ప్రధాని పర్యటనలో భద్రతా వైఫల్యం.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా వైఫల్యం పెద్ద రచ్చగా మారింది.. తన పర్యటనలో దాదాపు 20 నిమిషాలపు పాటు చిక్కుకుపోయిన ప్రధాని మోడీ.. ఆకస్మాత్తుగా తన పర్యటన రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీ చేరుకున్నారు.. అయితే, దీనిపై తీవ్రస్థాయిలో రాజకీయ విమర్శల పర్వం కొనసాగుతుండగా.. ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.. మోడీ పర్యటనలో భద్రతా పరమైన అంశాలపై అటు కేంద్రంలోనూ, ఇటూ రాష్ట్రంలోనూ ఓ కమిటీ విచారిస్తున్న విషయం తెలిసిందే కాగా.. వచ్చే సోమవారం వరకు ఎలాంటి దర్యాప్తు చేయొద్దని రెండు కమిటీలకు ఇవాళ్టి విచారణ సందర్భంగా ఆదేశించింది సుప్రీంకోర్టు… ఇక, ఈలోపు ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రికార్డులను పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టుకు చెందిన రిజిస్ట్రార్‌ జనరల్‌కు అప్పజెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ప్రధాని పర్యటనకు సంబంధించిన రికార్డులు అప్పగించే పనిలో చండీఘడ్‌కు చెందిన డీజీపీ, ఎన్‌ఐఏ నుంచి ఓ అధికారి సహకరించాలని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణ జనవరి 10వ తేదీన చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది.. ఈలోగా రెండు కమిటీలూ ఎలాంటి దర్యాప్తు చేయొద్దని ఆదేశించింది. అంతకుముందు పిటిషనర్‌ తరఫున సీనియర్‌ లాయర్‌ మణిందర్‌ సింగ్‌ వాదనలు వినిపించారు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్య కాంత్, జస్టిస్‌ హిమ కోహ్లిలతో కూడిన బెంచ్‌ ఈ పిటీషన్‌పై విచారణ చేపట్టింది.. కేంద్ర ప్రభుత్వం నుంచి సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, పంజాబ్‌ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ డీఎస్‌ పాట్వాలియా వాదనలు వినిపించారు.. రాష్ట్ర, కేంద్రం తమ సొంత కమిటీని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. పంజాబ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ రికార్డులను భద్రపరచాలని ఆదేశించినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. అంటే ప్రధాని మోదీ వెళ్లే రూట్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని భద్రంగా ఉంచాలని కోరింది. రిజిస్ట్రార్ జనరల్‌కు అవసరమైన సమాచారాన్ని అందించాలని పంజాబ్ ప్రభుత్వం, పంజాబ్ పోలీసులు, ఎస్‌పిజి , ఇతర ఏజెన్సీలను కూడా కోర్టు కోరింది. ఎన్ఐఏ కూడా సహకరించాలని కోరింది. మరోవైపు, పిటిషనర్ తరపు న్యాయవాది మణీందర్ సింగ్ మాట్లాడుతూ.. ఇది కేవలం శాంతిభద్రతల సమస్య కాదని, ఎస్‌పిజి చట్టం ప్రకారం సమస్య అని అన్నారు. ఇది చట్టబద్ధమైన బాధ్యత అని సింగ్ అన్నారు. ఇందులో ఎలాంటి సంకోచం ఉండదు. ఇది జాతీయ భద్రతా సమస్య, కేవలం శాంతిభద్రతలే కాదు. రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధమైన స్థాయిలో కట్టుబడి ఉండాలన్నారు. ఇది చాలా తీవ్రమైన అంశమని, ప్రధాని భద్రతలో భారీ లోపం జరిగిందని.. ఈ విషయంలో స్పష్టమైన విచారణ అవసరమని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Related Articles

Latest Articles