యువతకు గుండె..పోటు!

నిండా ముప్పయ్‌ లేవు గుండెపోటు….పాతికేళ్ల పిల్లాడికి గుండెపోటేంటి విచిత్రం కాకపోతే… అవును ఒకప్పుడైతే ఇది నిజంగా విచిత్రమే. కానీ ఇప్పుడు కామనైంది. 30, 40ల్లో హార్ట్‌ ఎటార్‌ బారిన పడే యువత సంఖ్య ఈ మధ్య కాలంలో గణనీయంగా పెరుగుతోంది.

ప్రముఖ టీవీ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది. ఆయన వయస్సు నలబై ఏళ్లే. ఇంత చిన్న వయసులో గుండెపోటుతో చనిపోవటమే ఈ కలవరానికి కారణం. దీనిని ముంబైలోని కూపర్ ఆసుపత్రి ధృవీకరించింది. చిన్న వయసులో గుండెపోటుకు గురయ్యే సంఘటనలు ఇప్పడు మనం తరచూ వినాల్సి వస్తోంది.

పది, పదిహేను ఏళ్ల క్రితం యువతలో ఇంతాలా హార్ట్‌ ఎటాక్‌ కేసులు ఉండేవి కాదు. మరీ ముఖ్యంగా గత రెండు మూడేళ్లలో ఇవి సాధారణం అయ్యాయి. 18, 20 ఏళ్ల పిల్లలు కూడా హఠాన్మరణం చెందటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఎందుకు ఇలా జరుగుతోంది. దీనికి డాక్టర్లు ఏమంటున్నారంటే.. మారిన లైఫ్‌ స్టయిలే కారణమన్న సమాధానం వస్తోంది. మరీ ముఖ్యంగా యువతలో స్మోకింగ్‌ అలవాటు ఎక్కువగా ఉండటం. వృత్తిపరమైన అధిక మానసిక వత్తిడి. శారీరక శ్రమ తగ్గిపోవటం. ఇదే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

డయాబిటెస్‌, అధికరక్తపోటు, అధిక కొలస్ట్రాల్‌ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాల్సిందే. ఇవేమీ లేకపోయినా ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. ఐతే ఇవేమీ లేకపోయినా రోజుకు కనీసం అరగంట నుంచి ముప్పావు గంట శారీరక శ్రమ చేయాలి. అంటే సైక్లింగ్‌, వాకింగ్, రన్నింగ్‌, స్విమ్మింగ్‌ వంటి కార్డియో ఎక్సర్‌సైజ్‌ గుండెకు మంచింది. అలాగే ఎక్కువ మోతాదులో బరువు ఎత్తటం గుండెకు అంత మంచిది కాదన్నది వైద్యుల సలహా.

ఒకప్పుడు గుండెపోటు 60 ఏళ్లు దాటితేనే వస్తుందని అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు 40 ఏళ్లు అనేది హార్ట్‌ ఎటాక్‌కు కామన్‌ ఏజ్‌గ్రూప్‌గా మారింది. అలా చనిపోతునన వారిలో దాదాపు 20 శాతం మంది 40 , అంతకంటే తక్కువ వయస్సు వారే. మరోవైపు, గుండె పోటుతో మ‌ర‌ణించే వారిలో 25 శాతం మంది 35 ఏండ్ల లోపు వారేన‌ని కార్డియాల‌జీ సొసైటీ ఆఫ్ ఇండియా స‌ర్వే అంటోంది.

1970 త‌ర్వాత జ‌న్మించిన వారిలో గుండె జ‌బ్బుల ముప్పు అధికంగా ఉంది. శారీరక శ్రమకు దూరంగా ఉండటమే దానికి ప్రధాన కారణం. లాన్సెట్ జ‌ర్నల్‌ పబ్లిష్‌ చేసిన ఓ అధ్యయనం ప్రకారం స్మోకింగ్‌, వ్యాయామం చేయకపోవటం, మ‌ద్యపానం, డ్రగ్స్‌, స్ట్రెస్‌, ఒబేసిటీతో పాటు జ‌న్యు ప‌ర‌మైన కార‌ణాలతో కూడా యువ‌త‌లో గుండె జ‌బ్బుల బారినపడుతున్నారు.

సాధారణంగా ఇలాంటి మరణాలు మన కళ్ల ముందే ఎన్నో కనిపిస్తున్నాయి. కానీ సెలబ్రిటీలు అలా మృత్యువాత పడినప్పుడే అందరికీ తెలుస్తోంది. ఇటీవలి కాలంటో పలువురు టీవీ, చలన చిత్ర ప్రముఖులు గుండెపోటుతో మరణించారు. వారిలో చాలా మంది 30, 40 ఏజ్‌ గ్రూప్‌ వారే. దర్శకుడు రీతూపర్ణో ఘోష్‌, రాజ్‌కౌశల్‌, వివేక్‌ శౌక్‌. ఇందర్‌ కుమార్‌, అమిత్‌ మిస్త్రీ , అబిర్‌ గోస్వామి, ఆర్తి అగర్వాల్‌ ఇలా చాలా మంది హార్ట్‌ఎటాక్‌తో హఠాన్మరణం చెందారు. అయితే ఈ ట్రెండ్‌ భారత్‌లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇది మరింత కలవరపెట్టే విషయం. దీనిపై విస్తృత అవగాహనా కార్యక్రమాలు చేపట్టి యువతను అప్రమత్తం చేసే బాధ్యత ఇటు ప్రభుత్వం అటు వైద్యులపై ఎంతో ఉంది.

Related Articles

Latest Articles

-Advertisement-