ఏపీలో ఆ వైసీపీ ఎమ్మెల్సీకి కొత్త కష్టాలు !

రాజకీయాలను వదిలేసి.. వచ్చిన దారినే వెళ్లిపోదామని అనుకున్నారు. ఇంతలోనే పెద్ద పదవి వరించింది. ఆ సంతోష సమయంలోనే కాలాంతకుల చేతికి చిక్కారు. పోలీసులూ చుక్కలు చూపిస్తున్నారట. ఏం జరుగుతుందో తెలియక తలపట్టుకున్నారు ఆ ప్రజాప్రతినిధి. వైసీపీలో చర్చగా మారిన ఆ నాయకుడెవరో ఈ స్టోరీలో చూద్దాం.

ఎమ్మెల్సీ అయిన సంతోషం ఆవిరి.. వరస కష్టాలు!

ఏపీలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ అయిన కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఆర్‌.రమేష్‌ యాదవ్‌కు వరస కష్టాలు కలవర పెడుతున్నాయి. ప్రొద్దటూరు మున్సిపల్‌ రాజకీయాలు చుక్కలు చూపించడంతో ఎన్నికల్లో ఖర్చుపెట్టిన డబ్బులు తిరిగిచ్చేస్తే వచ్చిన దారినే వెళ్లిపోతానని ఒకానొక సమయంలో పెద్దగొడవ చేశారు. ఈ అంశంపై చర్చలు జరుగుతుండగానే అనూహ్యంగా రమేష్‌యాదవ్‌ను ఎమ్మెల్సీని చేశారు సీఎం జగన్‌. ఈ ఎంపిక పార్టీ వర్గాలతోపాటు రమేష్‌ను సైతం ఆశ్చర్య పరిచింది. ఏదో మున్సిపల్‌ ఛైర్మన్‌ అవుదామని వస్తే.. ఏకంగా ఎమ్మెల్సీని చేయడంతో ఆయనకు నోట మాట రాలేదు. ఓవర్‌నైట్‌ పార్టీలో పెద్ద సెలబ్రెటీ అయిపోయారు. కానీ.. ఆ పదవే ఆయనకు అనుకోని చిక్కులు తెచ్చిపెట్టింది.

read also : హుజురాబాద్‌ ఉపఎన్నికలో రసమయి పాత్ర ఏంటి?

పోలీసులకు ఫిర్యాదు చేశాక మరో మలుపు తీసుకున్న సమస్య!

ఎమ్మెల్సీ పదవి వచ్చిందని ఎక్కువ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి రమేష్‌యాదవ్‌ను బెదిరించారు. కొత్త ఎమ్మెల్సీకి మైండ్‌ బ్లాంక్‌ అయింది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆశీసుల వల్లే ఎమ్మెల్సీ పదవి వచ్చిందని ప్రకటించినా.. నియోజకవర్గంలో తనను శత్రువుగా చూస్తోంది ఎవరో రమేష్‌కు అర్థం కాలేదట. వైసీపీ అధిష్ఠానం కూడా బెదరింపు కాల్స్‌పై ఆరా తీసిందని చెబుతున్నారు. ఫోన్‌లో బెదిరించినవారు ఎవరో గుర్తించి.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని జూన్‌ 30న పోలీసులకు ఫిర్యాదు చేశారు రమేష్‌. పోలీసుల విచారణలో కాలాంతకులు చిక్కుతారని భావిస్తే.. ఖాకీలే ఎమ్మెల్సీకి చుక్కలు చూపించారట. ఆ అంశం కూడా అధికారపార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఎమ్మెల్సీ ఏడాది కాల్‌ లిస్ట్‌ సేకరించారా?
ప్రైవేట్‌ వ్యక్తుల చేతికి ఏడాది కాల్‌ లిస్ట్‌?

ఫోన్‌లో ఎవరు బెదిరించారో తెలుసుకోవాలంటే ఎమ్మెల్సీ రమేష్‌ కాల్‌ లిస్ట్‌ అవసరం. బెదిరింపు కాల్స్‌ వచ్చిన తేదీలలో కాల్ డేటాను తీసుకునేందుకు ఎమ్మెల్సీ అంగీకారం తెలియజేస్తూ లేఖ కూడా ఇచ్చారు. అయితే పోలీసులు.. బెదిరింపు కాల్స్‌ వచ్చిన రోజులకు బదులు రమేష్‌ ఫోన్‌కు సంబంధించిన ఏడాది కాల్‌ డేటాను తీసుకున్నారట. ఈ విధంగా ప్రజాప్రతినిధి కాల్‌ డేటా తీసుకోవాలంటే చాలా ప్రోసీజర్‌ ఉంటుంది. పోనీ.. ఈ కేసులో తీసుకున్న ఏడాది కాల్‌ డేటాను జాగ్రత్త చేశారా అంటే.. ఆ డేటా మొత్తం కొందరు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ రమేష్‌కు.. తన చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదట. పార్టీ నేతలను విశ్వసించాలా? లేక పోలీసులను నమ్మాలో ఒక పట్టాన తేల్చుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది.

పోలీస్‌ ఉన్నతాధికారులను కలవాలని రమేష్‌ నిర్ణయం!

ఏడాది కాల్‌ డేటాను ఎందుకు సేకరించారు? ఇందుకు అనుమతి ఎందుకు తీసుకోలేదు? ఏడాది కాల్‌ డేటా ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లింది? అన్న అంశాలపై ఎమ్మెల్సీ రమేష్‌ సీరియస్‌గా ఉన్నారట. పోలీస్‌ ఉన్నతాధికారులను కలిసి ఆయన ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై మీడియాతో మాట్లాడేందుకు కూడా రమేష్‌ ఆసక్తి చూపించడం లేదు. మొత్తానికి బెదిరింపు కాల్స్‌ చేసిందెవరో తెలియకుండానే ఈ విధంగా కాల్ లిస్ట్‌ బయటకు రావడంతో.. రమేష్‌ను టార్గెట్‌ చేసింది ఎవరు? ఈ ఘటన వెనక ఉన్నది ఎవరన్నది ఉత్కంఠ రేపుతోంది. మరి.. రాజకీయాలకు కొత్త అయిన రమేష్‌..ఈ సమస్యలను ఏ విధంగా అధిగమిస్తారో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-