మేమింతే…! తాలిబాన్‌ సర్కార్!

మేమింతే.. మారేదే లేదు.. తాలిబాన్లు కుండ బద్దలు కొట్టారు . ఆఫ్గనిస్తాన్‌లో షరియా పాలనే సాగుతుందని తేల్చేశారు. అఫ్గానిస్తాన్‌ ఇకపై అధికారికంగా ‘‘ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్తాన్‌’’అవుతుంది. తాలిబాన్ల విధానాలు ఎలా వుండబోతున్నాయని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజా ప్రకటనతో దానికి తెరపడింది. ఇక, ముందు ముందు వాళ్లు ఏం చేస్తారో చూడాల్సివుంది.

ఆఫ్గనిస్తాన్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. దాంతో మళ్లీ ఆక్కడ తాలిబాన్‌ శకం మొదలైనట్టయింది. ఇకపై తాలిబన్‌ సుప్రీం లీడర్‌ మౌల్వీ హిబైతుల్లా అఖుంద్‌జాదా చెప్పేదే వేదం అక్కడ. ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పాలనా విధానంపై ఆయన కీలక ప్రకటన చేశారు. గత 20 ఏళ్ల నుంచి రెండు లక్ష్యాల కోసమే పనిచేశామని ..వాటిలో ఒకటి విదేశీ సేనలను వెళ్లగొట్టడం, రెండవది దేశంలో సుస్థిర ఇస్లామిక్‌ వ్యవస్థను ఏర్పాడు చేయటం. ఇదే ఆ ప్రకటన సారాంశం.

ఇక నుంచి ఆఫ్గనిస్తాన్‌లో పాలన పూర్తిగా ఇస్లామిక్‌ చట్టాల ప్రకారం సాగుతుంది. పౌరుల జీవితాలు ఎలా ఉండాలో ఇక షరియా చట్టం నిర్ణయిస్తుంది. భవిష్యత్‌ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటోంది తాత్కాలిక ప్రభుత్వం. అన్ని సమస్యలను సరైన మార్గంలో పరిష్కరిస్తామని ప్రకటించింది.

20 ఏళ్ల యుద్ధానికి తెరదించుతూ ఆగస్టు 15వ తేదీన తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాలిబాన్ ప్రభుత్వ ఏర్పాటులో ఈ తాత్కాలిక కేబినెట్ ఏర్పాటు కీలకమైనది. ఇందులో ముల్లా యాకూబ్‌ రక్షణ మంత్రిగా, ముల్లా అబ్దుల్ సలామ్ హనాఫీ సెకండ్ డిప్యూటీగా, అమీర్ ఖాన్ ముత్తాకి విదేశాంగ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. మిలిటెంట్ గ్రూప్ అయిన హక్కానీ నెట్‌వర్క్‌ అధిపతి సిరాజుద్దీన్ హక్కానీ దేశ హోం మంత్రిగా నియమితులయ్యారు. ఈయన ఇప్పటికీ అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. రెండు దశాబ్దాల పాటు అమెరికా, దాని మిత్ర సైన్యాలకు – తాలిబాన్లకు మధ్య జరిగిన యుద్ధంలో హక్కానీ పలు ప్రాణాంతక దాడుల సూత్రధారి.

తాలిబాన్లకు అనుబంధంగా పనిచేసిన హక్కానీ నెట్‌వర్క్‌ను ఉగ్రవాద సంస్థగా అమెరికా పరిగణిస్తోంది. అయితే, క్యాబినెట్‌లో మహిళలు ఎవరూ లేరు. దీనిపై మీడియా ప్రశ్నిస్తే .. ఇది పూర్తి స్థాయి క్యాబినెట్ కాదంటున్నారు తాలిబాన్‌ ప్రతినిధులు.

తాలిబన్లు అఫ్గాన్‌ను స్వాదీనం చేసుకున్నప్పటి నుంచి కాబూల్‌లో చైనా, పాకిస్థాన్ మాత్రమే తమ దౌత్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఇతర దేశాలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. అయితే చాలా దేశాలు వెయిట్ అండ్ వాచ్ విధానాన్ని అవలంభిస్తున్నాయి. యూఏఈ సహా పైన పేర్కొన్న ఆరు దేశాలు తాలిబన్ల పాలనను గుర్తించిన మొదటి దేశాలు కావచ్చు. మిగిలిన దేశాలు అఫ్గానిస్థాన్‌ అంశంపై ఎలా స్పందిస్తాయనే అంశంపై స్పష్టత లేదు.

