నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ వింత పరిస్థితి.. పార్టీ ఆయన్నే నమ్ముకుందా..?

ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది ఒక్కసారే. తర్వాత పోటీ చేసి ఓడిపోయింది మాత్రం మూడుసార్లు. టీడీపీ ఆయన్నే నమ్ముకుందో ఏమో.. ఓడినా ఇంఛార్జ్‌గా కొనసాగిస్తోంది. విచిత్రం ఏంటంటే.. సొంత పార్టీ కేడర్‌ ఆయన్ని ఓన్‌ చేసుకోదు. కేడర్‌ వర్సస్‌ లీడర్‌ అన్నట్టుగా అక్కడ పార్టీ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉంటాయి. ఇంతకీ ఎవరా నాయకుడు?

రోడ్డున పడుతున్న నూజివీడు టీడీపీ రాజకీయాలు

కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ వింత పరిస్థితి ఎదుర్కొంటోంది. అక్కడ పార్టీ ఇంఛార్జ్‌కు, కేడర్‌కు మధ్య అస్సలు పొసగటం లేదు. నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కొనసాగుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో నూజివీడు నుంచి ఆయనే పోటీ చేశారు. రెండుసార్లూ ముద్దరబోయిన ఓడిపోయారు. నూజివీడును ఓన్‌ చేసుకోవడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా.. లోకల్‌ పార్టీ కేడర్‌ మాత్రం దూరం పెడుతూనే ఉంది. ఈ క్రమంలోనే పార్టీ రాజకీయాలు రోడ్డున పడుతున్నాయి. ఇంఛార్జ్‌ను ఇరకాటంలో పెట్టడానికి వైసీపీ అక్కర్లేదు.. టీడీపీ వాళ్లే చాలనే కామెంట్స్‌ వినిపిస్తుంటాయి.

2004లో గన్నవరంలో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపు
2009లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గన్నవరంలో పోటీ.. ఓటమి
టీడీపీలో చేరాక నూజివీడు నుంచి 2014, 2019లో పోటీ

బీసీ సామాజికవర్గానికి చెందిన ముద్దరబోయిన 2004లో స్వతంత్ర అభ్యర్థిగా గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. 2009లో కాంగ్రెస్‌ టికెట్‌పై గన్నవరంలో పోటీ చేసి ఓడిపోయారు. ఈ లోగా వైఎస్‌ మరణం.. రాష్ట్ర విభజన తదితర పరిణామాలతో కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. అయితే గన్నవరంలో టికెట్‌ ఇచ్చే అవకాశాలు లేకపోవడంతో.. బీసీ కార్డు ఉపయోగపడుతుందని పక్కనే ఉన్న నూజివీడుకు ఆయన్ని సిఫ్ట్‌ చేసింది టీడీపీ. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా.. నూజివీడులో మాత్రం ముద్దరబోయిన ఓడిపోయారు. 2019లో మరోసారి ఆయనకే టీడీపీ టికెట్‌ ఇచ్చినా ఫలితం లేకపోయింది.

టీడీపీలోని ఓ వర్గం ముద్దరబోయినను ఇరుకున పెడుతోందా?

2014లో టీడీపీ అధికారంలో ఉండటంతో నూజివీడులో ముద్దరబోయిన హడావిడి నడిచింది. కానీ.. స్థానిక టీడీపీ కేడర్‌ మాత్రం ఆయన్ని ఓన్‌ చేసుకోలేదు. నూజివీడులోనే ఇల్లు, కార్యాలయం తీసుకుని ఉన్నా లోకల్‌ టీడీపీ కేడర్‌.. ముద్దరబోయినను వలస నేతగానే చూసింది. పైగా వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు మూడుసార్లు గెలిచి ఉండటంతో.. ఆయన బలం ముందు టీడీపీ ఇంఛార్జ్‌ తేలిపోతున్నారనే టాక్‌ ఉంది. అలాగే ముద్దరబోయిన నాయకత్వం ఇష్టంలేని పార్టీలోని ఓవర్గం పరోక్షంగా ప్రతాప అప్పారావుకు ఎన్నికల్లో సహకరించినట్టు చెబుతారు. అవకాశం చిక్కినప్పుడల్లా సొంత పార్టీ నేతలే ఆ వర్గం ఇరుకున పెడుతుందని టాక్‌.

నూజివీడు గొడవ తెలిసినా ఇంఛార్జ్‌ను మార్చని టీడీపీ!

ఇప్పటికే రెండుసార్లు నూజివీడులో ముద్దరబోయిన ఓడిపోయారు. కేడర్‌తో గ్యాప్‌ ఉందన్న విషయం పార్టీ పెద్దలకు కూడా తెలుసు. కానీ.. ఆయన్నే ఇంఛార్జ్‌గా కొనసాగిస్తోంది టీడీపీ. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీకి రాజకీయంగా అనుకూల పరిస్థితులు లేవు. ఈ సమయంలో మార్పు ఎందుకని అనుకుంటున్నారో ఏమో నూజివీడుపై ఫోకస్‌ పెట్టడం లేదు. అధిష్ఠానం ఆలోచన ఎలా ఉన్నా కేడర్‌ మాత్రం ముద్దరబోయినను కలుపుకొని వెళ్లే ఛాన్స్‌ లేదని స్థానికంగా జరుగుతున్న చర్చ. మరి.. పార్టీ పెద్దలు ఇక్కడి సమస్యకు ఎలా చెక్‌ పెడతారో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-