ఆ నియోజకవర్గం వైసీపీ నాయకులలో గ్రూపు రాజకీయాలు పార్టీకి కలిసొస్తుందా..?

ఒక నియోజకవర్గం.. మూడు వర్గాలు. ఒకరితో కుదరదని మరొకర్ని పెట్టినా పార్టీ గాడిలో పడటం లేదు సరికదా.. గ్రూపులు మరింతగా గట్టిపడుతున్నాయి. అందరినీ కలుపుకొని పోయే నేత లేక ఆ నియోజకవర్గ కేడర్‌ దిక్కులేనివారు అయ్యారట.

ఉండి వైసీపీలో ఇంఛార్జ్‌ల మార్పు కామన్‌!

పశ్చిమగోదారి జిల్లా ఉండి నియోజకవర్గం.. టీడీపీకి మరో కుప్పం. అలాంటి ఉండిలో పార్టీ జెండా ఎగరేయడానికి వైసీపీ చేయని ప్రయత్నం లేదు. ఇప్పటి వరకు అనేకమంది వైసీపీ ఇంఛార్జులు మారుతూ వచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఒకరు.. 2019 ఎన్నికల్లో ఇంకొకరు.. ఇప్పుడు మరొకరు ఉండి వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు.

ఉండి వైసీపీలో ఎవరి గ్రూపు వారిదే!

ఉండిలో వైసీపీ గెలవడం ఏమో కానీ.. ఈ నియోజకవర్గంలో ఉన్నన్ని రాజకీయాలు రాష్ట్రంలో ఇంకే నియోజకవర్గంలో లేవని పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటాయి. ఎవరి గ్రూపు వారిదే. ఎవరి రాజకీయ ఆట వారిదే. ఎదరుపడినప్పుడు నవ్వుతారు.. చేతులు కలిపి.. ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటారు… కలిసి కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. స్టేజ్‌ దిగగానే.. కుంపట్లు వేరు.. వర్గాలు వేరు.

ఎన్నికలప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు ఉండి వైసీపీ అలాగే ఉందా?

ప్రస్తుతం DCCB ఛైర్మన్‌గా ఉన్న పీవీఎల్‌ నరసింహారాజు, క్షత్రియ సంక్షేమ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, ప్రస్తుత ఇంఛార్జ్‌ గోకరాజు రామరాజు మధ్య అస్సలు పడటం లేదు. పార్టీలో సంబంధం లేకుండా ఈ ముగ్గురికీ మూడు వర్గాలు ఉన్నాయట. 2019 ఎన్నికల్లో PVL నరసింహారజు పోటీ చేసి ఓడిపోయారు. నిన్న మొన్నటి వరకు ఉండి వైసీపీ ఇంఛార్జ్‌ ఆయనే. రాష్ట్రం అంతా గెలిచినా ఉండిలో పార్టీ గెలవక పోవడాన్ని సవాల్‌గా తీసుకున్న వైసీపీ అధిష్ఠానం గట్టి నాయకత్వాన్ని అక్కడ తయారు చేయాలని భావించింది. అందుకే గట్టివారు అనుకున్న నేతలను ఇంఛార్జ్‌లుగా పెట్టింది. అయితే ఎవరికి వారు వర్గాలను వీడకపోవడం, పార్టీ పెట్టిన ఇంఛార్జ్‌లకు సహకరించకపోవడంతో ఎన్నికలప్పుడు పార్టీ ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉంది.

నేతలు వర్గాలుగా విడిపోవడంతో కలిసిరాని కేడర్‌!

2019 ఎన్నికల్లో ఓడిన నరసింహారాజు ఉండి వైసీపీలో వర్గపోరుకు కారణమయ్యారని ఆరోపణలు రావడంతో.. ఆయన్ని పక్కన పెట్టి గోకరాజు రామరాజును ఇంఛార్జ్‌ను చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదట. ఎన్నికల్లో గెలవలేకపోయినా.. పార్టీ అధికారంలో ఉండటంతో.. నేతల మధ్య ఆధిపత్యపోరు ఓ రేంజ్‌లో ఉందట. ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా.. ఎవరికి వారు చేసుకుని వెళ్లిపోతున్నారట. ఇలా అయితే కేడర్‌ ఎలా కలిసి వస్తుందనే విమర్శలు వైసీపీ శిబిరంలో వినిపిస్తున్నాయి.

ఉండిపై మంత్రి రంగనాథరాజు కన్నేశారా?

ఎన్నిసార్లు అధిష్ఠానం ఈ నియోజకవర్గం వర్గపోరుపై దృష్టిపెట్టినా నేతలు దారికి రావడం లేదు. ఉన్న మూడు వర్గాలు చాలదన్నట్టు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సైతం ఎంట్రీ ఇస్తున్నారట. ఉండి నియోజకవర్గంలోనే ఆయన స్వగ్రామం ఉంది. దీంతో మంత్రివర్గం.. ఇక్కడ ఇంఛార్జ్‌కు సహకరించడం లేదని టాక్‌. రంగనాథరాజు ప్రస్తుతం ఆచంట ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎప్పటికైనా ఉండిలో పోటీ చేస్తారని మంత్రి అనుచరులు భావిస్తున్నారట. అందుకే ఉండి వైసీపీ ఇంచార్జ్‌గా ఎవరు వచ్చినా సహకరించడం లేదని చెబుతున్నారు. కనీసం ఇంఛార్జ్‌వైపు కూడా చూడటం లేదట. మరి.. ఈ వర్గపోరుకు అధికారపార్టీ పెద్దలు ఎలా ఫుల్‌స్టాప్‌ పెడతారో.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని ఏ స్థాయిలో బలోపేతం చేస్తారో చూడాలి.

Related Articles

Latest Articles

-Advertisement-