భవిష్యత్తులో అఫ్గాన్లు తాలిబన్లకు మద్దతు ఇచ్చి వ్యవస్థను పటిష్ఠం చేయాలి. ప్రతిభావంతులైన విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు,ఇంజినీర్లు, వ్యాపార వేత్తలు, పెట్టుబడిదార్లకు ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ చాలా విలువనిస్తుంది. దేశానికి వారి మార్గదర్శకత్వం, సేవలు చాలా అవసరం. ప్రజలు దేశం విడిచి వెళ్లవద్దు. ఎవరితోనూ మాకు సమస్యలు లేవని తాలిబన్లు అంటున్నారు. అయితే ఇది మాటల వరకు బాగానే ఉంది.. మరి చేతల్లో ఎలా ఉంటుందో చూడాల్సి వుంది.

ఓవైపు విద్య చాలా ముఖ్యం అంటూనే.. మరోవైపు తాలిబన్ల పాలనలో పీహెచ్‌డీలు, ఎంఏలకు విలువ లేదంటున్నారు. తాలిబన్‌ విద్యాశాఖ మంత్రి షేక్‌ మౌల్వీ నూరుల్లా మునీర్‌ స్వయంగా ఈ మాట అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న ముల్లాలు, తాలిబన్లకు పీహెచ్‌డీ,ఎంఏ డిగ్రీలు ఉన్నాయా అంటూ ఎదురు ప్రశ్నించారాయన. వారికి కనీసం హైస్కూల్‌ విద్య కూడా లేదు. కానీ, వారే అందరికంటే గొప్పగా ఉన్నారని చాలా గర్వంగా చెపుతున్నారు తాలిబాన్‌ విద్యామంత్రి.

అఫ్గానిస్తాన్‌ తాత్కాలిక ప్రభుత్వాన్ని ముల్లా మొహమ్మద్ హసన్ అఖుండ్ నడిపిస్తారు. తాలిబాన్ కో ఫౌండర్‌ ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ ఆయనకు డిప్యూటీగా ఉంటారు. అయితే ఇప్పుడు చర్చ అంతా అఖుండ్ పైనే. అంతగా పేరు లేని తాలిబాన్‌ నేత కావటమే దీనికి కారణం. పైగా యూఎన్‌ బ్లాక్‌లిస్టులో కూడా ఉన్నాడు.

అఖుండ్‌ పేరు ఫైనల్‌ అయ్యే ముందు పాకిస్తాన్ ఐఎస్‌ఐ చీఫ్‌ ఫైజ్‌ అహ్మద్ ఆఫ్గనిస్తాన్‌లో పర్యటించాడు. దీనిని బట్టి ఆయన నియామకం పాకిస్తాన్‌ సూచనలతోనే జరిగినట్టు అర్థమవుతోంది. ఇది అనేక అనుమానాలకు తావిస్తోంది. తాలిబాన్ల నిబద్ధతపై సందేహాలను లేవనెత్తుతోంది.

అఖుండ్‌ గతంలో తాలిబాన్‌ నాయక మండలి పెద్దగా 20 ఏళ్ల పాటు పనిచేశారు. తాలిబాన్లకు సంబంధించిన ఏ నిర్ణయాన్నయినా ఈ మండలే తీసుకుంటుంది. దీని పేరు రెహబరీ షురా. గత తాలిబాన్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇతనికి మిలటరీ కమాండర్‌ గా కన్నా మత నాయకునిగానే తాలిబాన్లలో మంచి పేరుంది.

తాలిబాన్ల జన్మస్థలమైన కాందహార్‌లోనే ఇతడూ పుట్టాడు. ఈ గ్రూపు సాముధ ఉద్యమం వ్యవస్థాపకుల్లో అఖుండ్‌ ఒకరు. 2001లో జరిగిన బమియాన్‌ బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేయమని ఆర్డర్‌ వేసింది ఇతనే. ఆ విధ్వంసానికి రిలిజియస్‌ డ్యూటీ అని పేరు కూడా పెట్టాడు. ఇంత గొప్ప బ్యాగ్రౌండ్‌ ఉన్న తాలిబాన్‌ లీడర్‌ చేతిలో అఫ్గనిస్తాన్‌ ఎటు వెళుతుందో ముందు ముందు తెలుస్తుంది!!

Related Articles

Latest Articles

-Advertisement-