ఎంపీగా గల్లా ఒరగబెట్టింది ఏమీ లేదని కేడర్‌ సెటైర్లు..!

ఆయన గళం విప్పితే ప్రజలు జేజేలు కొట్టారు. అండగా ఉంటారని ఆదరించారు. తీర చూస్తే ప్రజలను.. కార్యకర్తలను వదిలేసి.. అంతఃపురం దాటి బయటకు రావడం లేదట. నాయకుడి జాడ లేక వేరే దారి వెతుక్కుంటున్నారట కార్యకర్తలు. మనవాడు ఇప్పుడే కాదు.. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఏదో ఒక సాకుతో చెక్కేయడం కామనే అని సెటైర్లు వేస్తోంది కేడర్‌. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ?

అందుబాటులో లేని నేతను వదిలించుకోవాలని కేడర్‌ చూస్తోందా?

గుంటూరు జిల్లా రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు గల్లా జయదేవ్. రెండు పర్యాయాలుగా గుంటూరు ఎంపీ. అంతకుమించి జిల్లాకు.. సూపర్‌స్టార్‌కు అల్లుడు. ఈ గుంటూరు ఎంపీ విషయంలో టీడీపీ హైకమాండ్ మనసులో ఏం ఉందో కేడర్‌కు అర్థం కావడం లేదు. పార్టీలో ఉండి.. పదవి అనుభవిస్తూ.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండే నేతలను.. అధిష్ఠానం చూస్తూ ఉంటుందే తప్ప వెంటనే ఎటువంటి చర్యలు తీసుకోదు. కాలమే సమస్యకు పరిష్కారం చూపుతుంది అన్నట్టు వ్యవహరిస్తుంది. కేడర్‌ మాత్రం అందుబాటులో లేని నేతను వదిలించుకోవాలని చూస్తుంటుంది. గుంటూరులో ఇప్పుడు అదే జరుగుతోంది.

గుంటూరులో పెద్దగా ఒరగబెట్టింది ఏమీ దేని సెటైర్లు..!

2014, 2019 ఎన్నికల్లో జిల్లాకు వచ్చినా రాకపోయినా.. నియోజకవర్గంలో తిరిగినా తిరగకపోయినా.. వైసీపీ సునామీలో సైతం గల్లా జయదేవ్‌కు గుంటూరు ప్రజలు పట్టం కట్టారు. అలాంటి గుంటూరు ప్రజల కష్టాలు ఎంపీకి ఏ మాత్రం పట్టడం లేదట. కరోనా కష్టకాలం నుండి అడపా దడపా గుంటూరుకి రావడం మినహా.. లోక్‌సభ పరిధిలో జయదేవ్‌ చేసిందేమీ లేదంటారు. ఆ మాటకు వస్తే చేయడానికి ఏమీ లేదు. 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం అండగా ఉన్నప్పుడే జయదేవ్ గుంటూరు పార్లమెంట్‌లో పెద్దగా ఒరగబెట్టింది ఏమీ లేదన్న మాటలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నదేమో వైసీపీ ప్రభుత్వం. గల్లానేమో టీడీపీ ఎంపీ. ఆ సాకుతో జిల్లా ఛాయలకు రావడం లేదు ఎంపీ.

కొత్త నాయకుడు కావాలని టీడీపీ హైకమాండ్‌కు తమ్ముళ్ల అర్జీ..!

వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ఒకటి రెండుసార్లు రాజధాని ప్రాంతంలో ఉద్యమాల పేరిట మెరుపులా మెరిసిన గల్లా జయదేవ్ ఆ తర్వాత కంటికి కూడా కనిపించడం లేదు. ఉంటే హైదరాబాద్ లేదంటే విదేశాలు.. అంతేగాని గుంటూరులో అడుగుపెట్టడం లేదు. దీంతో గల్లా జయదేవ్ వ్యవహారం టీడీపీ అధిష్ఠానంతోపాటు పార్లమెంట్ పరిధిలోని కార్యకర్తలు సీరియస్‌గా తీసుకుంటున్నారట. కష్టకాలంలో రైతులకు.. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాల్సిన నాయకులు పార్టీని వదిలేసి తిరుగుతుంటే.. మాకు కొత్త నాయకుడు కావాలని అధినేత దగ్గర అర్జీ పెడుతున్నారట తమ్ముళ్లు.

గల్లా అనుచరులు చేస్తోన్న ప్రచారాన్ని సొంత పార్టీ నేతలే తిప్పికొడుతున్నారా?

కష్టకాలంలో పార్టీనీ.. ప్రజలను వదిలేసే నాయకులను భవిష్యత్‌లో దూరంగా పెట్టాలని హైకమాండ్‌కు సూచిస్తోందట కేడర్‌. గుంటూరు పార్లమెంటు పరిధిలో నాయకుడిని మార్చాలి అనే ప్రచారం జోరుగా సాగుతోంది. వేరే పార్టీతో టీడీపీకి పొత్తు కుదిరితే.. పార్లమెంట్ అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో గల్లాకు రాజకీయ గండం పొంచి ఉందని చెప్పక తప్పదు. మరోవైపు ప్రభుత్వ వేధింపులు.. ఒత్తిళ్లు అని గల్లా జయదేవ్ అనుచరులు చేస్తున్న ప్రచారాన్ని సొంత పార్టీ నేతలే తిప్పి కొడుతున్నారు. రాజకీయమంటే పోరాటం చేయాలి… ప్రజలను కాపాడాలి.. ప్రత్యర్థులను ఢీకొట్టాలి. అంతేగాని భయపడి ఇంట్లో కూర్చొనే వారిని కార్యకర్తలు ఆదరించే పరిస్థితి లేదని తెగేసి చెబుతున్నారు తమ్ముళ్లు. మరి.. గుంటూరు విషయంలో టీడీపీ అధిష్ఠానం ఏం చేస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles