బుక్ మై షో దోపిడీని అరికట్టాలి : తమ్మారెడ్డి భరద్వాజ

ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానాన్ని తెలుగు నిర్మాతలు ఎప్పటి నుండో కోరుతున్నారని, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ ప్రభుత్వం సైతం ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టాలని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కోరారు. ప్రస్తుతం ఉన్న బుక్ మై షో వంటి సంస్థలు దారుణంగా ప్రేక్షకుడిని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఒక్కో టిక్కెట్ కు 20 నుండి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయని, అందులో కేవలం ఐదారు రూపాయలను మాత్రమే ఎగ్జిబిటర్స్ కు ఇస్తున్నాయని, మిగిలిన మొత్తం ఎవరు తింటున్నారో తెలియదని అన్నారు. బుక్ మై షో దోపిడీని వెంటనే అరికట్టాలని, వాటిని వీలైనంత త్వరగా సాగనంపాలని, దానికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయ ఏర్పాటును ప్రభుత్వాలు చేయాలని చెప్పారు.

Read Also : ఇద్దరి మంచికే… సామ్ తో డివోర్స్ పై నాగ చైతన్య ఫస్ట్ రియాక్షన్

అయితే ఆన్ లైన్ టిక్కెటింగ్ ను ప్రభుత్వం కాకుండా ఎఫ్.డి.సి, ఫిల్మ్ ఛాంబర్ సంయుక్త నిర్వహణలో జరిపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వానికి రావాల్సిన టాక్సుల గురించి ఎఫ్.డి.సి. పట్టించుకుంటే, నిర్మాతలకు రావాల్సిన డబ్బుల గురించి ఫిల్మ్ ఛాంబర్ బాధ్యత వహిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న విధానం చాలా లోపభూయిష్టంగా ఉందని చెబుతూ, ‘థియేటర్ హౌస్ ఫుల్ అయినా, డీసీఆర్ లలో కలెక్షన్లు చూపించడం లేదని, ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానం వస్తే అలాంటి అక్రమాలకు చోటు ఉండదని, డీసీఆర్ ను ఎగ్జిబిటర్ పంపే లోపే ఆన్ లైన్ లో తమ చిత్రం ఎంత కలెక్ట్ చేసింది నిర్మాతకు తెలిసిపోతుందని, అందుకే ఈ విధానాన్ని స్వాగతించామ’ని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు.

Related Articles

Latest Articles