కారు చిచ్చుకి కారణం ఎవరు?

ఆ నియోజకవర్గంలో ప్రభుత్వ పథకం అధికారపార్టీలో చీలిక తెచ్చిందా? వర్గపోరు బయటపడిందా? ఎమ్మెల్యే చేసిన కామెంట్స్‌ విభేదాలను మరో అంకానికి తీసుకెళ్లాయా? ఏంటా నియోజకవర్గం? ఎవరా ఎమ్మెల్యే?

బీసీ, కాపు సామాజికవర్గాల మధ్య ఆధిపత్యపోరు..!
సైలెంట్‌ రాజకీయాలకు పెట్టింది పేరైన తణుకులో ప్రస్తుతం రాజకీయం వాడీవేడిగా ఉంది. అదీ అధికార వైసీపీలో కావడంతో మరింత అటెన్షన్‌ వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. ఈ నియోజకవర్గంలో బీసీ, కాపు సామాజికవర్గాల మధ్య ఆధిపత్యపోరు ఉంది. ఆ సమస్య పెద్దగా బయట పడింది లేదు. తెరవెనక ఎత్తుగడలకు పరిమితమైన ఈ రగడ.. గత నెలలో సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బయటపడింది. ఆహ్వాన పత్రాల్లో, ఫ్లెక్సీలలో MSME డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వంకా రవీంద్రనాథ్‌ పేరు కావాలనే పెట్టలేదని కాపు సామాజికవర్గం ప్రతినిధులు భగ్గుమన్నారు. ఆ గొడవ చల్లారకముందే జనవరి 2న YSR పెన్షన్‌ కానుక పార్టీ నేతల మధ్య మరో చిచ్చు పెట్టింది.

ప్రొటోకాల్‌ విషయంలో వైసీపీ టౌన్‌ అధ్యక్షుడిపై ఎమ్మెల్యే ఫైర్‌
ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు లేకుండానే వంకా రవీంద్రనాథ్‌ పెన్షన్లు పంపిణీ చేశారు. దీంతో ఎవరిని అడిగి ఆ కార్యక్రమం నిర్వహించారని వైసీపీ తణుకు అధ్యక్షుడు MSS రెడ్డిని నిలదీశారు ఎమ్మెల్యే. ప్రొటోకాల్ పాటించకపోవడంపై భగ్గున్నారు. ఎమ్మెల్యే ఆగ్రహం తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి MSS రెడ్డి రాజీనామా చేశారు. వాస్తవానికి ఎమ్మెల్యే నోరు విప్పితే అడ్డూ ఆపూ ఉండదనే విమర్శ ఉంది. ఈ గొడవలో MSS రెడ్డి ఆయన తమ్ముడు రాంరెడ్డిని ఎమ్మెల్యే తిట్టడంవల్లే రాజీనామాల వరకు వెళ్లిందని తణుకు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

సీఎంను తీసుకొచ్చి బర్త్‌డే చేయడం తన కొంప ముంచిందన్న ఎమ్మెల్యే..!
నిన్న మొన్నటి వరకు ఒక్కటిగా కనిపించిన తణుకు వైసీపీ.. ప్రస్తుతం వర్గాలుగా విడిపోయింది. జరిగిన పరిణామాలను ఉభయగోదావరి జిల్లాల వైసీపీ ఇంఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డికి పార్టీ నేతలు చెప్పారట. అయితే ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఓపెన్‌గా చేసిన కామెంట్స్ చుట్టూనే ప్రస్తుతం వివాదం తిరుగుతోంది. సీఎంను తీసుకొచ్చి బర్త్‌డే చేశాను.. అదే నా కొంప ముంచింది. అర్జంటుగా ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయిపోవాలి. నేను దిగిపోవాలని అని కోరుకుంటున్నాడు. కాపులకు, బీసీలకు మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని సొంతపార్టీ నాయకులే చూస్తున్నారు అని ఎమ్మెల్యే అనడంతో దుమారం రేగుతోంది. ఎదురుగా వచ్చే వారితో పోరాడవచ్చు. వెనక ఉండి పొడి చేసేస్తున్నారు అని సొంత పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు కారుమూరి నాగేశ్వరరావు.

తణుకుపైనే అధికారపార్టీలో అందరి దృష్టి
పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో పెద్దగా చర్చల్లోకి రాని తణుకు.. ఈ విధంగా అధికారపార్టీలో అలజడి రేపడంతో అందరి దృష్టీ ఇటు పడింది. కులాల కుంపట్లు సెగలు రాజేయకుండా.. రాజీనామాలు, వెన్నుపోట్లు శ్రుతిమించకుండా పార్టీ పెద్దలు జోక్యం చేసుకుంటారో లేదో అని కేడర్‌ ఎదురు చూసే పరిస్థితి ఉంది. మరి.. తణుకు ఎపిసోడ్‌కు ఎండ్‌కార్డు ఉందో లేదో చూడాలి.

Related Articles

Latest Articles