లాభం చేయాల్సిన వాళ్లే నష్టం చేస్తే పార్టీ బలపడుతుందా..?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా పదవులు అనుభవించిన నాయకులు ఉంటే.. నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉంటుందని అనుకుంటారు. కానీ.. అక్కడ సీన్‌ రివర్స్‌. లాభం చేయాల్సిన వాళ్లే నష్టం చేస్తున్నారట. ఆ ఇద్దరూ ఉమ్మడిగా పార్టీని కిల్‌ చేస్తున్నారనే విమర్శలు ఊపందుకుంటున్నాయి. ఇంతకీ ఏంటా నియోజకవర్గం.. ? ఎవరా నాయకులు..?

పార్టీ పవర్‌కు దూరం కావడంతో నేతలు సైలెంట్‌ మోడ్‌..!

టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఆ పార్టీ నాయకులు ఆడింది ఆట.. పాడింది పాట..! పార్టీ అధికారానికి దూరమైన తర్వాత కూడా ఇక్కడ ఎవరి ఆట వాళ్లు ఆడేస్తున్నారు. వారి చర్యలు.. వైఖరి.. పార్వతీపురంలో టీడీపీని పూర్తిగా కనుమరుగు చేసేలా ఉందని కేడర్‌ ఆందోళన చెందుతుందట. గతంలో బొబ్బిలి చిరంజీవులు ఎమ్మెల్యేగా.. ద్వారపురెడ్డి జగదీష్‌ ఎమ్మెల్సీగా పనిచేశారు. పార్టీ ఓడిన తర్వాత.. తామూ ఓడి.. చేతిలో పవర్‌ లేకపోవడంతో పూర్తిగా సైలెంట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు ఆ ఇద్దరు. కేవలం అధికారం లేక వీళ్లు ఇలా కాలేదు. గతం వెంటాడుతుండటంతో గమ్మున అయ్యారట.

అధికారంలో ఉన్నప్పుడు నిధులు పక్కదారి పట్టించారా?

మాజీ ఎమ్మెల్సీ జగదీష్ భార్య 2015 నుంచి 2020 వరకు మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆ సమయంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. జగదీష్ సోదరుడితో కలిసి మున్సిపల్‌ ఛైర్‌పర్సన్ అనేక అక్రమాలకు పాల్పడినట్టు టీడీపీ కేడర్‌ ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకొంటోందట. కాంట్రాక్టులన్నీ మరిదికి కట్టబెట్టి మున్సిపల్‌ నిధులు పక్కదారి పట్టించారని చెబుతారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు తక్కువేం చేయలేదన్నది తమ్ముళ్ల వాదన. పార్టీ నాయకులు ఏదైనా పనిపై వెళ్లితే.. నాకేంటి లాభం అని ముఖం మీదే అడిగేవారని ఆరోపిస్తూ.. నాటి ఘటనలను మర్చిపోలేకపోతున్నారట.

తమ బాగోతాలు బయటపడి దొరికిపోతామని భయపడ్డారా?

మాజీ ఎమ్మెల్యే.. మాజీ ఎమ్మెల్సీల వైఖరితో జనమే కాకుండా టీడీపీ కేడర్‌ విసుగెత్తిపోయినట్టు చెబుతారు. రివెంజ్‌ కోసం ఎదురు చూసి.. 2019 ఎన్నికల్లో సగం మంది టీడీపీ కేడర్‌ వైసీపీ వైపు టర్న్‌ తీసుకున్నట్టు సమాచారం. దాంతో ఆ ఎన్నికల్లో టీడీపీ విజయాలకు గండిపడి… వైసీపీ నుంచి బరిలో ఉన్నా జోగారావు ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాతైన పార్టీ నేతలు గుణపాఠం నేర్చుకోలేదట. అధికారమే దూరమైన తర్వాత రోడ్డెక్కడం ఎందుకు అనుకున్నారో లేక.. బయటకొస్తే తమ బాగోతాలు బయటపడి అధికార వైసీపీకి దొరికి పోతామని భయపడ్డారో కానీ ఇద్దరికి ఇద్దరూ సైలెంట్‌ అయిపోయారు. ప్రస్తుతం పార్వతీపురం ప్రజల సమస్యలను సైతం టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదట.

ఆరు వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవం..లోపాయికారీ ఒప్పందమేనా?

పంచాయతీ, పరిషత్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో సైతం చిరంజీవులు, జగదీష్‌లు లీడ్‌ రోల్‌ తీసుకోలేదనే విమర్శ పార్టీ వర్గాల్లో ఉంది. పైగా ఇద్దరూ వైసీపీతో కుమ్మక్కయ్యారని చెవులు కొరుక్కుంటోంది కేడర్‌. పార్వతీపురం మున్సిపాలిటీలో 30 వార్డులు ఉంటే.. 24 చోట్లే మాత్రమే టీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆరు వార్డుల్లో అభ్యర్ధులే కరువయ్యారు. దీంతో ఆ ఆరు వార్డులు ఏకగ్రీవంగా వైసీపీ ఖాతాలో పడ్డాయి. ఆ ఇద్దరూ వైసీపీతో కుదుర్చుకున్న లోపాయికారీ ఒప్పందం మేరకే ఆ ఆరుచోట్లా అభ్యర్థులను పెట్టలేదని ఇప్పటికీ గుర్రుగా ఉన్నారట పార్టీ కేడర్‌.

టీడీపీ కేడర్‌ గగ్గోలు పెట్టినా.. పట్టించుకోవడం లేదా?

ఇక నియోజకవర్గంలో టీడీపీకి కీలకమైన సీతానగరం మండలంలో ఆ పార్టీ పూర్తిగా వాష్‌ అవుట్‌. దీనికితోడు స్థానిక ఎమ్మెల్యే జోగారావు సైతం టీడీపీలో ఉన్న లుకలుకలను క్యాష్ చేసుకుంటూ.. పూర్తిస్థాయిల పార్వతీపురంలో విస్తరిస్తున్నారట. ఇది కూడా టీడీపీ బలహీనం కావడానికి కారణమవుతోంది గగ్గోలు పెడుతోంది కేడర్‌. రాష్ట్రంలో కీలక రాజకీయ అంశాలపై ఫోకస్‌ పెట్టిన టీడీపీ పెద్దలు.. పార్వతీపురాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. దీంతో జెండా పట్టుకుని ఉన్న కొద్దిమందీ మెల్లగా జారుకునే పనిలో ఉన్నారట.

Related Articles

Latest Articles