స్టైల్ కింగ్ దేవానంద్!

భారతదేశంలో ‘స్టైల్ కింగ్’ అని పేరు సంపాదించిన తొలి స్టార్ హీరో దేవానంద్. రొమాంటిక్ హీరోగా దేవానంద్ సాగిన వైనం ఈ నాటికీ అభిమానుల మదిలో చెరిగిపోకుండా నిలచిఉంది. దేవానంద్ స్టైల్స్ చూసి ఆయనను అభిమానించిన అందాల భామలెందరో ఉన్నారు. అలాగే అబ్బాయిలు దేవ్ స్టైల్స్ ను అనుకరిస్తూ ఆ రోజుల్లో సందడి చేసిన సందర్భాలు కోకొల్లలు. భారతీయ సినిమాకు దేవానంద్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనను కేంద్రప్రభుత్వం పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో గౌరవించింది.

దేవ్ పూర్తి పేరు ధరమ్ దేవ్ పిషోరీమాల్ ఆనంద్. 1923 సెప్టెంబర్ 26న దేవానంద్ షకర్ గడ్ లో జన్మించారు. ఆయన తండ్రి పిషోరీలాల్ న్యాయవాదిగా పనిచేసేవారు. వారు నలుగు అన్నదమ్ములు పెద్దవారు మన్మోహన్ ఆనంద్ తండ్రిబాటలోనే పయనిస్తూ అడ్వకేట్ గా పనిచేశారు. ఇక రెండో అన్న చేతన్ ఆనంద్ చిత్రసీమలో అడుగు పెట్టారు. దాంతో దేవానంద్ సైతం సినిమా రంగంవైపే అడుగులు వేశారు. వీరిద్దరి తరువాత అందరికంటే చిన్నవాడయిన విజయానంద్ సైతం చిత్రసీమలో అడుగుపెట్టి దర్శకునిగా తనదైన బాణీ పలికించారు. మహానటుడు అశోక్ కుమార్ నటన చూసి దేవానంద్ కు కూడా నటునిగా మారాలన్న అభిలాష కలిగింది. 1946లో తెరకెక్కిన ‘హమ్ ఏక్ హై’ చిత్రంలో తొలిసారి దేవానంద్ నటించారు. 1948లో రూపొందిన ‘జిద్ది’ దేవ్ కు హీరోగా గుర్తింపు సంపాదించి పెట్టింది.

ఆ తరువాత ఆ నాటి మేటి అందాలతార, గాయని సురయ్యాతో కలసి దేవానంద్ నటించిన “విద్య, జీత్, షాహిర్, అఫ్సర్, నీలి, సనమ్, దో సితారే” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. తొలి చిత్రం సమయంలోనే సురయ్యాను బోట్ ప్రమాదం నుండి రక్షించారు దేవ్. దాంతో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే మతాలు వేరు కావడంతో సురయ్యా అమ్మమ్మ వారి పెళ్ళికి అంగీకరించలేదు. అంతకు ముందే సురయ్యాకు ఓ డైమండ్ రింగ్ వేలుకు తొడిగారు దేవ్. దాంతో దేవ్ నే భర్తగా భావించిన సురయ్యా జీవితాంతం పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయింది. తరువాత దేవానంద్ తనతో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ కల్పనా కార్తిక్ ను పెళ్ళాడారు.

దేవానంద్ తన సోదరులతో కలసి ‘నవ్ కేతన్’ బ్యానర్ స్థాపించారు. ఆ పతాకంపై పలు మరపురాని చిత్రాలను రూపొందించారు. నవ్ కేతన్ సంస్థ నిర్మించిన ‘బాజీ’ చిత్రంతో గురుదత్ ను దర్శకునిగా పరిచయం చేశారు. “జాల్, సిఐడి” చిత్రాల్లో గురుదత్ డైరెక్షన్ లోనే నటించారు దేవ్. దిలీప్ కుమార్ తో కలసి దేవానంద్ ఒకే ఒక ‘ఇన్సానియత్’ అనే జానపద చిత్రంలో నటించారు. మన యన్టీఆర్, ఏయన్నార్ నటించిన ‘పల్లెటూరి పిల్ల’ రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. యన్టీఆర్ పాత్రను దేవానంద్ పోషించారు. 1950లలో దేవానంద్ నటించిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. దాంతో ఆ నాటి రాజ్ కపూర్, దిలీప్ కుమార్ తో కలసి దేవానంద్ హిందీ చిత్రసీమ త్రిమూర్తులలో ఒకరిగా వెలిగారు. 1960లలో దేవానంద్ రొమాంటిక్ హీరోగా జనాన్ని ఆకట్టుకున్నారు. తన తమ్ముడు విజయానంద్ దర్శకత్వంలో దేవానంద్ నటించిన ‘గైడ్’ చిత్రంతో అంతర్జాతీయ ఖ్యాతి కూడా లభించింది. తరువాత విజయానంద్ నిర్దేశకత్వంలో దేవ్ నటించిన “జువెల్ థీఫ్, జానీ మేరా నామ్” సైతం సూపర్ హిట్స్ గా నిలిచాయి. ‘ప్రేమ్ పూజారి’తో దేవానంద్ దర్శకునిగా మారారు. దేవ్ దర్శకత్వంలో రూపొందిన ‘హరే రామ హరే కృష్ణ’ సూపర్ హిట్ గా నిలచింది. ఈ సినిమాతో జీనత్ అమన్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. రాజ్ కపూర్, దిలీప్ కుమార్ యాభై ఏళ్ళకే తమ వయసుకు తగ్గ పాత్రల్లోకి మారిపోయారు. దేవానంద్ మాత్రం రాఖీ, పర్వీన్ బాబీ, హేమామాలిని, ముంతాజ్, టినా మునిమ్ వంటి పడచు భామలతో కలసి పలు విజయాలు సాధిస్తూ రొమాంటిక్ హీరోగానే సాగడం విశేషం. ‘దేశ్ పర్ దేశ్’ తరువాత దేవానంద్ పలు చిత్రాలు రూపొందించినా అవేవీ అంతగా ఆకట్టుకోలేక పోయాయి. అయితే ఆయనకు మాత్రం ‘ఎవర్‌ గ్రీన్ హీరో’ ఇమేజ్ ను సంపాదించి పెట్టాయి.

దేవానంద్ రాజకీయాల్లోనూ వేలు పెట్టారు. ‘నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా’ పేరుతో ఓ పార్టీని కూడా స్థాపించారు. అయితే అదేమీ విజయం సాధించక పోవడంతో తరువాత దానిని రద్దు చేసుకున్నారు.
అక్కినేని నాగేశ్వరరావు నెలకొల్పిన జాతీయ అవార్డును 2006లో అందుకున్నారు దేవ్. ఆయన కీర్తికిరీటంలో ఎన్నెన్నో మేలిమి అవార్డులు రత్నాలుగా నిలిచాయి. 2011 డిసెంబర్ 3న దేవానంద్ తన 88వ ఏట లండన్ లో కన్నుమూశారు. దేవ్ మాత్రం జనం మదిలో ఈ నాటికీ ‘స్టైల్ కింగ్’గానే మిగిలి ఉన్నారు.

-Advertisement-స్టైల్ కింగ్ దేవానంద్!

Related Articles

Latest Articles