కత్తులు దూస్తూ.. కాలుదువ్వుతున్ననేతలు

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. స్వపక్షంలో విపక్షంగా ఉన్న ఆ ఇద్దరు నేతలకు ఈ సామెత వర్తిస్తుంది. అధిష్ఠానం మందలించినా.. అగ్రనేతలు అదిలించినా వారి పంథా ఒక్కటే. పదవులు కట్టబెట్టినా అదేపట్టు.. అదేబెట్టు. ఒకరికొకరు డీ అంటే డీ అని కాలు దువ్వుతున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథ?

కత్తులు దూసుకుంటున్నారు.. కాలు దువ్వుతున్నారు..!
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియెజకవర్గంలో అధికార వైసీపీ నేతలు దువ్వాడ శ్రీనివాస్‌.. పేరాడ తిలక్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలిలో నెగ్గుకు రాలేకపోయినా.. అక్కడ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి చెక్‌ పెట్టేందుకు దువ్వాడ, పేరాడ తదితరులకు కీలక పదవులు కట్టబెట్టింది వైసీపీ. అంతా కలిసి పనిచేస్తే వచ్చేఎన్నికల్లోనైనా అనుకున్న లక్ష్యం చేరుకోవచ్చన్నది అధికారపార్టీ ఆలోచన. కానీ.. అధిష్ఠానం అనుకుంటోంది ఒకటి.. టెక్కలి వైసీపీలో జరుగుతోంది మరొకటి. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, కళంగ కార్పొరేషన్ ఛైర్మన్‌ పేరాడ తిలక్‌లకు అస్సలు పడటం లేదు. మరోసారి కత్తులు దూసుకుంటూ.. కాలు దువ్వుకుంటూ చర్చల్లోకి వచ్చారు.

ఇంఛార్జ్‌గా దువ్వాడను తొలగించాలని వ్యతిరేకవర్గం డిమాండ్‌
దువ్వాడ, పేరాడలు గతంలో టెక్కలి నుంచి పోటీ చేసిన ఓడిన నాయకులే. నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉంటే.. కేంద్ర మాజీ మంత్రి కిళ్లి కృపారాణిని కలుపుకొని వైసీపీలో ముగ్గురు లీడర్లు.. మరెన్నో గ్రూపులు. తాజాగా దువ్వాడ వ్యతిరేకవర్గం సమావేశం పెట్టుకుని మాటల తూటాలు పేల్చడంతో పాత పగలు మళ్లీ కొత్తగా సెగలు రేపుతున్నాయి. టెక్కలి వైసీపీ ఇంఛార్జ్‌గా దువ్వాడను తొలగించాలన్నది వ్యతిరేకవర్గం డిమాండ్‌. ఈ సమావేశం వెనక పేరాడ తిలక్‌ ఉన్నారని ప్రచారం జరుగుతోంది. టెక్కలిలో టీడీపీతో పోరాడాల్సిన అధికారపార్టీ నాయకులు పాత పద్ధతిలోనే వెళ్తున్నారు.

దువ్వాడ వర్గం టెక్కలిలో ప్రత్యేకంగా భేటీ..!
నందిగాం, కోటబొమ్మాళి, టెక్కలి, సంతబొమ్మాలికి చెందిన పలువురు వైసీపీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు జర్జంగిలోని ఒక కల్యాణ మండపంలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో దువ్వాడపై రుసరుసలాడారు నాయకులు. ఈ మీటింగ్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో కత్తులు దూసింది దువ్వాడ వర్గం. తాజాగా టెక్కలిలో ప్రత్యేకంగా మీటింగ్‌ కూడా నిర్వహించింది. వైసీపీలోని కోవర్టులే అచ్చెన్నాయుడికి మద్దతుగా సమావేశం నిర్వహించారని ఆరోపించింది దువ్వాడ వర్గం. ప్రస్తుతం రెండు వర్గాల మధ్య సోషల్‌ మీడియాతోపాటు.. ప్రత్యక్షంగా మాటల తూటాలు పేలుతున్నాయి.

గత అసెంబ్లీ ఎన్నికల ముందూ ఇదేవిధంగా గ్రూపుఫైట్‌
టెక్కలి వైసీపీలో తాజా పరిణామాలు చూసిన టీడీపీ శ్రేణులు సంబర పడుతున్నాయట. టీడీపీ బలంకంటే.. వైసీపీ అనైక్యతే వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నకు మరింత మెజారిటీ కట్టబెడుతుందని లెక్కలేసుకుంటున్నారట. ఇదే అంశం అధికారపార్టీలోనూ చర్చకు దారితీస్తున్నట్టు సమాచారం. దువ్వాడ కార్యకర్తలకు అందుబాటులో ఉండబోరని.. కనీసం ఫోన్‌ కూడా తీయరని వైసీపీలో విమర్శలున్నాయి.

ఇక పేరాడ తిలక్ కూడా నందిగామకే పరిమితమై గ్రూపు రాజకీయాలు చేస్తుంటారనే ప్రచారం ఉంది. ఈ గ్రూప్‌ ఫైట్‌.. ఆధిపత్యపోరు కారణంగా టెక్కలి వైసీపీలో ఎవరిగోల వారిదే అన్నట్టుగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా వైసీపీలో ఇదే తంతు. కొన్ని గ్రామాల్లో నాడు ఎన్నికల ఏజెంట్లను కూడా సిద్ధం చేసుకోలేకపోయారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో.. స్థానికంగా పార్టీని బలోపేతం చేయాల్సిన తరుణంలో నాయకులు రచ్చ రచ్చ చేసుకోవడం వైసీపీ పెద్దల ఫోకస్‌లోకి వెళ్లింది. మరి.. ఈసారైనా స్థానిక నేతలను గాడిలో పెడతారో లేక.. విభేదాలు మరింతగా నిప్పులు రాజేస్తాయో చూడాలి.

Related Articles

Latest Articles