తాడిపత్రిలో మళ్లీ పొలిటికల్ హీట్‌!

ఆ ఇద్దరి నేతల మధ్య నిత్యం ఆధిపత్య పోరే. ఏ చిన్న వివాదం వచ్చినా రావణకాష్టంలా మారుతుంది. మొన్నటికి మొన్న ఆ ఊరే రణరంగమైంది. ఇప్పుడు ఎన్నికలు.. మాటల తూటాలు లేవు. ప్రశాంతంగా ఉన్న సమయంలో మరో అగ్గి రాజుకుంది. సై అంటే సై అంటున్నారు. సమస్య అధికారులకు, పోలీసులకు తలనొప్పి తెచ్చిపెడుతోందట. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథ?

తాడిపత్రిలో మళ్లీ రాజకీయ భగభగలు!

మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరమో.. మీ ఇంటి నుంచి మా ఇంటికి కూడా అంతే దూరం. తాడిపత్రి రాజకీయాలకు ఈ డైలాగ్‌ సరిగ్గా సరిపోతుంది. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిల మధ్య ఏ ఘటన జరిగినా ఆ డైలాగ్ గుర్తొస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏదైనా చేశారంటే.. మా టైం వచ్చినప్పుడు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చెబుతారు నాయకులు. ఎన్నికలు ఏవైనా తాడిపత్రిలో రణరంగమే. మొన్నటికిమొన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి నేరుగా జేసీ ఇంటికెళ్లడంతో.. ఆ తర్వాత పదిరోజులపాటు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఇప్పుడు కొత్త సమస్య రాజుకుంటుంది.

జేసీ కుటుంబ నిర్వహణలో ఉన్న ఆలయంపై పెద్దారెడ్డి కన్ను!
జేసీ వర్గం యాగం చేయాలని నిర్ణయించడంతో రగడ

తాజాగా ఒక ఆలయ వివాదం పెద్దారెడ్డి, ప్రభాకర్‌రెడ్డిల మధ్య పోరుగా మారింది. పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామంలోని శ్రీ వజ్రగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలం ఉంది. 1950 నుంచి ఈ ఆలయం జేసీ వర్గీయుల చేతుల్లో ఉంది. వారే కమిటీ మెంబర్లుగా ఉంటున్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక కూడా JC ఫ్యామిలీ పెత్తనం ఏంటి అనుకున్నారో ఏమో.. ఆ గుడిని దేవాదాయ శాఖ పరిధిలోకి చేర్చేశారు పెద్దారెడ్డి. అంతే అప్పటి నుంచి ఆలయం అంతా ఆ శాఖ పరిధిలోకి వెళ్లింది. JC ఫ్యామిలీ పెత్తనం నామమాత్రం అయిపోయింది. తన పెత్తనం ఉందని చెప్పడానికో లేక.. జనం కోసం చేద్దామని అనుకున్నారో కానీ.. JC ప్రభాకర్‌రెడ్డి గుళ్లో యాగం చేయాలని నిర్ణయించారు. దానికి అధికారులు నో చెప్పారు. దాంతో గొడవ మొదలైంది.

పోలీసు భద్రత మధ్య హుండీ లెక్కింపు

తరతరాల నుంచి దేవస్థానం అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు ఎమ్మెల్యే పెద్దారెడ్డి ప్రోద్బలంతో కమిటీకి తెలియకుండా ఆలయాన్ని ఎండోమెంట్ స్వాధీనం చేసుకుందని జేసీ వర్గం ఆరోపిస్తోంది. అంతే కాకుండా స్వామివారి ఆభరణాలు తీసుకుని హుండీని కూడా స్వాధీనం చేసుకున్నారు ఎండోమెంట్‌ అధికారులు. దశాబ్దాలుగా హుండీ, కల్యాణ మండపం తాళాలు జేసీ అనుచరుల అధీనంలో ఉంది. తిమ్మన చెరువు గ్రామ దేవస్థాన కమిటీ తాళాలు అడిగిన ఇవ్వకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల సమక్షంలో హుండీ తాళాలు పగలగొట్టి డబ్బులు లెక్కింపు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఎలాంటి రాజకీయాలు లేవని.. నిబంధనల ప్రకారం ఎండోమెంట్ అధికారుల సమక్షంలోనే అంతా పారదర్శకంగా జరుగుతోందని చెబుతున్నారు కమిటీ సభ్యులు.

పూజలు చేయడానికి కొత్త కమిటీ నిర్ణయం
రెండు వర్గాలకు నో చెప్పిన అధికారులు

కొన్ని రోజులుగా తాడిపత్రి చాలా కూల్ గా ఉంది. పెద్దారెడ్డి, జేసీలు సైలెంట్ గా ఉన్నారు. జేసీ వర్గం యాగం తలపెట్టిన సమయంలోనే అధికారపార్టీ నాయకులు కూడా కొత్త కమిటీ ద్వారా పూజలు చేయిస్తామని ప్రకటించారు. ఇలా రెండు వర్గాలు పోటీ పడటంతో.. శాంతిభద్రతల సమస్య వస్తుందని భావించిన అధికారులు పర్మిషన్‌ ఇవ్వలేదు. యాగం విషయంలో రాజకీయ కోణాన్ని తెలుసుకున్న పోలీసు శాఖ అప్రమత్తమైంది. రెండువర్గాలను ఆలయం చుట్టుపక్కలకు రాకుండా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతానికి పెద్దారెడ్డి, జేసీ వర్గాలు కామ్‌గా ఉన్నట్టు కనిపిస్తున్నా.. సమస్య మాత్రం ఎప్పుడో ఒకసారి భగ్గుమనే అవకాశం కనిపిస్తోందట.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-