మరపురాని ‘మణి’ మధురం!

(జూలై 11న మణిశర్మ పుట్టినరోజు)
దరువేసి చిందేయించడమే కాదు, ముచ్చట గొలిపే బాణీలతో మురిపించడమూ మణిశర్మకు బాగా తెలుసు! అందుకే జనం ఆయనను ‘స్వరబ్రహ్మ’ అన్నారు, ‘మెలోడీ కింగ్’ అనీ కీర్తించారు. ఇప్పటికీ తనలో సత్తా తగ్గలేదంటున్నారు మణిశర్మ. నిజమే, ఆయన ఏమీ గ్యాప్ తీసుకోలేదు. సినీజనమే ఏవో లెక్కలు వేసుకొని మణిశర్మ పక్కకు చూడలేదు. చూసిన వారికి మాత్రం మణిశర్మ మధురమైన సంగీతాన్నే అందిస్తున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’కు మణి బాణీలు చేసిన సందడి చూసి, మళ్ళీ టాప్ స్టార్స్ ఆయన సంగీతం కోసం ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’కు మణి స్వరకల్పనలో రూపొందిన కొన్ని పాటలు ఇప్పటికే జనాన్ని కట్టి పడేశాయి. ఇక వెంకటేశ్ ‘నారప్ప’కు కూడా మణి స్వరపరచిన నేపథ్యం టీజర్ లోనే అలరిస్తోంది. గోపీచంద్ ఆశలపల్లకిగా వస్తోన్న ‘సీటీమార్’లోనూ మణి మార్కు వినిపిస్తోంది. ఇవన్నీ చూస్తోంటే, నిజంగానే మణిలో సత్తా తగ్గలేదని అంగీకరించక తప్పదు. ఎందుకంటే మణిశర్మ ఫుల్ ఫామ్ లో ఉన్న రోజుల్లో ఓ వైపు టాప్ స్టార్స్ ఇమేజ్ కు తగ్గ బాణీలు కడుతూనే, మరోవైపు యువకథానాయకులను విజయపథంలో పయనింపచేసే స్వరాలూ పలికించారు. అదే మ్యాజిక్ మరోమారో తన మ్యూజిక్ తో మణిశర్మ చేయబోతున్నట్టు అనిపిస్తోంది.

మణి శర్మ పూర్తి పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. ఆయన తండ్రి నాగయజ్ఞ శర్మ వాయులీనం వాయించడంలో దిట్ట. దాంతో మదరాసు చేరి, ఘంటసాల మాస్టారు వద్ద వయోలినిస్ట్ గా కుదురుకున్నారు. మణి కూడా చిన్నప్పుడే ఇంట్లో ఉండే హార్మోనియం వాయిస్తూ ఉండేవాడు. తనయుడిలోని తపన చూసిన నాగయజ్ఞ శర్మ మురిసిపోయారు. తనకు తెలిసిన విద్యనంతా నేర్పి, శాస్త్రీయ సంగీతంలోనూ శిక్షణ ఇప్పించారు. మణిశర్మ పలువురు మేటి సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేశారు. తరువాత సోలోగా కొన్ని ట్యూన్స్ కట్టారు. అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ తన ‘రాత్రి’ చిత్రం కోసం మణిశర్మను ఎంచుకున్నారు. తొలి ప్రయత్నంలోనే జడిపించే బాణీలు కట్టి ఆకట్టుకున్నారు మణి. అయినా వెంటనే మణికి ఎవరూ ఎర్రతివాచీ పరచి ఆహ్వానం పలకలేదు. వర్మ ‘అంతం’లో “చలెక్కి ఉందనుకో…” అనే పాటకు మణి బాణీ కట్టారు. తరువాత వెంకటేశ్ ‘ప్రేమించుకుందాం…రా’ చిత్రంలో మూడు పాటలకు స్వరకల్పన చేశారు. ఆ సినిమాకు మహేశ్ సంగీత దర్శకుడు. మహేశ్ కు వీలు కాకపోవడంతో మణి చేయి చేసుకోవలసి వచ్చింది. తరువాత రామానాయుడు ‘సూపర్ హీరోస్’ ద్వారా మణిశర్మను సోలో మ్యూజిక్ డైరెక్టర్ ను చేశారు. చిరంజీవి ‘బావగారూ…బాగున్నారా’లో మణి బాణీలు మజా చేశాయి. తరువాత మెగాస్టార్ ‘చూడాలని వుంది’లో మణిశర్మ సంగీతం అదరహో అనిపించింది. ఆ పై మణి మ్యూజిక్ కోసం టాప్ హీరోస్ ఆసక్తి చూపించసాగారు. తెలుగు చిత్రసీమలో ఫ్యాక్షనిజమ్ కు హీరోయిజం రంగు అద్దిన ‘సమరసింహారెడ్డి’కి కూడా మణిశర్మ సంగీతం సందడి చేసింది. ఆ తరువాత నుంచీ మార్కెట్ లో మణిశర్మ మ్యూజిక్ కు భలే డిమాండ్ పెరిగింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మణి ఎదిగిపోయారు.

