పవన్ సీఎం కావాలంటే.. టీడీపీ త్యాగం చేయాల్సిందేనా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం అటూ రాజకీయాల్లో.. ఇటూ సినిమాల పరంగానూ బీజీగా మారిపోయారు. ఒకేసారి రెండు పడవలను నడుపుతున్న ‘పవర్ స్టార్’ తొలి నుంచి తనది పాతికేళ్ల రాజకీయమని చెప్పుకొస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే రాజకీయ అనుభవాన్ని సంపాదిస్తూ ముందుకెళుతున్నారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రాజకీయపరంగా చాలా గుణపాఠాలను నేర్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. అయితే పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీని లైమ్ లైట్లోనే ఉంచే సినిమాలు చేస్తుండటంతో వచ్చే ఎన్నికలకు ఆయన ఖచ్చితంగా పొత్తులతోనే వెళుతారనే టాక్ విన్పిస్తోంది.

ఇప్పటికే జనసేన పార్టీ కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకుంది. అయితే కేంద్రంలో ఎలాంటి మంత్రి పదవులను తీసుకోలేదు. ఇక తిరుపతి ఉప ఎన్నిక సీటును జనసేన ఆశించినా ఆ సీటు బీజేపీకే దక్కింది. ఈ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల నాటికి జనసేన-బీజేపీ కూటమి పొత్తు ఉంటుందా? లేదా అనేది క్లారిటీ లేదు. కానీ ఇప్పటికైతే ఆ రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2014లో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన కూటమికి పవన్ కల్యాణ్ ఎలాంటి షరతులు లేకుండానే సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఈ కూటమిలో నాడు బీజేపీ కూడా ఉంది. ఆ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చిన టీడీపీ కూటమి విజయం సాధించింది. బాబు అధికారంలోకి వచ్చాక జనసేనకు టీడీపీకి మధ్య విబేధాలు రావడంతో పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక్క సీటు రాగా, టీడీపీకి 23సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఇరుపార్టీలు భారీగా నష్టపోయాయి.

ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తుపెట్టుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. జనసేన సైతం టీడీపీతో పొత్తు విషయంలో పాజిటివ్ గానే ఆలోచిస్తుందని సమాచారం. అయితే ఈసారి పవన్ కల్యాణ్ గతంలోగా ఎలాంటి కండిషన్లు లేకుండా మద్దతు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. జనసేనతో టీడీపికి పొత్తు ఈసారి అంత ఆషామాషీ కాదని బోలెడన్నీ కండిషన్లు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. బాబు వీటన్నింటికే ఒప్పుకుంటేనే పొత్తు పొడుస్తుందని లేకుంటే ఎవరిదారి వారు చూసుకోవాల్సిందనే మాటలు విన్పిస్తున్నాయి

పవన్ కల్యాణ్ తనది పాతికేళ్ల రాజకీయమని ముందు నుంచే చెబుతున్న నేపథ్యంలో ఆయన టార్గెట్ 2029 ఎన్నికలే అని తెలుస్తోంది. ఈనేపథ్యంలో పవర్ స్టార్ 2024లో సీఎం సీటును వదులుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. బాబుకు సీఎం సీటు ఆఫర్ చేసే నేపథ్యంలో ఆయన తనయుడు నారా లోకేష్ ను సైడ్ చేయాల్సిందేననే కండిషన్ ను పవన్ పెట్టే అవకాశం ఉందట. టీడీపీలో లోకేష్ నాయకత్వానికి బాబు పావులు కదుపుతున్న నేపథ్యంలో లోకేష్ ను ముందుకు తీసుకొస్తే జనసేన దానిని వ్యతిరేకించే అవకాశం ఉందని తెలుస్తోంది.

అలాగే పొత్తుల్లో భాగంగా పెద్దఎత్తున సీట్లు అడగడంతోపాటు గెలిచిన తర్వాత ప్రభుత్వంలో చేరిన తర్వాత కీలక మంత్రిత్వ శాఖల విషయంలో ముందుగానే ఒప్పందం కుదుర్చుకునే ఆలోచనలో పవన్ ఉన్నారట. టీడీపీకి ఒక్క చాన్స్ అంటూ ఇస్తే అది 2024లో మాత్రమేనని జనసైనికులు సైతం అంటున్నారు. 2029 నాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే తాము పోటీ పడతామని.. అప్పటికి టీడీపీ ఉనికి కూడా ఇబ్బందులో పడే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. టీడీపీ 2029 వరకు నీరుగారిపోయే అవకాశాలు ఎక్కువని.. చంద్రబాబుకు వృద్ధాప్యం వస్తే లోకేష్ పార్టీని లీడ్ చేయలేడని.. అప్పుడు జనసేననే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని పవన్ ఈ స్కెచ్ గీసినట్టు సమాచారం. పవన్ సీఎం కావాలంటే ఇదే ప్లాన్ బెస్ట్ అని.. టీడీపీని ఆ దిశగా మలచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఒకవేళ తన కుమారుడి కోసమే రాజకీయం చేస్తే జనసేన నుంచి ప్రస్తుతం వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. దీంతో ఈసారి పవన్ కల్యాణ్ తో పొత్తు అంత ఈజీ కాదనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ పొత్తు పొడుస్తుందా? లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-