మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీలోకి వస్తారా?

ఒకప్పుడు ఆ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోట. ఇప్పుడు అక్కడ అదేపార్టీ దిక్కులేకుండా పోయింది. మారిన రాజకీయ పరిణామాలు.. నేతల అవసరాలు మళ్లీ ఆ పార్టీకి గిరాకీ తెచ్చాయి. ఇప్పటికే ఓ నేత పాతగూటికి చేరేందుకు దారులు వెతుకుతుంటే.. మరో కొత్త నేత తన రాజకీయ భవిష్యత్‌ కోసం ఆ పార్టీని భుజానికి ఎత్తుకొనేందుకు రెడీ అవుతున్నారట.

దేవగుడి ఫ్యామిలీ టీడీపీ వైపు చూస్తోందా?

కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నాయకుడే లేకుండా దిక్కులేనిదైన టీడీపీకి డిమాండ్‌ పెరుగుతోంది. టీడీపీని వీడి వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తిరిగి వచ్చేందుకు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంటే.. పోయిన పట్టుకోసం, రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి దేవగుడి ఫ్యామిలీ కూడా టీడీపీ వైపు చూస్తోందట. జమ్మలమడుగులో ఒకప్పుడు టీడీపీ, కాంగ్రెస్‌లు మాత్రమే ప్రధానంగా ఉండేవి. తర్వాత వైసీపీ.. ఇప్పుడు బీజేపీ వచ్చాయి. పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి మొన్నటిదాకా ఆ పార్టీలోనే కొనసాగింది. 2019 ఎన్నికల తర్వాత టీడీపీని వదిలి వైసీపీలో చేరింది పొన్నపురెడ్డి ఫ్యామిలీ. అంతకుముందు వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబం ఆ తర్వాత బీజేపీలో చేరింది. దాంతో జమ్మలమడుగులో ఏ నాయకుడు లేని పార్టీగా టీడీపీ మిగిలిపోయింది.

అప్పట్లో టీడీపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి!

జమ్మలమడుగు నియోజకవర్గంలో దశాబ్దాలుగా చక్రం తిప్పింది దేవగుడి నారాయణరెడ్డి కుటుంబం. నాడు వైఎస్‌ ప్రధాన అనుచరుడిగా రాజకీయాలు చేశారు నారాయణరెడ్డి. మూడుసార్లు అసెంబ్లీకి పోటీ చేసిన ఆయన టీడీపీకి చెందిన పొన్నపురెడ్డి కుటుంబం చేతిలో ఓడిపోయారు. 2004 ఎన్నికల్లో దేవగుడి నారాయణరెడ్డికి బదులు అదే కుటుంబం నుంచి ఆయన సోదరుడు ఆదినారాయణరెడ్డిని కాంగ్రెస్‌ రంగంలోకి దింపింది. లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆదినారాయణరెడ్డిని ఉద్యోగానికి రాజీనామా చేయించి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి వరసగా గెలిచారు. 2009 తర్వాత నారాయణరెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి నాడు అధికారంలో ఉన్న టీడీపీలో చేరి.. మంత్రి పదవి దక్కించుకున్నారు. బద్ధ శత్రువుగా ఉన్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో దోస్తీ కట్టారు.

టీడీపీని వీడి బీజేపీలో చేరిన ఆదినారాయణరెడ్డి!

దశాబ్దాలుగా రెండు కుటుంబాల మధ్య సాగిన రాజకీయ కక్షలు, కార్పణ్యాలు, కేసులను పక్కన పెట్టి రాజీపడ్డారు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి. అప్పటి వరకు ఎమ్మెల్సీగా ఉన్న రామసుబ్బారెడ్డి 2019 ఎన్నికల్లో తన పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయ ఒప్పందాల్లో భాగంగా రామసుబ్బారెడ్డి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పదవిని టీడీపీ అధిష్ఠానం ఆదినారాయణరెడ్డి సోదరుడు శివనాథరెడ్డికి కట్టబెట్టింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు.

భూపేష్‌రెడ్డిని 2024లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దించుతారా?

వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి వరకు ఒక్కటిగా ఏకతాటిపై నడిచిన దేవగుడి కుటుంబంలో విభేదాలు వచ్చాయి. దేవగుడి నారాయణరెడ్డి, శివనాథరెరడ్డి కుటుంబాలు ఒకటిగా.. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కుటుంబం మరొకటిగా కొనసాగుతున్నాయన్న టాక్‌ నడుస్తోంది. అయితే 2019 ఎన్నికలకు ముందు కుటుంబంలో జరిగిన ఒప్పందం మేరకు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి కుమారుడు భూపేష్‌రెడ్డిని 2024 ఎన్నికల బరిలో టీడీపీ అభ్యర్థిగా బరిలో దింపాలని నిర్ణయించుకున్నారట. అందుకు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా అప్పట్లోనే ఓకే కూడా చెప్పారట. కానీ..ఆదినారాయణరెడ్డి ఇప్పుడు టీడీపీలో లేరు బీజేపీలో ఉన్నారు.

త్వరలోనే చంద్రబాబుతో నారాయణరెడ్డి భేటీ?

వైసీపీకి దేవగుడి ఫ్యామిలీ దూరంగా ఉండటం.. బీజేపీతో రాబోయే ఎన్నికల్లో నిలిచినా ప్రయోజనం ఉండబోదన్న అనుచరుల అభీష్టం మేరకు.. ఏ నాయకుడూ లేకుండా ఖాళీగా ఉన్న టీడీపీలో చేరే యోచనలో భూపేష్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో త్వరలోనే భేటీ అవుతారని దేవగుడి వర్గం చెవులు కొరుక్కుంటోంది. జమ్మలమడుగులో టీడీపీకి ఉన్న కేడర్‌.. దేవగుడి కుటుంబానికి ఉన్న ఇమేజ్‌ రెండు జత కలిస్తే వచ్చే ఎన్నికల్లో పోరాడవచ్చన్న నిర్ణయంతో నారాయణరెడ్డి టీడీపీ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అదేజరిగితే జమ్మలమడుగులో టీడీపీకి నాయకత్వ సమస్య తీరినట్టే. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-