అక్కడ సైకిల్ పార్టీ గతమెంతో ఘనం.. పార్టీకి శాపంలా మారుతున్న నాయకుల వర్గపోరు

అక్కడ సైకిల్‌ పార్టీ గతమెంతో ఘనం.. వర్తమానం అయోమయం. దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీకి ఓ ఆఫీస్‌ లేదు… ఆఖరికి నగర అధ్యక్షుడు కూడా లేడు. ఇద్దరు నేతలు పట్టుకోసం చేసే ప్రయత్నాల్లో సైకిల్‌ దారి తప్పుతోందట. మేయర్‌ ఎన్నికలో హ్యాట్రిక్‌ కొట్టిన చరిత్ర నుండి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోందట.

గతమంతా ఘనం. వర్తమానం ప్రశ్నార్థకం అన్నట్టు మారింది..రాజమండ్రిలో టిడిపి పరిస్థితి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు మేయర్ పీఠాన్ని దక్కించుకుని హ్యాట్రిక్ సాధించిన టిడిపి ఇప్పుడు ఊహించని కష్టాల్లో పడింది. గత వైభవం కనీస మాత్రంగా కూడా కనిపించటం లేదు. నాయకుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు.. టీడీపీకి శాపంలా మారుతున్నాయి. పంతాలు, పట్టింపులు, వర్గ విభేదాలు వెరసి టీడీపిని కష్టాల్లోకి నెడుతున్నాయి. మళ్ళీ పూడ్చుకోలేనంత నష్టానికి కారణమౌతున్నాయి. ఒక వైపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు అధికార వైసిపి వ్యూహాత్మకంగా రెడీ అవుతోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ శ్రేణులు ఆరాటపడుతున్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో సైతం రాజమండ్రి అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. దీనికి కారణం ఇక్కడ బలమైన క్యాడర్‌ ఉండటమే. కానీ, ఇప్పుడు ఇప్పుడు ఆ పార్టీకి రాజమండ్రిలో నాయకులు మాత్రమే మిగిలి, కార్యకర్తలు దూరమౌతున్నారనే టాక్‌ ఉంది.

రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేలు ఇద్దరూ టీడీపీ వారే. కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా పార్టీకి సొంత కార్యాలయం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి అనుకుని ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ లో టీడీపీ కార్యాలయంగా ఉండేది. టీడీపీ ఆవిర్భావం నుంచి 2019 ఎన్నికల వరకూ ఇదే పార్టీకి కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. వరుసగా 2002, 2007, 2014 మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ నుంచే జయకేతనం ఎగురవేసింది. టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యాలయం నిత్యం సందడిగా ఉండేది. 2019 తర్వాత ఇక్కడ టీడీపీ కార్యాలయం ప్రభ తగ్గింది. గత కొంతకాలంగా కార్యాలయాన్ని కనీసం తెరవడమే లేదు.

ఉభయ గోదావరి జిల్లాలకు రాజమండ్రి రాజకీయకేంద్రంలాంటిది. ఇక్కడ గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఇద్దరు నేతలు టిడిపిలో ప్రత్యేక వర్గాలను పోషిస్తున్నారు. ఉత్తర దక్షిణ ధృవాలుగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఎవరికి వారు తమ ఇళ్ళ వద్దే కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. ఒకప్పుడు గోరంట్ల ప్రోత్సాహంతోనే ఆదిరెడ్డి అప్పారావు అర్బన్ అధ్యక్ష పదవిని…. ఆయన భార్య వీరరాఘవమ్మ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేశారు. తదనంతర పరిణామాల్లో కార్పొరేషన్ లో పట్టుకోసం ఇరువురూ ప్రయత్నించటంతో గోరంట్ల, ఆదిరెడ్డిల మధ్య విభేదాలకు దారితీసింది. అప్పట్నుంచి విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి.

ఈ మధ్యలో ఆదిరెడ్డి అప్పారావు వైసీపీలో చేరి ఎమ్మెల్సీ పదవిని పొంది, తిరిగి టీడీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికల్లో గోరంట్లను కాదని ఆదిరెడ్డి తన కోడలు భనానికి రాజమండ్రి సిటీ అసెంబ్లీ టికెట్ సాధించగలిగారు. అప్పట్నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి అప్పారావుకు మధ్య సంబంధాలు ఉప్పు నిప్పులా మారాయి. రాజమండ్రి ఆధిపత్యం కోసం ఇద్దరు నాయకులు బహిరంగంగానే పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నాటికైనా ఈ ఇద్దరూ కలుస్తారా…? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఒకప్పుడు రాజమండ్రిలో ఎదురులేని పార్టీగా ఎదిగిన టిడిపి, ఇప్పుడు నాయకుల మధ్య ఆధిపత్యం లోపించటంతో చాలా బలహీనపడింది. నాయకులు ఎవరికి వారుగా మారటంతో కార్యకర్తల్లో అయోమయం ఏర్పడింది. దీనికి తోడు పార్టీ పరంగా సంస్థాగత కమిటీలు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో టీడీపీ ఉంది. కనీసం నగర పార్టీ అధ్యక్షుడు కూడా లేడంటే పరిస్థితి ఎలా దిగజారిందో అర్థమౌతుంది.

ఈ పరిస్థితుల్లో చాలా మంది కార్యకర్తలు టీడీపీని వీడుతున్నారు. ఎంత కష్టపడినా ఫలితం శూన్యమనే నిస్పృహలో మరికొందరున్నారు. నిజానికి రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇద్దరు నేతలు కలిసి పనిచేస్తే విజయం టీడీపీకి నల్లేరు మీద నడకే అనేటాక్‌ ఉంది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి చేతులెత్తేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలే బహిరంగంగా గుసగుసలాడుకుంటున్నారు. రాజమండ్రి సైకిల్‌ పార్టీలో వర్గ విభేదాలు అధికార వైసిపికి అనుకూలంగా మారుతున్నాయనే టాక్‌ వినిపిస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-