కరోనా భయం: పాఠశాలల్లో విద్యార్థులకు ఏది అభయం?

దాదాపు రెండేళ్లుగా ప్రపంచం కరోనా గుప్పిట్లోనే మగ్గుతోంది. కోవిడ్-19కి విరుగుడుగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజల్లో మాత్రం ఆ మహమ్మరి సృష్టించిన భయం మాత్రం పోవడం లేదు. ప్రపంచ దేశాలతోపాటు భారత్ లోనూ కరోనా ప్రభావం ఎక్కువగానే కన్పిస్తోంది.. కరోనా ఫస్ట్ వేవ్ లో ఎంతో అప్రమత్తంగా ఉన్న ప్రభుత్వం సెకండ్ వేవ్ లో పాలకుల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకుంది. అక్టోబర్ నెలలో థర్డ్ వేవ్ వస్తుందన్న ప్రచారం నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తెరవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఏపీలో ఆగస్టు 16 నుంచి బడులను తెరిచారు. దీంతో తల్లిదండ్రులు భయం గుప్పిట్లోనే విద్యార్థులను స్కూళ్లకు పంపుతున్నారు. ఉపాధ్యాయులు సైతం బిక్కుబిక్కుమంటూనే ప్రత్యక్ష పద్ధతిలో బోధనలు చేస్తున్నారు. గత నెలలో పాఠశాలల్లో ఒకటి రెండు కరోనా కేసులు నమోదు కాగా ఇప్పుడు ఆ సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళనను కలిగిస్తుంది.

నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఈ కేసుల సంఖ్యగా అధికంగా ఉందని సమాచారం. నెల్లూరు జిల్లాలో పాఠశాలల్లో ఇప్పటివరకు 26మంది విద్యార్థులు కరోనా బారిన పడగా గుంటూరులో 10మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు గురుకుల పాఠశాలలో మొత్తం 19మంది విద్యార్థులకు ఒక టీచర్ కు కరోనా సోకింది. దీంతో వీరందరనీ గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఇదే జిల్లాలోని మనుబోలు మండలంలోని ఎలిమెంటరీ స్కూల్, హైస్కూళ్లలో నలుగురు విద్యార్థులు.. ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా బారిన పడ్డారు. దీంతో పాఠశాలకు సెలవు ప్రకటించి అధికారులు శానిటైజేషన్ చేయిస్తున్నారు. అలాగే గుంటూరు జిల్లాలోని బాపట్ల నియోజకవర్గంలో రెండు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఒక ఉపాధ్యాయినికి కరోనా సోకింది. బాలయోగి గురుకుల పాఠశాలలోని ఐదుగురు విద్యార్థినులు కరోనా బారినపడినట్లు సమాచారం.

మరోవైపు గురుకులాల్లో కొవిడ్ నిబంధనలు పాటించడం కష్టసాధ్యంగా మారుతుందని తెలుస్తోంది. సరైన జాగ్రత్తలు పాటించకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ముప్పు తప్పదనే టాక్ విన్పిస్తుంది. దీంతో ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఉపాధ్యాయులకు ప్రతియేటా ఇచ్చే అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అదేవిధంగా పాఠశాలల్లో నేడు గురు పూజోత్సవాలు జరపొద్దని ఆదేశాలు ఇచ్చింది.

ఇక తెలంగాణలోనూ ఇటీవల పాఠశాలలు ప్రారంభమయ్యాయి. అయితే తెలంగాణ హైకోర్టు విద్యా సంస్థలకు స్టూడెంట్స్ రావడం వారి తల్లిదండ్రుల ఇష్టానికే వదిలేయాలని తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యార్థుల హాజరుశాతం అంతత మాత్రంగానే ఉంది. ప్రైవేట్ పాఠశాల్లోనూ పూర్తిస్థాయిలో తరగతులు మొదలు కాలేదని తెలుస్తోంది.

ఏపీలో మాత్రం ఇలాంటి ఆంక్షలేవీ లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను తప్పనిసరి పరిస్థితుల విద్యాసంస్థలకు పంపుతున్నారు. అయితే ఏపీలో తాజాగా పెరుగుతున్న కరోనా కేసులు వారిని ఆందోళన గురిచేస్తున్నాయి. దీంతో పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులపై ప్రభుత్వం పునరాలోచించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై ఏపీ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే..!

Related Articles

Latest Articles

-Advertisement-