అప్ఘన్ లో ఆకలి చావులు తప్పవా?

కరోనా మహమ్మరితో ప్రపంచం ఓవైపు పోరాడుతుండగా అప్ఘన్ మాత్రం తాలిబన్లతో పోరాడాల్సి వస్తోంది. అమెరికా బలగాల ఉపసంహరణతో తాలిబన్లు అప్ఘన్లో రెచ్చిపోతున్నారు. తాలిబన్ల దురాక్రమణతో ఆదేశ తాజా మాజీ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ విదేశాలకు పారిపోయి తలదాచుకున్నాడంటే అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాలిబన్ల రాక్షస పాలన ఇదివరకే ఓసారి చూసిన అప్ఘన్లు వారి పాలనను ఒప్పుకునేది లేదని తెగెసి చెబుతున్నారు. తాలిబన్లు మాత్రం తమ పాలనను అప్ఘన్లు ఒప్పుకోవాల్సిందే.. లేదంటే చావాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమకు ఎదురుతిరిగిన వారిపై కాల్పులకు పాల్పడుతూ ప్రజల్లో భయోత్పాతం సృష్టిస్తున్నారు.

అప్ఘన్లో ఇప్పుడక్కడ హృదయవిదారక సంఘటనలే కన్పిస్తున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోవడం ప్రతీఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అప్ఘన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ప్రపంచ దేశాల నుంచి ఆ దేశానికి ఇప్పటివరకు అందిస్తున్న సాయాన్ని నిలిపివేశాయి. దీంతో ప్రస్తుతం అక్కడ ఇప్పుడు ఆకలికేకలు రాజ్యమేలుతున్నాయి. లక్షలాది మందికి ఒక్కపూట తిండి కూడా దొరకని పరిస్థితి ఉందని ఐక్యరాజ్య సమితి మానవతా విభాగం అధ్యక్షుడు రమీజ్ అలక్ బరోవ్ ఆందోళన వ్యక్తం చేశారు. సగం మందికి పైగా అప్ఘాన్ చిన్నారులు రోజు రాత్రి పూట ఆహారం తింటున్నారో.. లేదో కూడా తెలియని దయనీయ పరిస్థితి ఉందని తెలిపారు.

నిధుల్లేక సిబ్బందికి, ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించని పరిస్థితి ఉందని, వ్యవసాయ ఉత్పతులు తగ్గుముఖం పడుతున్నాయని.. ఔషధ నిల్వలు తరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ ఆహార కార్యక్రమం కింద అఫ్గాన్ కు అందిస్తున్న నిల్వలు ఈనెలకు మాత్రమే సరిపోతాయని ఇప్పటికే ఐరాస హెచ్చరించిందని గుర్తుచేశారు. ఈ పరిస్థితుల్లో అప్ఘన్ ప్రజల ఆకలిని తీర్చేందుకు తక్షణం రూ.1,460కోట్లు(20కోట్ల డాలర్లు) అవసరమని ఐరాస ప్రతినిధి రమీజ్ తెలిపారు. మున్ముందు ఆహార సమస్యలు తీవ్రం కానున్నాయని ప్రపంచ దేశాలన్నీ అఫ్ఘాన్ కు సాయం ప్రకటించాలని కోరారు. దేశంలో సహాయ కార్యక్రమాల కోసం రూ.9,945కోట్లు(1.3బిలియన్ డాలర్లు) అవసరం కాగా ఇప్పటివరకు 39శాతం మాత్రమే సాయం అందినట్లు పేర్కొన్నారు.

రోజుకురోజు పెరుగుతున్న నిత్యావసర ధరలతో ఈ పరిస్థితి మున్ముందు మరింత పెద్దది కానుందని స్థానికులు వాపోతున్నారు. దీనికితోడు ప్రపంచ దేశాల నుంచి సాయం నిలిచిపోవడంతో ఆ దేశంలో పాలన గాడిన పడటం ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చనే నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని తాలిబన్లు ఎలా ముందుకు నడిపిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల పోరు సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం వారి ఆకలి బాధలను మానవత్వంతో తీర్చాల్సిన బాధ్యత అన్నిదేశాలపై ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-