వ్యవసాయ చట్టాలపై విజయం ఎవరిది !

రైతు ఉద్యమాన్ని రగిల్చిన వ్యక్తి. సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో ముందున్న వ్యక్తి. ఆయనే రాకేష్‌ టికాయత్‌. ఇకపైన రైతుల సమస్యల పోరాటం కొనసాగుతుందని.. విశ్రమించ బోమంటున్నా రాయన. రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరు అంటే అందరికి గుర్తుకొచ్చే పేరు రాకేష్‌ టికాయత్‌. భారత కిసాన్‌ యూనియన్‌ నేత. రైతులకు శాపంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. అన్నదాతలు నడిపిన ఆందోళనలకు నాయకత్వం వహించారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని వీధుల్లో ఉద్యమాన్ని రగిల్చాడు. ఢిల్లీ బార్డర్‌ సింఘు నుంచి మొదలుకుని అనేక రాష్ట్రాల్లో పర్యటించి సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులను ఏకం చేశారు రాకేష్‌ టికాయత్‌. కేంద్రం అనేక సార్లు చర్చలు జరిపినా.. డిమాండ్ల విషయంలో రాజీ పడకుండా పోరాటం కొనసాగించారు. అన్నదాతలు నెలలపాటు చలిలోనే మగ్గుతూ.. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఆందోళన చేశారు.

ఇప్పుడు అదే రైతుల పోరాటం కేంద్రాన్ని కదలించింది. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేలా చేసింది. కేంద్రం మెడలు వచ్చిన నిజమైన నాయకుడిగా టికాయత్‌ విజయం సాధించారు. ఇది భారత రైతుల విజయం అని అభివర్ణిస్తున్నారు టికాయత్‌. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నామన్న మోడీ ప్రకటనపై స్పందించారు టికాయత్‌. చట్టాల రద్దుపై ప్రకటన చేసినప్పటికీ తాము ఉద్యమాన్ని ఇప్పుడే విరమించబోమని తేల్చి చెప్పారు. పార్లమెంట్‌లో చట్టాలు రద్దు జరిగే రోజు వరకు వేచి చూస్తామన్నారు. అంతే కాదు కనీస మద్దతు ధరతో పాటు రైతుల ఇతర సమస్యలపై కూడా ప్రభుత్వం చర్చించాల్సి ఉందన్నారు రాకేష్‌ టికాయత్‌.

Related Articles

Latest Articles