మాధవన్ ఇప్పటికీ ప్రియ ‘సఖు’డే!

(జూన్ 1 మాధవన్ పుట్టిన రోజు సందర్భంగా)
ఆర్. మాధవన్… పలు భారతీయ భాషా చిత్రాలలో నటించి, పాన్ ఇండియా అప్పీల్ ను పొందిన ఛార్మింగ్ హీరో! రెండు దశాబ్దాల క్రితం మణిరత్నం తెరకెక్కించిన ‘అలైపాయుతే’లో నటించి, ‘సఖి’గా తెలుగు ప్రేక్షకుల ముందుకూ వచ్చాడు. అప్పటి ఆ ఛార్మింగ్ ఇంకా మాధవన్ లో అలానే ఉంది. అయితే… ఆ చాక్లెట్ బోయ్ లో ఉన్న వేరియషన్స్ ను కొందరు దర్శకులు తమదైన శైలిలో ప్రేక్షకుల ముందుకు ఆవిష్కరించారు. ‘సఖి’ తర్వాత ‘చెలి’గా గౌతమ్ మీనన్ దర్శత్వంలో నటించి… ఆ సినిమాతోనూ కుర్రకారుని మెప్పించాడు మాధవన్. విశేషం ఏమంటే… సినిమా జయాపజయాలతో నిమిత్తం లేకుండా మాధవన్ ను ప్రేక్షకులు తమ వాడిగా భావించి హృదయానికి హత్తుకున్నారు. తమిళంలో స్టార్ హీరో రేంజ్ కు వెళ్ళిన మాధవన్ చిత్రాలు అనేకం తెలుగులోనూ డబ్ అయ్యాయి. మణిరత్నం రూపొందించిన ‘అమృత, గురు’ సినిమాల్లో మాధవన్ లోని గొప్ప నటుడిని మనం చూస్తాం. అలానే ‘రన్, అన్బే శివం, వేట్టై ‘ వంటి చిత్రాల్లో భిన్నమైన పాత్రలు పోషించి తన అభిమానులను తృప్తి పరిచాడు. ఇటు తమిళంలోనే కాదు… అటు హిందీలోనూ మాధవన్ జాబితాలో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. అతను నటించిన ‘రంగ్ దే బసంతి, గురు, త్రీ ఇడియట్స్, తను వెడ్స్ మను, తను వెడ్స్ మను రిటర్న్’ వంటి చిత్రాలను మర్చిపోలేం. బేసికల్ గా మాధవన్ ది కష్టపడే మనస్తత్వం. అందుకే క్షణం కూడా ఖాళీగా ఉండటానికి ఇష్టపడడు. కేవలం నటుడిగా ఉండిపోకుండా పలు చిత్రాలకు స్క్రీన్ ప్లేను అందించాడు. అంతేకాదు… హిందీ చిత్రం ‘డోంబివలీ ఫాస్ట్ ‘ను తమిళంలో ‘ఎవనో ఒరువన్’ పేరుతో రీమేక్ చేసి, తానే నిర్మాతగా వ్యహరించాడు. ఆ తర్వాత ‘సాలా ఖద్దూస్’ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే… ప్రస్తుతం మాధవన్ చేస్తున్న ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్’ ఒక్కటీ మరో ఎత్తు. ప్రముఖ సైంటిస్ట్, ఏరో స్పేస్ ఇంజనీర్ నంబీ నారాయణన్ జీవితంలోని పలు సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రాకెట్రీ’. ఇందులో నంబి పాత్రను పోషించడమే కాదు… దీనికి తానే నిర్మాత, దర్శకుడు కూడా.

ఇలా నటన, చిత్ర నిర్మాణం, స్క్రీన్ ప్లే రైటింగ్, డైరెక్షన్ అంటూ తన ప్రతిభా పాటవాలను విస్తరించుకుంటూ పోతున్నాడు మాధవన్. ‘రాకెట్రీ’ మూవీ ప్రమోషన్ లో భాగంగా సైంటిస్ట్ నంబితో కలిసి ఆ మధ్య ప్రధాని నరేంద్ర మోదీకీ ఈ మూవీ విశేషాలు స్వయంగా తెలియచేసి, ఆయన అభినందనలూ అందుకున్నాడు. దాదాపు పాతికేళ్ళుగా పలు కమర్షియల్ ప్రాజక్ట్స్ కు అతను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. అలానే కొన్ని డాక్యుమెంటరీస్ ను రూపొందించాడు. పలు టీవీ గేమ్ షోస్ కు వ్యాఖ్యాతగా ఉన్నాడు. నాలుగు ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ తో పాటు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడు సార్లు బెస్ట్ ఆర్టిస్ట్ గా అవార్డులనూ అందుకున్నాడు.

మాధవన్ నటించిన తమిళ చిత్రాలు తెలుగుతో డబ్ కావడంతో మనవారికీ అతనంటే ఎంతో అభిమానం. దాంతో ‘ఓం శాంతి, సవ్యసాచి’ చిత్రాలలో మాధవన్ నటించాడు. ఈ రెండు సినిమాలు ఒక ఎత్తుకాగా బహుభాషా చిత్రం ‘నిశ్శబ్దం’ లో మాధవన్ పోషించిన ఆంటోని పాత్ర మరో ఎత్తు. నెగెటివ్‌ షేడ్స్ ఉండే ఈ పాత్రను మాధవన్ ఎంతో అద్భుతంగా పోషించాడు. అయితే… థియేటర్ల బంద్ కారణంగా గత యేడాది ద్వితీయార్ధంలో ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. ఈ యేడాది కూడా మాధవన్ నటించిన ‘మారా’ చిత్రం ఓటీటీలోనే స్ట్రీమింగ్ అయ్యింది.

కరోనా సెకండ్ వేవ్ సందర్భంగా మాధవన్ సైతం కొవిడ్ 19 బారిన పడి కోలుకున్నాడు. దాంతో ఇప్పుడు తన దృష్టిని కరోనా బాధితుల సేవపై పెట్టాడు. అంతే కాదు… ఈసారి పుట్టిన రోజు వేడుకలకూ దూరంగా ఉండాలనుకుంటున్నాడు. 52వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న మాధవన్ ఏ పనిచేసినా… చిత్తశుద్ధితో చేస్తాడు. సో అతని డైరెక్టోరియల్ డెబ్యూ ‘రాకేట్రీ’ ఘన విజయం సాధించి, అతని కెరీర్ ను మరో మెట్టు పైకి తీసుకెళ్ళాలని కోరుకుందాం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-