నీట్ పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు అనుమతి

వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. 2021-22 వార్షిక సంవత్సరానికి సంబంధించి నీట్ పీజీ అడ్మిషన్‌లకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉదయం తీర్పు వెల్లడించింది. ఈ మేరకు నీట్ పీజీ ప్రవేశాలకు కోటాను కూడా ఫిక్స్ చేసింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్, ఆర్థిక బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్‌కు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో నీట్ పీజీ కౌన్సెలింగ్‌పై నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడింది.

Read Also: తగ్గేదేలే అంటున్న ఒమిక్రాన్… దేశంలో 3వేలు దాటిన కేసులు

దేశంలోని ఆయా రాష్ట్రాల మెడికల్ కాలేజీల్లో ఆలిండియా కోటా సీట్లకు పాత రిజర్వేషన్‌లు వర్తిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ పీజీ కోటాపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కొన్నేళ్ల నుంచి దేశవ్యాప్తంగా రెసిడెంట్ డాక్టర్లు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటా అమలుకు గతేడాది జూలైలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఈడబ్ల్యూఎస్ కోటాలో సీటు పొందేవారికి 8 లక్షల వార్షిక ఆదాయం ఉండాలన్న నిబంధన కూడా ఈ ఏడాది వర్తించనుంది.

Related Articles

Latest Articles