టీఆర్ఎస్, బీజేపీలను హడలెత్తిస్తున్న సింబల్స్…?

హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో రాజకీయవేడిని రగిలించింది. ఈ ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగనుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా ఈ ఉప ఎన్నిక మారింది. దీంతో ఇక్కడ గెలుపు ఇరువురికి ప్రతిష్టాత్మకంగా మారింది. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఛాలెంజ్ గా తీసుకొని హుజూరాబాద్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల అభ్యర్థులకు  మాత్రం ఎన్నికల గుర్తులు(సింబల్స్) టెన్షన్ కు గురిచేస్తున్నాయట…

హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో ఉన్న పలువురు స్వత్రంత అభ్యర్థులు టీఆర్ఎస్, బీజేపీలను ఇరుకునపెట్టేలా గుర్తులను ఎంచుకోవడం గమనార్హం. టీఆర్ఎస్ గుర్తు అయిన కారు, బీజేపీ గుర్తు అయిన కమలంను పోలిన పలు గుర్తులను స్వతంత్రులు ఎంచుకోవడంతో ఆపార్టీల అభ్యర్థులు లబోదిబోమంటున్నారు. ప్రధాన పోటీదారులుగా ఉన్న అభ్యర్థుల పేరుతో ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెల్సిందే. దీనికితోడు పార్టీ సింబల్స్ కూడా ఒకేరకంగా ఉండేలా చూసుకుంటుండటంతో ఓట్లు చీలే అవకాశం భారీగా కన్పిస్తోంది.

ఈ పరిణమాలన్నీ కూడా గెలుపుపై ధీమాగా ఉన్న టీఆర్ఎస్, బీజేపీలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను పలుచోట్ల ఓటమిపాలు చేశాయి. కారు సింబల్ ను పోలిన ట్రక్కు, రోడ్డు రోలర్, ట్రాక్టర్, చపాతి రోలర్, ఆటో రిక్షా, ఇస్త్రీ పెట్టె, బస్సు, లారీ గుర్తులు టీఆర్ఎస్ ఓట్లను గత ఎన్నికల్లో భారీగా చీల్చాయి. ఈక్రమంలోనే ఈ గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు.  

టీఆర్ఎస్ విజ్ఞప్తి మేరకు ట్రక్కు, రోడ్ రోలర్, ఆటో సింబల్స్ ను కేంద్ర ఎన్నికల సంఘం తొలగిచింది. అయితే కారును పోలిన చపాతి రోలర్, ట్రాక్టర్, ఇస్త్రీపెట్టె, బస్సు, లారీ గుర్తులను అందుబాటులో ఉంచింది. దీంతో స్వతంత్ర అభ్యర్థులు కావాలనే ఈ గుర్తుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా బీజేపీ కమలం గుర్తును పోలిన కాలీఫ్లవర్, పైనాపిల్ గుర్తులను ఈటల రాజేందర్ పేరుకు దగ్గరగా ఉన్న ఇ. రాజేందర్ అనే వ్యక్తులు ఎంచుకోవడం ఆసక్తిని రేపుతోంది.

బీజేపీ, టీఆర్ఎస్ లకు చెందిన గుర్తులను పోలిన వాటిని ఎన్నికల సంఘం ఆమోదిస్తే ఇరుపార్టీల అభ్యర్థులకు ఇబ్బందులు తప్పకపోవచ్చనే టాక్ విన్పిస్తుంది. అయితే ప్రత్యర్థిని ఓడించే వ్యూహాంలో భాగంగానే ప్రధాన పార్టీలే సింబల్స్ వార్ కు తెరలేపాయా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇక నేడు నామినేషన్ల పరిశీలన జరగనుండగా 13వరకు ఉపసంహరణ గడువు ఉంది. దీంతో వీటిపై ఆలోగా మరింత క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తుంది. మొత్తంగా స్వత్రంత్య అభ్యర్థులు ఎంచుకున్న గుర్తులు మాత్రం ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో గుబులును రేపుతోంది.

-Advertisement-టీఆర్ఎస్, బీజేపీలను హడలెత్తిస్తున్న సింబల్స్...?

Related Articles

Latest Articles