తేరా చిన్నప రెడ్డికి ఎక్కడ తేడా జరిగింది…?

ఉపఎన్నికలో కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్సీగా గెలిచిన తేరా చిన్నపరెడ్డికి ఎందుకు రెన్యువల్‌ చేయలేదు? తేరా వర్గానికి ఎక్కడ తేడా కొట్టింది? అధికారపార్టీ నిర్ణయంపై చిన్నపరెడ్డి వర్గం స్పందన ఏంటి?

తేరా ప్లేస్‌లో కోటిరెడ్డి అభ్యర్థి..!

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ అవకాశం దక్కలేదు. ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్సీ బరిలో నిలిచిన ఆయన భారీగా ఖర్చు చేశారు. మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడిపోగా.. తర్వాత రెండేళ్లకు వచ్చిన ఉపఎన్నికలో గెలిచారు. పూర్తిస్థాయిలో ఎమ్మెల్సీగా పదవిలో లేకపోవడంతో.. మరోసారి ఆయనకే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో అవకాశం ఇస్తారని అనుకున్నారు. అనూహ్యంగా తేరా ప్లేస్‌లో MC కోటిరెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేసింది అధికారపార్టీ.

మరోసారి ఛాన్స్‌ ఇస్తారని ప్రచారం జరిగింది..!

2019లో జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికలో గెలిచిన తేరా చిన్నపరెడ్డి పదవీకాలం జనవరి 4తో ముగియనుంది. కేవలం రెండేళ్లే ఆ పదవిలో ఉన్నారు. 2015, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టడంతో.. ఈసారి పూర్తిస్థాయిలో పదవీయోగం ఉంటుందని పార్టీ వర్గాలు ఆశించాయి. కానీ.. పార్టీ నిర్ణయం మరోలా ఉండటంతో చిన్నపరెడ్డితోపాటు ఆయన వర్గం తీవ్ర అసంతృప్తిలోకి వెళ్లిపోయిందట.

నిరాశలో చిన్నపరెడ్డి వర్గం..!

అయితే నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక సందర్భంగా కోటిరెడ్డికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీతో మొత్తం పరిస్థితి మారిపోయింది. ఆ ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే.. కోటిరెడ్డిని ఎమ్మెల్సీని చేస్తానని ముఖ్యమంత్రి నాడు ప్రకటించారు. ఆ హామీకి అనుగుణంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోటిరెడ్డికి అవకాశం కల్పించారు. ఈ విషయం తెలిసిన వెంటనే కోటివర్గం సంబరాల్లో మునిగిపోతే.. చిన్నపరెడ్డి వర్గం తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.

చిన్నపరెడ్డి ఇప్పుడేం చేస్తారు?
అయితే చిన్నపరెడ్డి గతంలో జానారెడ్డి అనుచరుడు కావటం, పైగా ఆయన జిల్లాలో పెద్దగా ఎవరితో కలిసుండక పోవటం కూడా ఇప్పుడు అవకాశం రాకపోవటానికి కారణమని తెలుస్తోంది.
అదే సమయంలో కోటిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం వెనక ఒక మంత్రి జగదీశ్‌ రెడ్డి ఉన్నారని సమాచారం. జిల్లా అధికారపార్టీలో వర్గ రాజకీయం సైతం చిన్నపరెడ్డికి ప్రతికూలంగా మారినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? పార్టీ నిర్ణయాన్ని స్వాగతించి కామ్‌గా ఉండిపోతారా? అసంతృప్తిని గుర్తించి పార్టీ నేతలు చిన్నపరెడ్డిని బుజ్జగిస్తారో లేదో చూడాలి. కాకపోతే.. అధికారపార్టీ తీసుకున్న నిర్ణయం మాత్రం ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయాల్లో మాత్రం చిన్నపరెడ్డి విషయం హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

Latest Articles