వినోద్‌ దువాపై దేశద్రోహం కేసును కొట్టివేసిన సుప్రీం

ప్రమఖ జర్నలిస్టు వినోద్‌ దువాపై దాఖ‌లైన దేశద్రోహం కేసును కొట్టివేసింది సుప్రీంకోర్టు.. హిమాచల్ ప్రదేశ్ పోలీసులు వినోద్ దువాకు వ్యతిరేకంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను, ఇతర విచారణను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం వెల్ల‌డించింది.. ఈ సందర్బంగా 1962 నాటి కోర్టు తీర్పును ప్రస్తావించింది న్యాయస్థానం. ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టుకు రక్షణ పొందే హక్కుందని వ్యాఖ్యానించింది.. కాగా, గతేడాది మార్చి 30వ తేదీన ప్రసారమైన వినోద్ దువా షో అనే యుట్యూబ్ కార్యక్రమం లో కేంద్ర ప్రభుత్వం విధించిన కోవిడ్-19 లాక్ డౌన్, పర్యవసానాలను వినోద్ దువా విమ‌ర్శించారు.. అయితే, ఆయ‌న వ్యాఖ్యలు శాంతి, మతసామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ నేత ఫిర్యాదు చేయ‌గా.. రాజద్రోహం కేసు న‌మోదు చేశారు.. ఆ ఎఫ్‌ఐఆర్‌ను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వినోద్ దువా.

ఇక‌, వినోద్‌ దువాపై నమోదైన రాజద్రోహం, ఇతర కేసులను కొట్టివేసింది జస్టిస్‌ యూయూ లలిత్‌, జస్టిస్‌ వినీత్‌ శరణ్‌లతో కూడిన ధర్మాసనం.. 1962 నాటి కేదార్‌నాథ్ సింగ్‌ తీర్పు ప్రకారం.. ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టుకు రక్షణ ఉందని గుర్తుచేసింది.. చట్టబద్ధమైన మార్గాల ద్వారా మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ, తీవ్రమైన పదాలను ఉపయోగించినంత మాత్రాన రాజద్రోహం కాదని.. 1962 నాటి సుప్రీంకోర్టు తీర్పు చెబుతోందని పేర్కొంది. అందువల్ల వినోద్‌పై ఉన్న కేసులను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం వెల్ల‌డించింది.. ప‌దేళ్ల అనుభవం ఉన్న పాత్రికేయులపై విచారణ జరిపి, కేసులు నమోదు చేసేందుకు గాను‌ ఓ “ప్రత్యేక కమిటీ” ని ఏర్పాటు చేయాలన్న వినోద్ దువా అభ్యర్థనను మాత్రం ధర్మాసనం తిర‌స్క‌రించింది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-