అప్పట్లో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌.. ఆపై కాంగ్రెస్‌లోకి జంప్‌!

ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. ఇప్పుడు పార్టీలను పట్టుకొని తిరుగుతున్నారు. పొలిటికల్‌ ఫ్లాట్‌ఫాం కోసం కండువాలు మార్చేస్తున్నారు. అయినప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదు. పైగా ఏ పార్టీలో చేరినా గ్రూప్‌వార్‌ ఆయన్ని వెంటాడుతోంది. ఇంతకీ ఎవరా జంప్‌ జిలానీ?

గ్రూప్‌వార్‌ కారణంగా టీఆర్‌ఎస్‌లో టికెట్‌ రాలేదా?

రమేష్‌ రాథోడ్‌. మాజీ ఎంపీ. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు. 2014లో టీడీపీ ఎంపీగా పోటీ చేసినా ఓడిపోయారు. తర్వాత టీడీపీ బలహీన పడటంతో సైకిల్‌ దిగి కారెక్కేశారు రమేష్‌. వెంట కుటుంబ సభ్యులను తీసుకెళ్లడం ఆయనకు అలవాటు. ఖానాపూర్, ఆసిఫాబాద్‌ అసెంబ్లీ లేదా ఆదిలాబాద్‌ లోక్‌సభ టికెట్‌ ఇస్తారని ఆశించారు. కానీ..స్థానికంగా గులాబీపార్టీలో ఉన్న గ్రూప్‌వార్‌ కారణంగా టికెట్‌ రాలేదు.

రమేష్‌ పేరు చెబితే ఆదివాసీలు గరంగరం!

2018 ఎన్నికలకు వచ్చేసరికి టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు రమేష్‌ రాథోడ్‌. ఖానాపూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఫాం తెచ్చుకుని పోటీ చేశారు కూడా. కానీ.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ చేతిలో ఓడిపోయారు. ఆ సమయంలో ఆదివాసీలు, లంబాడాలాకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది. రమేష్‌ రాథోడ్‌ వల్లే ఆదివాసీలకు నష్టం జరిగిందనే వాదన తెరపైకి వచ్చింది. తుడుందెబ్బ నాయకుడిగా ఉన్న సట్ల అశోక్‌ బీజేపీ నుంచి పోటీ చేయడంతో 24 వేల ఓట్లు వచ్చాయి. ఆ విధంగా ఓట్లు చీలి అధికారపార్టీకి కలిసొచ్చింది. తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు రమేష్ రాథోడ్‌. మళ్లీ సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావ్‌ బీజేపీ నుంచి పోటీ చేసి గెలిచారు.

read also : పీసీసీ చీఫ్ పేరు ప్రకటిస్తే.. టీ కాంగ్రెస్‌లో ప్రకంపనలేనా?

ఈటలతో కలిసి బీజేపీలో చేరిన రమేష్‌ రాథోడ్‌

ఈ విధంగా రమేష్‌ రాథోడ్‌ ఏ పార్టీలో అడుగుపెట్టినా.. అక్కడ గ్రూప్‌ పాలిటిక్స్‌ తారాస్థాయికి చేరుకుంటాయనే ముద్ర పడిపోయింది. టీఆర్‌ఎస్‌లో రేఖానాయక్‌, కాంగ్రెస్‌లో భరత్‌ చౌహాన్‌ ఇలా చాలా మంది రమేష్‌కు వ్యతిరేకంగా గ్రూపు కట్టారు. దీంతో రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి బీజేపీ కండువా కప్పేసుకున్నారు రమేష్‌. ఆయనైతే ఉత్సాహంగా కాషాయ కండువా కప్పుకొన్నారు కానీ.. స్థానికంగా బీజేపీలో ఉన్నవారికి ఆయన రాక రుచించడం లేదట.

ఆదివాసీల స్పందనపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ!

రమేష్‌ భార్య సుమన్‌ ఎస్టీకాదు.. బీసీ అని కోర్టు తేల్చినప్పటి నుంచి ఆదివాసీలతో ఆయనకు గ్యాప్‌ వచ్చినట్టు చెబుతున్నారు. మహారాష్ట్రలో బీసీలుగా ఉన్న లంబాడాలు ఇక్కడికొచ్చి ఎస్టీలుగా చెలామణి అవుతున్నారని.. తమ హక్కులు, అవకాశాలు కొల్లగొడుతున్నారని లోకల్‌ ఆదివాసీల ఆవేదన. బయటి నుంచి వచ్చే వారికి రమేష్‌ వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలతో ఆదివాసీలు ఐక్య ఉద్యమం చేపట్టారనే టాక్‌ ఉంది. ఒకానొక సమయంలో ఈ ఉద్యమం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు రమేష్‌ బీజేపీలో చేరడం.. సోయం బాపూరావ్‌ బీజేపీ ఎంపీగా ఉండటంతో.. ఆదివాసీల స్పందన ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది.

రమేష్‌ వ్యతిరేకవర్గం అవకాశం కోసం ఎదురు చూస్తోందా?

ఎస్టీ రిజర్వ్‌ నియోజకవర్గాల్లో ఆదివాసీలకే టికెట్లు ఇవ్వాలనే డిమాండ్‌ మెల్లగా తెరపైకి తెస్తున్నారు. పైగా రమేష్‌ వ్యతిరేకవర్గం అవకాశం కోసం వేచిచూస్తున్నట్టు టాక్‌. ఖానాపూర్‌ టికెట్‌ తనకే అని రమేష్ చెప్పుకొంటున్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇది లోకల్‌ బీజేపీ కేడర్‌కు రుచించడం లేదట. అది ఏ విధంగా బరస్ట్‌ అవుతుందో చెప్పలేమన్నది కొందరు పార్టీ నేతల వాదన. మొత్తానికి రమేష్‌ ఎక్కడ కాలు పెడితే అక్కడ గ్రూప్‌వార్‌ కామన్‌ అనే ప్రచారం పొలిటికల్‌ సర్కిల్స్‌లో వైరల్‌ అవుతోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-