ప్రధాని కాన్వాయ్ అడ్డుకున్న ఘటనపై టీబీజేపీ ఆందోళన

ప్రధాని కాన్వాయ్ ను అడ్డుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై చర్యలు తీసుకునేలా రాష్ట్రపతికి నివేదించండి అని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ ను కలిసి వినతి పత్రం అందజేసింది బీజేపీ ప్రతినిధి బృందం. ఈనెల 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ప్రధానమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరపడంతోపాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖకు నివేదించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ను కోరారు. ఈ మేరకు బండి సంజయ్ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రతినిధులు గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.

రూ.42,500 కోట్ల అంచనా వ్యయంతో పంజాబ్ లో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి వెళుతుండగా నిరసన పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడం గర్హనీయమని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఇది సాధ్యం కాదని, నీచమైన ఈ చర్యకు సూత్రధారి కాంగ్రెస్ పార్టీయేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికైనా దిగజారుతోందనడానికి ఇదే నిదర్శనమన్నారు.

ప్రధానమంత్రిని రాజకీయాలలోకి లాగడం, కించపరిచే ప్రయత్నం చేయడమంటే 140 కోట్ల మంది భారతీయులను అవమానించినట్లేనని పేర్కొన్నారు. అభివృద్ధిలో ప్రధాని నరేంద్రద మోదీతో పోటీ పడలేక ఎన్నికల బరిలోకి దిగలేక కాంగ్రెస్ ఇలాంటి నీచమైన చర్యకు ఒడిగట్టిందని తెలిపారు. కాంగ్రెస్ డీఎన్ఏ లోనే ఇలాంటి అవలక్షణాలన్నీ ఉన్నాయని తెలిపారు. ప్రధానమంత్రి రోడ్డపై ప్రయాణించబోతున్నారని ఫిరోజ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ నిరసనకారులకు ముందుగానే తెలియజేసినట్లు కథనాలు వచ్చాయని, అత్యంత సున్నితమైన ఈ అంశం గురించి నిరసనకారులకు సంబంధిత ఎస్పీ సమాచారం ఇవ్వడమేంటని ప్రశ్నించారు.

యావత్ దేశం ఈ సంఘటన పట్ల విస్మయం వ్యక్తం చేస్తోందని, ప్రధానమంత్రి భద్రత గురించి సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. రాష్ట్రపతి వద్ద ప్రధాని సైతం ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని భద్రత విషయంలో పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును బీజేపీ తెలంగాణ శాఖ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఈ అంశంపట్ల తెలంగాణ ప్రజలు సైతం తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపడంతోపాటు బాధ్యులైన వారందరినీ చట్టపరమైన చర్యలు తీసుకునేలా రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేయవలసిందిగా గవర్నర్ కు విజ్ఝప్తి చేశారు.

Related Articles

Latest Articles