తమిళనాడు మత్స్యకారుల దోపిడీ.. ప్రకాశం మత్స్యకారుల పస్తులు

సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులు. అయితే, ఓ వర్గం నిబంధనల్ని తుంగలోకి తొక్కి చేపల్ని వేటాడుతోంది. దీంతో మరో వర్గం ఆకలితో అలమటిస్తోంది. ప్రకాశం జిల్లాలో తమిళనాడు మత్స్యకారుల దోపిడీ హాట్ టాపిక్ అవుతోంది. ప్రకాశం జిల్లా మత్స్యకారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తమిళనాడు నుంచి వస్తున్న మెకనైజ్డ్‌ బోట్లు మత్స్య సంపదను దోచుకుపోతుండడంతో ఆకలితో అలమటిస్తున్నారు స్థానిక జాలర్లు. కడుపు కాలి ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే వలల్ని, బోట్లను ధ్వంసం చేస్తున్నారు. భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారు తమిళ జాలర్లు. ప్రకాశం జిల్లాలో 104 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీరం ఉంది. కొత్తపట్నం, చీరాల మండలంలోని ఓడరేవు, పాకల, రామాయపట్నం, చిన్నగంజాం మండలంలోని మోటుపల్లితో పాటు దాదాపు 67 తీర ప్రాంత మత్స్యకార గ్రామాలున్నాయి. వీరంతా చేపల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

ప్రకాశం జిల్లాకు చెందిన వివిధ గ్రామాల జాలర్ల మధ్య చాలా కాలంగా వివాదాలు ఉన్నాయి. బల్ల వల- ఐలా వల అంటూ ఎప్పుడూ గొడవపడుతుంటారు. అయితే, మత్స్యకార గ్రామాల పెద్ద కాపులు, అధికారుల చొరవతో వివాదాలు పరిష్కారమవుతుంటాయి. అయితే… ఇప్పుడు ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, గుంటూరు జిల్లాల మత్స్యకారులకు ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. తమిళనాడు కడలూరుకు చెందిన మత్స్యకారులు మెకనైజ్డ్‌ బోట్లలో ప్రకాశం తీరానికి వచ్చి యథేచ్ఛగా చేపల్ని వేటాడుతున్నారు.

ప్రకాశం జిల్లాలో పట్టుమని 20 మెకనైజ్డ్‌ బోట్లు కూడా లేవు. అవి కూడా తీరంలో చేపలు వేటాడడం లేదు. స్థానిక మత్స్యకారులు చిన్నచిన్న పడవల సాయంతోనే చేపల్ని వేటాడుతూ జీవిస్తున్నారు. అయితే, తమిళనాడులో వేల సంఖ్యలో మెకనైజ్డ్‌ బోట్లు ఉన్నాయి. రింగ్‌ వలల్ని వాడడం వల్ల ఇప్పటికే తమిళనాడు తీరంలో మత్స్య సంపద బాగా తగ్గిపోయింది. దీంతో గుంపులు గుంపులుగా ఆంధ్రప్రదేశ్‌ తీరానికి వచ్చి… చేపల్ని వేటాడుతున్నారు. నిబంధనల్ని లెక్క చేయకుండా తీరానికి అతి సమీపంలో చేపల్ని పడుతున్నారు తమిళ జాలర్లు.

తీరం నుంచి 8 కిలో మీటర్ల పరిధిలో మెకనైజ్డ్‌ బోట్లతో చేపలు పట్టకూడదు. అలాగే, రింగ్‌ వలల్ని వాడకూడదు. సాధారణంగా చేప పిల్లలు తీరంలోనే పెరుగుతాయి. అందువల్ల అవి చిక్కుకోని విధంగా తయారు చేసిన వలలు మాత్రమే వినియోగించాలి. ఎందుకంటే చిన్న కన్ను వలలతో చేప పిల్లల్ని కూడా వేటాడేస్తే సముద్రంలో మత్స్య సంపద వృద్ధి చెందే అవకాశం ఉండదు. తమిళనాడు ప్రభుత్వం కూడా చిన్న కన్ను వలల్ని నిషేధించింది.

కానీ… తమిళ జాలర్లు ఈ నిబంధనల్ని తుంగలోకి తొక్కుతున్నారు. సముద్ర తీరానికి దాదాపు కిలో మీటరు పరిధిలోకి వచ్చి మరీ యథేచ్ఛగా చేపల్ని వేటాడుతున్నారు. వలల్ని పడవల్లోకి లాగేందుకు వైబ్రేటర్లను వినియోగిస్తున్నారు. అయితే, ఈ వైబ్రేటర్ల వినియోగం వల్ల తీరంలో కూడా భూమి కంపిస్తుందని, తమ ఇళ్లలో వస్తువులు కదులుతున్నాయని వాపోతున్నారు స్థానిక మత్స్యకారులు. ఫలితంగా తమకు కంటి మీదు కునుకు ఉండడం లేదంటున్నారు.

తమిళ మెకనైజ్డ్‌ బోట్లను అడ్డుకునేందుకు స్థానిక మత్స్యకారులు ప్రయత్నిస్తుండడంతో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. గతంలో పలుమార్లు తీరంలో చేపల్ని వేటాడుతున్న తమిళ జాలర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానిక గంగపుత్రులు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో ఇరు పక్షాలకు చెందిన వాళ్లు గాయపడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది. కానీ… ఇప్పుడు తమిళ మత్స్యకారులు ఎనిమిది నుంచి పది మెకనైజ్డ్‌ బోట్లలో ఇక్కడి వస్తున్నారు. వాళ్లను అడ్డుకోడానికి ప్రయత్నించిన స్థానిక మత్స్యకారులపై మూకుమ్మడిగా విరుచుకుపడుతున్నారు. దీంతో తమిళ మత్స్యకారులు తమ ప్రాంతానికి వచ్చి తమపైనే దాడులు చేస్తున్నారని వాపోతున్నారు స్థానికులు.

తమిళ మత్స్యకారుల్ని అదుపు చేయడంలో అధికారులు విఫలమౌతున్నారు. ముఖ్యంగా నిబంధనల్ని తుంగలోకి తొక్కి పర్యావరణాన్ని సైతం నాశనం చేస్తున్నా… వాళ్లపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. తీరంలోకి వచ్చి వేటాడుతున్నా… రింగ్‌ వలల్ని ఉపయోగిస్తున్నా… అడిగే నాథుడే లేడు. మెరైన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా… ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపానికి పోవడం లేదు. దీంతో తమకు అడ్డే లేదనే ఉద్దేశంతో తమిళ జాలర్లు మరింతగా రెచ్చిపోతున్నారు.

Related Articles

Latest Articles