రష్యాలో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్‌..!

రష్యాలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ పోతోంది. మరణాల రేటు కూడా పెరిగింది. దాంతో అలర్ట్‌ అయిన రష్యా ప్రభుత్వం… కఠిన ఆంక్షలు విధించింది. కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న మాస్కో సహా మరికొన్ని ప్రాంతాల్లో పాక్షిక లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. దాంతో స్కూళ్లు మూతపడ్డాయి. అత్యవసర, నిత్యవసరాలకు మినహాయింపు ఇచ్చారు. అయితే, పాక్షిక లాక్‌డౌన్‌ కూడా పూర్తిగా అమలు కావడం లేదు. మెట్రోలాంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుపై ఎలాంటి ఆంక్షలు లేవు. దాంతో మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రోడ్లపై కార్లు యథావిధిగా తిరుగుతున్నాయి. హోటళ్లు టేక్‌ అవేకు అనుమతివ్వడంతో… జనం క్యూకడుతున్నారు. అయితే మున్ముందు సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించే అవకాశం ఉందన్న వార్తలతో… నిత్యవసరాల కోసం జనం రోడ్లపైకి వస్తున్నారు. మాంసం షాపుల వద్ద రద్దీ పెరిగింది. పరిస్థితి చూస్తుంటే లాక్‌డౌన్‌ అమలవుతున్నట్లు కన్పించడం లేదని చెబుతున్నారు స్థానికులు.

ఇటు వ్యాక్సినేషన్ కూడా నెమ్మదిగా సాగుతోంది. స్పుత్నిక్‌పై రష్యా ప్రజల్లో అనుమానాలు ఇంకా పోలేదు. ఆ దేశ జనాభాలో 32శాతం మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. ఐతే వ్యాక్సినేషన్‌ నెమ్మదిగా సాగుతుండటం వల్లే కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 40వేలకు పైగా ఉంది. ప్రతిరోజు కరోనా వైరస్‌తో వెయ్యి మందికి పైగా చనిపోతున్నారు. నవంబర్‌ 9 వరకు పాక్షిక లాక్‌డౌన్ కొనసాగనుంది. పరిస్థితి ఇలానే ఉంటే… సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటోంది రష్యా మీడియా.

Related Articles

Latest Articles