హుజురాబాద్‌ ఉపఎన్నికలో రసమయి పాత్ర ఏంటి?

ఆయన పాట పాడితే పార్టీ నేతలకు, కేడర్‌కు హుషారొస్తుంది. ఆ పాటే ఆయన్ని అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేసింది కూడా. మారిన రాజకీయ పరిణామాలు.. మరికొన్ని సంఘటనలతో మాట పెగలలేదు.. పాటా రాలేదు. ఇంతలో రకరకాల ఊహాగానాలు షికారు చేశాయి. ఆ ఊహాగానాలు నిజమైతే కష్టమని భావించారో ఏమో.. పిలిచి జోలపాట పాడారు. మరి.. ఆ జోలపాట వర్కవుట్‌ అవుతుందా?

మళ్లీ చర్చల్లోకి వచ్చిన రసమయి!

రసమయి బాలకిషన్‌. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మానకొండూరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. తెలంగాణ ఉద్యమంలో తన పాటతో గుర్తింపు తెచ్చుకున్న బాలకిషన్‌కు… గులాబీ శిబిరంలోనూ ప్రత్యేక స్థానం లభించింది. ఎమ్మెల్యేగా ఏ విధంగా ఎదిగారో.. ఆయన ప్రస్థానంలో కొన్ని ఆరోపణలు కూడా అదే విధంగా ముసురుకున్నాయి. మారిన రాజకీయ పరిణామాలు.. కొన్ని సంఘటనలు ప్రతికూలంగా మారడంతో సైలెంట్‌ అయ్యారు. దీంతో రసమయికి ఏమైంది.? ఎందుకు పాటలు పాడటం లేదని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరా తీశారు. సీన్‌ కట్‌ చేస్తే మరోసారి తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా నియామకమై చర్చల్లోకి వచ్చారు రసమయి.

ఎటూ పోకుండా పదవి ఇచ్చి జో కొట్టారా?

గతంలో కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్‌గా ఉన్నారు రసమయి. ఆ సమయంలోనే ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఇంతలో ప్రజాప్రతినిధులకు జంట లాభదాయక పదవులపై కోర్టు కన్నెర్ర చేయడంతో ఛైర్మన్‌ పదవిని కోల్పోయారు. ఎమ్మెల్యేగానే ఉండిపోయారు. నాడు కోర్టు లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసి రసమయిని ప్రగతిభవన్‌కు పిలిచి మళ్లీ ఛైర్మన్‌గా బాధ్యతలు కట్టబెట్టారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత తెలంగాణ సాంస్కృతిక సంస్థపై ఉంటుంది. అయితే – ఈటల ఎపిసోడ్‌లో రసమయి ఎటువైపు ఉంటారు అని జోరుగా చర్చ జరుగుతున్న సమయంలో పిలిచి పదవి ఇవ్వడంతో.. ఎటూ పోకుండా జోకొట్టారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

read also : రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌ ఇంట్లో మూడు పార్టీలు !

ఈటల రాజేందర్‌కు సన్నిహితుడు!
హంపి బర్త్‌డే వేడుకల్లో పాడిన పాటతో గ్యాప్‌?

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఎమ్మెల్యే రసమయి సన్నిహితుడు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో హుజురాబాద్‌ ఉపఎన్నిక కోసం తీవ్ర కసరత్తు జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అదే జిల్లాకు చెందిన రసమయి పార్టీ సమావేశాలకు వస్తున్నారు కానీ.. టచ్‌మీ నాట్‌గా ఉంటున్నారు. ఒక మాట లేదు.. పాట లేదు. ఈ పరిణామాలకు ముందు కర్నాటక హంపిలో జరిగిన ఓ బర్త్‌డే వేడుకల్లో రసమయి పాడినట్టుగా చెబుతున్న కమలమ్మ పాట పెద్ద చర్చకు దారితీసింది. ఆ తర్వాత ఆయన పాట పాడింది లేదు. ఇంతలో ఈటల ఎపిసోడ్‌ రావడంతో రసమయి దారెటు అని చర్చ సాగింది. పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టు ఉండటంతో బయట జరుగుతున్న ప్రచారాలకు ఊతం లభించినట్టు అయ్యింది.

హుజురాబాద్‌ ఉపఎన్నికలో రసమయి పాత్ర ఏంటి?
ఈటలకు వ్యతిరేకంగా పాట కడతారా?

హుజురాబాద్‌ ఉపఎన్నిక ముందు రసమయిపై జరుగుతున్న చర్చపై అప్రమత్తమైన టీఆర్‌ఎస్‌ సీనియర్లు వెంటనే మంత్రాంగం నడిపారు. ఆయన్ని ప్రగతి భవన్‌కు తీసుకెళ్లడంలో సక్సెస్‌ అయ్యారు కరీంనగర్‌ జిల్లా నాయకులు. తెలంగాణ సాంస్కృతిక సారథిగా నియమిస్తున్నట్టు .. సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. గతంలో అనుభవించిన పదవిని మళ్లీ చేపట్టిన రసమయి.. హుజురాబాద్‌ ఉపఎన్నికలో ఎలాంటి పాత్ర పోషిస్తారు? ఈటలకు వ్యతిరేకంగా పాట కడతారా? గజ్జెకట్టి చిందేస్తారా? ఉద్యమకారుడినని జనాల్లో తిరుగుతున్న ఈటలకు.. మరో ఉద్యమకారుడు రసమయి ప్రచారంలో కౌంటర్లు ఇస్తారా అని చర్చ జరుగుతోంది. మరి.. ఆయన ఏం చేస్తారో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-