టీ పీసీసీ చీఫ్‌ పీఠం కోసం నేతల దాగుడుమూతలు

కాంగ్రెస్‌లో వాళ్లిద్దరూ.. మంచి మిత్రులు. రాజకీయంగా కలిసి పనిచేస్తున్నారు. ఒకరికోసం ఇంకొకరు సాయం చేసుకుంటారు కూడా. ఓ కీలక విషయంలో మాత్రం ఆ ఇద్దరిలో ఒకరు మధ్యలోనే కాడి పడేశారు. రేస్‌లో లేనని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారట. ఇంతకీ ఎవరా మిత్రులు? ఏంటా విషయం?

ఒకరికోసం ఒకరు సాయం చేసుకుంటారు

తెలంగాణ PCC చీఫ్ పోస్ట్‌ కోసం నాయకులు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ పలుకుబడి ఉన్నవాళ్లు సొంతంగా.. అధిష్ఠానం దగ్గరకు వెళ్లడానికి ఇబ్బంది పడేవారూ.. పార్టీలోని మిత్రుల సాయంతో లాబీయింగ్‌ చేస్తుంటారు. పైగా ఇలాంటి యవ్వారాలు కాంగ్రెస్‌లో సహజం. ఇలాంటి కోవలోకే వస్తారు మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. కాంగ్రెస్‌ పార్టీలో శ్రీధర్ బాబు.. భట్టి విక్రమార్క మిత్రులు. రాజకీయంగా సీఎల్పీలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా.. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఈ ఇద్దరి ఆలోచన ఫైనల్‌.

శ్రీధర్‌బాబు పేరును బలపర్చిన భట్టి

కొత్త పీసీసీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియ మొదలైన తర్వాత రేస్‌లోకి వచ్చారు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు. మిత్రుడి కోసం భట్టి విక్రమార్క సైతం భుజం కాశారు. AICCలో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని శ్రీధర్‌బాబు పేరును బలపర్చారు. పీసీసీ రేస్‌లో ఎవరెవరు ఉన్నారు అనే చర్చలో.. శ్రీధర్‌బాబు పేరు కూడా ప్రధానంగా వినిపించే వరకు వ్యవహారం వెళ్లింది. కాంగ్రెస్‌పార్టీలో ఎంపీ రేవంత్‌ను వ్యతిరేకించే వారంతా శ్రీధర్‌బాబు పార్టీకి లాయల్‌ అని కోరస్‌ ఇచ్చారు కూడా. ఆయనతోపాటు ఆయన తండ్రి కూడా కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారని.. అలాంటి నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీలో చాలా మంది మద్దతు కూడగట్టారు భట్టి. హైకమాండ్‌లోని కీలక నాయకుల దగ్గర సైతం ఇదే ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

తెరపైకి సామాజిక సమీకరణాలు.. రేస్‌లో లేనన్న దుద్దిళ్ల!

అయితే కాంగ్రెస్‌లో భట్టిని వ్యతిరేకించే వర్గం.. రేవంత్‌కు అనుకూలంగా ఉండేవారు సామాజిక సమీకరణాలను తెరమీదకు తెచ్చారు. శ్రీధర్‌బాబు సామాజికవర్గానికి పీసీసీ పీఠం ఇస్తే ఎలా ఉంటుందని కొందరు చర్చకు పెట్టారు. ఈ చర్చ తర్వాత ఆయన ఆశలు సన్నగిల్లాయట. అలాగే భట్టి ప్రయత్నాలకు బ్రేక్‌ పడినట్టు టాక్‌. కొత్త పీసీసీ సారథిపై ఢిల్లీ స్థాయిలో పరిణామాలు సీరియస్‌గా సాగుతున్న తరుణంలో శ్రీధర్‌బాబు తాను రేస్‌లో లేనని బాంబు పేల్చారు.

ఇంతలో జీవన్‌రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యేల లేఖ!

ఇన్నాళ్లూ శ్రీధర్‌బాబు కోసం ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేసిన భట్టి సైతం సైలెంట్‌ అయ్యారు. భట్టి ఈ మధ్య ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఏం జరిగిందన్నది ఆసక్తిగా మారింది. భట్టి తనకే పీసీసీ చీఫ్‌ పోస్ట్‌ కావాలని ప్రయత్నించారా? లేక మరొకరి కోసం ట్రై చేశారా అనే చర్చ స్టార్ట్‌ అయింది. ఢిల్లీ వెళ్లొచ్చాక.. సీఎల్పీలోని సభ్యులు మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి పీసీసీ చీఫ్‌ పోస్ట్‌ ఇవ్వాలని ప్రతిపాదిస్తూ కొందరు సంతకాలు చేసి లేఖ పంపారు. పార్టీ పరంగా ఇది కీలక పరిణామంగా నేతలు భావిస్తున్నారట.

సీఎల్పీ లేఖపై పార్టీలో చర్చ!

నాగార్జున సాగర్‌ ఎన్నికలకంటే ముందు జరిగిన కసరత్తులో జీవన్‌రెడ్డి పేరును పార్టీలోని సీనియర్లు, ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ప్రతిపాదించారు. ఇప్పుడు సీఎల్పీ సభ్యులు జీవన్‌కు మద్దతుగా.. రేవంత్‌కు వ్యతిరేకంగా లేఖ రాశారని సమాచారం. అయితే సీఎల్పీలో ఎమ్మెల్యే సీతక్క.. ఎంపీ రేవంత్‌ టీమ్‌లో ఉన్నారు. ఆమె సంతకం ఆ లేఖలో లేదట. మొత్తానికి ఎవరి ట్రయల్స్‌ ఎలా ఉన్నా.. దాగుడుమూతలు మాత్రం పార్టీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-