కేవలం టాప్ స్టార్స్ చిత్రాలకే కాదు, ఆ నాటి వర్ధమాన కథానాయకుల సినిమాలకు సైతం మరపురాని మధురం పంచారు మణిశర్మ. యంగ్ హీరోగా మహేశ్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’కు కూడా మణి బాణీలే సందడి చేశాయి. ఇక మహేశ్ కు నాలుగు రజతోత్సవ చిత్రాలుగా నిలచిన “మురారి, ఒక్కడు, అతడు, పోకిరి”కి కూడా మణిశర్మ సంగీతమే మురిపించింది. వీటిలో ‘పోకిరి’ డైమండ్ జూబ్లీ మూవీ కావడం విశేషం.

మణి స్వరకల్పనలో రూపొందిన “నరసింహనాయుడు, ఇంద్ర, ఠాగూర్, ఖుషి, అన్నయ్య, చెన్నకేశవ రెడ్డి, టక్కరిదొంగ, అంజి, సీమసింహం, యజ్జం, బాలు, జై చిరంజీవ, స్టాలిన్, ఖలేజా, శక్తి, రచ్చ, పరుగు” వంటి చిత్రాలన్నీ సంగీతపరంగా జనాన్ని ఆకట్టుకున్నవే.

జూనియర్ యన్టీఆర్ కు తొలి బిగ్ హిట్ ‘ఆది’కి, రామ్ చరణ్ తొలి చిత్రం ‘చిరుత’కు కూడా మణి బాణీలే మజా చేశాయి. ‘రచ్చ’ తరువాత మళ్ళీ మణిశర్మ స్వరకల్పన చేసిన చిత్రాలేవీ ఆ స్థాయి విజయాన్ని చవిచూడలేదు. అయినా, తన దరికి చేరిన సినిమాలకు మణి తన మార్కు సంగీతం పలికిస్తూనే వచ్చారు. సక్సెస్ చుట్టూ ప్రదక్షిణలు చేసే చిత్రసీమ మణికి దూరంగా జరిగింది. అయితే పూరి జగన్నాథ్ తన ‘ఇస్మార్ట్ శంకర్’కు మళ్ళీ మణి శర్మ బాణీలను కావాలనుకున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’లో చిందేయించే బాణీలతో పాటు తనదైన మెలోడీని అందించి ఆకట్టుకున్నారు మణిశర్మ. అప్పటి నుంచీ సినీజనం మళ్ళీ మణిశర్మ వైపు చూస్తోంది. తన వద్ద పనిచేసిన దేవిశ్రీ ప్రసాద్, థమన్ రాజ్యమేలుతున్న సమయంలో మణి పని అయిపోయిందని భావించిన వారికి షాక్ ఇచ్చారు మణిశర్మ. ప్రస్తుతం మణిశర్మ పది చిత్రాలకు సంగీతం సమకూరుస్తున్నారు. మళ్ళీ మణిశర్మకు మునుపటి రోజులు వచ్చాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన తనయుడు మహతీ స్వరసాగర్ సైతం సంగీత దర్శకునిగా సాగుతున్నాడు. మణి బాణీల సత్తా తెలిసిన వారు ఆయన సంగీతం కోసం పరుగులు తీస్తున్నారు. నవతరంతో పోటీకి సై అంటూ సాగుతోన్న మణిశర్మ మరిన్ని చిత్రాలలో తనదైన బాణీలు పలికిస్తారని ఆశిద్దాం!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-