టీటీడీ మాజీ ఛైర్మన్‌ మంత్రి పదవిపై దృష్టి పెట్టారా ?

అధికార పార్టీలో ఆయన సీనియర్ నేత. సీఎంకి దగ్గరి బంధువు కూడా. కానీ ఆయన ఇప్పుడు సంతృప్తిగా లేరట. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని భావిస్తున్న ఆయనకు నిరాశే మిగిలింది. ఇప్పుడైనా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకాలని.. చక్రం తిప్పాలని చూస్తున్న ఆ నేత ఫ్యూచర్‌ ఎలా ఉంటుందో? ఇంతకీ ఎవరాయన?

2014లో ఒంగోలు ఎంపీగా గెలిచారు

అధికార పార్టీ వైసీపీలో టీటీడీ తాజా మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చర్చగా మారారు. ఆయనకు మళ్లీ టీటీడీ బాధ్యతలు అప్పగిస్తారని ఒకవైపు చర్చ నడుస్తోంది. ఆయన మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావిస్తున్నారట. ఆ విధంగా వైవీ సుబ్బారెడ్డి రాజకీయ భవిష్యత్‌పై వైసీపీలో చర్చ జరుగుతోంది. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గానికి చెందిన వైవీ సుబ్బారెడ్డి.. సీఎం జగన్‌కి బాబాయ్. గతంలో వైఎస్ఆర్ వెంటఉంటూ పాలిటిక్స్ నడిపారు. వైఎస్ మరణం తరువాత జగన్‌కి అన్ని విషయాల్లో తోడుగా ఉంటున్నారు. 2014 ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపీగా గెలిచారు వైవీ. పార్టీ అధికారంలో లేకపోయినా.. ఒంగోలు పార్లమెంట్‌లో తనదైన ముద్ర వేశారు. 2019 ఎన్నికల్లో పార్టీ వ్యూహంలో భాగంగా సుబ్బారెడ్డిని పక్కన పెట్టి టీడీపీ నుండి వచ్చిన మాగుంట శ్రీనివాసులురెడ్డికి టికెట్‌ ఇచ్చింది వైసీపీ. దీంతో అసంతృప్తిగానే ఎన్నికల్లో పోటీ నుండి తప్పుకొన్నారు.

read also : ఏపీ రాజకీయాలపై సిసిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

అనుచరులకు న్యాయం చేయలేకపోతున్నానని ఫీలింగ్‌

ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలోనైనా, కేంద్రంలోనైనా ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించాలని వైవీ భావించారు. కానీ సీఎం జగన్.. బాబాయ్ సుబ్బారెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. రెండేళ్లపాటు టీటీడీ చైర్మన్‌గా ఉన్నారాయన. ప్రత్యక్ష రాజకీయాలకు దూరం కావడంతో తన అనుచరులకు న్యాయం చేయలేక పోతున్నానని వైవీ ఫీలవుతున్నారట.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నం

గతంలో ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాలు వైవీ సుబ్బారెడ్డి కనుసన్నల్లోనే జరిగేవి. జిల్లాలో ఆయనకు ఒకవర్గం కూడా ఏర్పాటైంది. టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత ఆయన జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నా.. ఆయన వర్గానికి పదవులు దక్కడం లేదని బాధపడుతున్నారట వైవీ. టీటీడీ ఛైర్మన్‌ పదవీకాలం పూర్తి కావడంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నారట. అయితే వైవీకి మరోసారి టీటీడీ ఛైర్మన్ పదవి దక్కుతుందని వైసీపీలో చర్చ జరుగుతోంది. ఆయన మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఉందని తన అనుచరుల వద్ద చెబుతున్నారట.

మంత్రి పదవిపై దృష్టి పెట్టారా?
రాజ్యసభ స్థానంపైనా ఫోకస్‌ ఉందా?

సీఎం జగన్ అవకాశం ఇస్తే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటానని వైవీ చెబుతున్నారట. రెండున్నరేళ్లలో కేబినెట్‌లో మార్పులు ఉంటాయని సీఎం జగన్ గతంలోనే చెప్పడంతో వైవీ దృష్టి మంత్రి పదవిపై పడిందని అధికారపార్టీలో చర్చ జరుగుతోంది. గతంలో ఎంపీగా పని చేసిన అనుభవం ఉండటంతో రాజ్యసభ స్థానంపై కూడా ఆయన దృష్టి సారించారని టాక్. ప్రస్తుతం ఉభయగోదావరి జిల్లాల వైసీపీ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని వైవీ ప్రయత్నిస్తుండటంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అన్న చర్చ హాట్ టాపిక్‌గా మారింది. సుబ్బారెడ్డి అనుకున్నట్టుగానే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి అధికార చక్రం తిప్పుతారా…లేక అబ్బాయి జగన్‌ చెప్పినట్టే విని తిరిగి టీటీడీ బాధ్యతలు తీసుకుంటారా అన్నది చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-