గిల్టీ బోర్డ్ తో సానుభూతి పొందిన సన్నీ!

బిగ్ బాస్ సీజన్ 5 పదకొండో వారం నామినేషన్స్ ఆసక్తికరంగా జరిగాయి. సన్నీ ప్రవర్తనతో విసిగి వేసారిన ఇంటి సభ్యులంతా అతన్ని టార్గెట్ చేయడంతో గిల్టీ అనే బోర్డును బిగ్ బాస్ చెప్పేవరకూ మెడలోనే ఉంచుకోవాలని నాగార్జున ఆదివారం సన్నీకి చెప్పాడు. నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యే వరకూ సన్నీ ఆ బోర్డ్ ను అలానే ధరించాడు. గతంలో ఇలానే షణ్ముఖ్ ను ఇంటి సభ్యులంతా టార్గెట్ చేసినప్పుడు అతని మీద ఎలా అయితే వ్యూవర్స్ కు సానుభూతి కలిగిందో ఇప్పుడు అలాంటిదే సన్నీ విషయంలో వ్యూవర్స్ కే కాదు, ఇంటి సభ్యులకూ కలిగినట్టు కనిపించింది. అది నామినేషన్స్ లో రిఫ్లెక్ట్ అయ్యింది కూడా! ఈ వారం సన్నీని రవి, శ్రీరామ్ మాత్రమే నామినేట్‌ చేశారు. అది కూడా అతని లూజ్ టంగ్ కారణంగానే! చిత్రం ఏమంటే సన్నీతో అంతలా వాదోపవాదాలు చేసిన సిరి, షణ్ముఖ్ అతన్ని నామినేట్ చేయలేదు. ఈ వారం ఒక్కోవ్యక్తి ఇద్దర్ని చొప్పున నామినేట్ చేయమని, కెప్టెన్ కాబట్టి రవిని ఎవరూ నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ చెప్పాడు. దాంతో ఆశ్చర్యకరంగా అత్యధికంగా కాజల్ ను నలుగురు (రవి, షణ్ముఖ్, సిరి, యానీ) నామినేట్ చేశారు. ఆ తర్వాత అత్యధికంగా ముగ్గురు (మానస్, కాజల్, ప్రియాంక) షణ్ముఖ్ ను నామినేట్ చేశారు. మానస్, సిరి, ప్రియాంక, సన్నీ, యానీ మాస్టర్లను ఇద్దరేసి సభ్యులు నామినేట్ చేశారు. శ్రీరామ్ ను కేవలం సన్నీ మాత్రమే నామినేట్ చేశాడు. అయినా హౌస్ లో ఉన్న కెప్టెన్ రవిని తప్ప బిగ్ బాస్ అందరినీ నామినేషన్స్ లో ఉంచేశాడు.

ఎప్పటిలానే నామినేషన్స్ సమయంలో ఇంటి సభ్యుల మధ్య ఈసారీ వాదోపవాదాలు జరిగాయి. మిగిలిన వారి కంటే కాజల్ అండ్ యానీ మధ్య, మానస్ మరియు యానీ మధ్య ఘాటైన చర్చ జరిగింది. అలానే సిరి, పింకీ కూడా ఒకరిని ఒకరు గట్టిగానే విమర్శించుకున్నారు. కానీ గతంలో మాదిరి ఈసారి ఈ వ్యవహారం హద్దులు మీరలేదు.

Related Articles

Latest Articles