వైఎస్ఆర్ తో గేమ్స్: ఇంతకీ ఆయన ఏపార్టీ ఎవరికి లాభం?

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నామస్మరణతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. వైఎస్ఆర్ మావాడంటే.. మావాడంటూ నేతలు పోటీపడుతున్నారు. ఇదికాస్తా శృతిమించుతుండటంతో అందరిబంధువైన వైఎస్ఆర్ ఇప్పుడు కొందరివాడుగా మిగిలిపోతున్నాడు. నిన్న హైదరాబాద్లో వైఎస్ విజయమ్మ నిర్వహించిన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనంగా సాక్షిగా ఈ విషయం రుజువైంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనందరినీ విడిచి 12ఏళ్లు గడుస్తుంది. నిన్ననే ఆయన 12వర్ధంతిని వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు నిరాడంబరంగా జరుపుకున్నారు. ఇడుపుపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ఆర్ ఫ్యామిలీ నివాళులు అర్పించింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఆయన చెల్లెలు షర్మిలా, తల్లి విజయమ్మకు మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయనే పుకార్ల మధ్య వారంతా ఒకే వేదిక పైకి వచ్చి వైఎస్ఆర్ కు నివాళులర్పించడం అందరి దృష్టిని ఆకర్షించింది.

అదేరోజు సాయంత్రం వైఎస్ విజయమ్మ హైదరాబాద్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ క్యాబినెట్లో పని చేసిన మంత్రులతోపాటు ఎమ్మెల్యేలను, ఇతర ఆత్మీయులను ఆహ్వానించారు. రాజకీయాలకతీతంగా వైఎస్ఆర్ సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వైఎస్ విజయమ్మ ప్రకటించారు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. వైఎస్ షర్మిల ఇటీవల కొత్త పార్టీ పెట్టారు. ఆమె రాజకీయ భవిష్యత్ కోసమే వైఎస్ విజయమ్మ హైదరాబాద్లో వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారనే టాక్ విన్పించింది. ఈక్రమంలోనే పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళానికి కాంగ్రెస్ నుంచి ఎవరూ వెళ్లొద్దని హుకూం జారీ చేశారు.

వైఎస్ విజయమ్మ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం కేవలం రాజకీయ ప్రేరేపితంగానే తాము భావిస్తున్నట్లు రేవంత్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ స‌మ్మేళ‌నానికి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఎందుకు రావ‌డం లేదో చెప్పాల‌ని రేవంత్‌రెడ్డి ప్ర‌శ్నించారు. రాహుల్‌ను ప్ర‌ధాని చేయ‌డ‌మే త‌న ల‌క్ష్యంగా వైఎస్సార్ చివ‌రి రోజుల్లో ప్ర‌క‌టించార‌న్నారు. వైఎస్ విజ‌య‌మ్మ‌, ఆమె త‌నయ ష‌ర్మిల అందుకోసం ప‌ని చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తే స‌మ్మేళ‌నానికి వెళ్లడానికి తమకేమీ అభ్యంతరం లేదని రేవంత్‌ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

రేవంత్ వ్యాఖ్యలపై భిన్నస్వరాలు విన్పిస్తున్నాయి. రేవంత్ కు కొందరు మద్దతు ఇస్తుండగా మరికొందరు తప్పుబడుతున్నారు. వైఎస్ఆర్ అందరివాడని.. ఆయన పేరుతో డేంజర్ గేమ్ ఆడొద్దని సూచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నమ్మి రేవంత్ కు పీసీసీ ఇస్తే ఆయన తన సొంత పెత్తనంతో దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నారు. వైఎస్ఆర్ పేరుతో ఆయన డేంజర్ గేమ్ ఆడుతున్నారని ఇది కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తుందని అంటున్నారు.

వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి కాంగ్రెస్ నేతలు ఎవరూ వెళ్లకూడదని టీపీసీసీ నిర్ణయించడం అంటే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ ను దూరం చేసుకోవడమేనని అంటున్నారు. కాంగ్రెస్ లోని వైఎస్ఆర్ అనుచరులను బయటికి పంపేందుకు రేవంత్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. మరోవైపు టీడీపీ నుంచి వచ్చిన నేతలకే ప్రస్తుతం కాంగ్రెస్ లో ప్రాధాన్యం లభిస్తుండటంపై కాంగ్రెస్ సీనియర్లు మండిపడుతున్నారు.

అసలు తాము కాంగ్రెస్ లో ఉన్నామా? లేదా టీడీపీలో ఉన్నామా? అని తెలియడం లేదని వాపోతున్నారట. రేవంత్ రెడ్డికి కుడిభుజంగా ఉన్న సీతక్క ఇటీవల చంద్రబాబు నాయుడి దగ్గరకు వెళ్లి ఎలా రాఖీ కట్టిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో రాజకీయాలు వేరు.. పర్సనల్ లైఫ్ వేరని విషయం పక్కదారి పట్టించారని వైఎస్ఆర్ అభిమానులు గుర్తు చేసుకున్నారు. ఇది వైఎస్ఆర్ విషయంలో ఎందుకు వర్తించదంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

ఏదిఏమైనా వైఎస్ఆర్ విషయంలో కాంగ్రెస్ రెండుగా చీలికనట్లు కన్పిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ మనిషి మాత్రమే కాదని అందరి వాడని ఈ విషయాన్ని రేవంత్ గుర్తిస్తే మంచిదని పలువురు సూచిస్తున్నారు. వైఎస్ఆర్ విషయంలోనూ రేవంత్ ఇలానే దూకుడుగా వ్యవహరిస్తే అది కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ నష్టం కలిగిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Related Articles

Latest Articles

-Advertisement-