తెలంగాణలో లోకల్‌ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి..!

ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అన్నది పార్టీల ఇష్టం. బలం లేనిచోట పోటీకి ఆలోచనలో పడతాయి. ఏకగ్రీవంగా గెలిచే పార్టీలో సంబరాలే సంబరాలు. కానీ.. అధికారపార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆశిస్తున్న సంబరాలు వేరే ఉన్నాయట. ఎవరో ఒకర్ని పోటీకి పెడితే.. తమ పంట పండుతుందని ప్రత్యర్థి పార్టీలను వేడుకుంటున్నారట. ఎందుకో.. ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కోరుకుంటున్నారా?

తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలు చాలా కాస్ట్‌లీ. ఏ చిన్నపాటి ఎన్నిక వచ్చినా డబ్బులు మూటలు తీయాల్సిందే. ఈ విషయంలో హుజురాబాద్‌ ఉపఎన్నిక అన్ని రికార్డులను తిరగ రాసిందని రాజకీయ వర్గాలు కథలు కథలుగా చెప్పుకొనే పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 12 సీట్లకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో సాధారణ ఓటర్ల పాత్ర ఏమీ ఉండదు. కానీ.. ఆ ప్రజలు ఎన్నుకున్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు లోకల్‌ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేస్తారు. ఏ పార్టీ నుంచి ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలిసిపోతుంది కాబట్టి.. పోటీ చేయాలా వద్దా.. పోటీ చేస్తే గెలిచే పార్టీ ఏంటో క్లారిటీ ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల ముంగిట ఉన్న 12 ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార టీఆర్ఎస్‌ బలమే ఎక్కువ. ఇతర పార్టీలు నామినేషన్లు దాఖలు చేయకపోతే టీఆర్ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. కానీ.. ఓటు హక్కు కలిగిన అధికారపార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం పోటీ ఉంటే బాగుండేదని తెగ మథన పడుతున్నారట.

బరిలో అభ్యర్థిని పెట్టాలని విపక్ష నేతలకు ఫోన్లు..!

ఏకగ్రీవంగా అభ్యర్థుల ఎన్నికయ్యే చోట.. పోటీ ఎందుకు కోరుకుంటున్నారు? ఇందులోనే పెద్ద మతలబు ఉంది. పోటీ లేకపోతే ఓటర్లుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులను ఎవరూ పట్టించుకోరు. వారు ఓటేసే అవకాశమే రాదు. పెద్దగా గిట్టుబాటు కాదు. అదే ప్రత్యర్థులు బరిలో ఉంటే.. రాజకీయం రసవత్తరంగా మారుతుంది. క్యాంప్‌ పాలిటిక్స్‌ మొదలవుతాయి. బాగానే పని అవుతుంది. అందుకే ప్రత్యర్థులు బరిలో ఉంటే మంచిదని ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారట. ఇంకొందరైతే తమకు పరిచయం ఉన్న ప్రతిపక్ష నాయకులకు ఫోన్‌ చేసి.. ఎవరో ఒకరిని బరిలో పెట్టాలని కోరుతున్నట్టు సమాచారం.

పోటీ ఉంటేనే నాలుగు డబ్బులు వస్తాయని ఆశ..?

ప్రస్తుతం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమకు నిధులు.. విధులు లేవని తెగ బాధపడుతున్నారు. లక్షలు ఖర్చుపెట్టి ఎన్నికల్లో గెలిచి సాధించింది ఏమీ లేదనే ఫీలింగ్‌లో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు తమకు అనుకూలంగా మలుచుకొనేలా పావులు కదుపుతున్నారు. అధికారపార్టీ నేతలు.. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకు ఫోన్‌ చేసిన సందర్భంలో వారి మధ్య ఆసక్తికర సంభాషణలు జరుగుతున్నాయట. ప్రత్యర్థులు బరిలో ఉంటేనే సొంతపార్టీతోపాటు నాయకులు తమను గుర్తిస్తారని.. నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారట.

కలిసొచ్చే అంశాలపై లెక్కలేసుకుంటున్న ప్రజాప్రతినిధులు..!

మొత్తానికి ఎన్నికలకు డబ్బులకు ఫెవికాల్ రాసేస్తున్నారు నాయకులు. ఎలక్షన్‌ పేరు చెబితే.. తమకు కలిసొచ్చే అంశాలపై లెక్కలేసుకుని.. పార్టీల మధ్య ఉన్న హద్దులను చెరిపేసి.. చెలిమి చేస్తున్నారు. పోటీ ఉంటే.. మాకే కాదు.. మీ పార్టీ నేతలకు కూడా పనవుతుంది అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. ప్రస్తుతం జిల్లా స్థాయిలో MLC ఎన్నికలు ఈ అంశాల చుట్టూనే తిరుగుతున్నాయి. మరి.. స్థానిక ప్రజాప్రతినిధులు ఆశించినట్టు జరుగుతుందో లేదో చూడాలి.

Related Articles

Latest Articles