాయం. ఇప్పుడు కాపు సామాజికవర్గం ఓట్లు చీలితే అది వైసీపీకి కలిసి వచ్చే అంశంగా ఇంకొందరు లెక్కలేస్తున్నారట. ఇది తెలిసి కూడా ప్రత్యామ్నాయ వేదిక ప్రతిపాదన చేస్తున్నారంటే కచ్చితంగా వారి వెనక వైసీపీ ఉందనే అనుమానాలు టీడీపీకి ఉన్నాయట. ఈ అంశంలో ఎవరి విశ్లేషణలు.. అభిప్రాయాలు ఎలా ఉన్నా.. జరుగుతున్న పరిణామాలు మాత్రం టీడీపీ పెద్దలను కలవరపెడుతున్నట్టు తెలుస్తోంది.

Related Articles

Latest Articles