కమల్ హాసన్ ను కలవడం వెనుక కథేంటీ!?

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘ఇండియన్ -2’, ‘విక్రమ్’ సినిమాలలో నటిస్తున్నారు. ఇందులో మొదటి సినిమాను శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుంటే, రెండో సినిమాను ఆర్. మహేంద్రన్ తో కలిసి కమల్ నిర్మిస్తున్నాడు. ‘విక్రమ్’ సినిమాకు ‘ఖైదీ’ ఫేమ్ లోకేశ్ కనగరాజ్ దర్శకుడు. విశేషం ఏమంటే ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అధినేతలు నారాయణ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ తో పాటు తెలంగాణ ఎఫ్.డి.సి. ఛైర్మన్ పుస్కర్ రామ్మోహన రావు సోమవారం ప్రత్యేకంగా చెన్నయ్ వెళ్ళి కమల్ హాసన్ ను కలిసి వచ్చారు. ప్రస్తుతం సునీల్ నారంగ్, రామ్మోహన రావు కలిసి పలు చిత్రాలను తెలుగులో నిర్మిస్తున్నారు. అలానే ధనుష్ హీరోగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీనీ ప్లాన్ చేశారు.

తాజాగా వీరంతా కలిసి కమల్ హాసన్ ను కలిశారంటే… అది మామూలు విషయం కాదనిపిస్తోంది. పైగా నారాయణ దాస్ నారంగ్ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు అధ్యక్షుడిగా ఉంటే, ఆయన కుమారుడు సునీల్ నారంగ్ ది తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఇటీవలే ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. పైకి ఇది ఓ క్యాజువల్ మీట్ అని చెబుతున్నా… అంతకు మంచి మరింకేదో చర్చ వారి మధ్య జరిగే ఉంటుందనే సందేహాన్ని ఫిల్మ్ నగర్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పైగా ఇటీవల చిరంజీవి సైతం చెన్నయ్ వెళ్ళి, కొత్త ముఖ్యమంత్రి స్టాలిన్ ను, ఆయన కుమారుడు, హీరో ఉదయనిధిని కలిసి అభినందించి వచ్చారు. ఇలా తెలుగు సినీ ప్రముఖులు చెన్నయ్ తో ఈ మధ్య కాలంలో తిరిగి సత్ సంబంధాలను కొనసాగించడం మొదలెట్టారు. ఏదేమైనా… కమల్ ను నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్ కలిశారంటే… ఆయన సినిమాల తెలుగు పంపిణీ గురించి మాట్లాడటం కోసమైనా అయి ఉండాలి, లేదా ధనుష్‌ మూవీలో నటించమని అడగడానికైనా అయి ఉండాలి. ఏదేమైనా ఈ కలయికకు కారణం… కొద్ది రోజులు వేచి చూస్తే కానీ తెలియదు.

Related Articles

Latest Articles

-Advertisement-