రాజమండ్రిలో ఎంపీ భరత్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే రాజా..!

ఇన్నాళ్లూ గుంభనంగా ఉన్నారు. ఇప్పుడు నేరుగా రోడ్డెక్కేశారు. అధికారపార్టీలో చర్చగా మారారు అక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు. వర్గపోరు మళ్లీ రాజుకుని.. సొంత పార్టీలోనే వైరిపక్షాలుగా మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వారెవరో.. ఆ రగడేంటో ఇప్పుడు చూద్దాం.

ఎంపీ భరత్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే రాజా!

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాల మధ్య విభేదాలు మరోసారి చర్చగా మారాయి. ఇటీవల రాజానగరం నియోజకవర్గంలో ఓ ఘటన యువనేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరును మళ్లీ రాజేసింది. ఈ గొడవలో ఎంపీ భరత్‌ నేరుగా జోక్యం చేసుకుని సొంతపార్టీకి చెందిన వారిపై సీరియస్ కామెంట్స్ చేశారు. వాటికి ఎమ్మెల్యే రాజా కౌంటర్‌ ఇవ్వటంతో వాతావరణం వేడెక్కింది. దాంతో ఈ వర్గపోరు ఎలాంటి మలుపు తీసుకుంటుందో అన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది.

రాజమండ్రిలో పెత్తనం కోసం విభేదాలు?
ఎంపీ భరత్‌పై తీవ్ర కామెంట్స్‌ చేసిన ఎమ్మెల్యే

పోటీచేసిన తొలి ప్రయత్నంలోనే ఎంపీగా భరత్.. ఎమ్మెల్యేగా జక్కంపూడి రాజాలు 2019 ఎన్నికల్లో ఒకేసారి విజయాలు అందుకున్నారు. రాజమండ్రి సిటీపై పెత్తనం విషయంలో ఈ ఇద్దరి మధ్యా విభేదాలు ఉన్నాయి. అయితే అవి అంతర్గతంగానే ఉండేవి. ఎవరి వర్గం వారిదే. గత రెండేళ్ల కాలంలో ఈస్థాయిలో విభేదాలు ఎప్పుడూ రచ్చకెక్కలేదు. ఇప్పుడు విభేదాలకు రాజానగరం వేదికైంది. తీవ్ర దుమారం రేపిన లెక్చరర్‌పై దాడి ఘటనలో ఎంపీ భరత్‌ సీరియస్‌ అయ్యారు. ఎమ్మెల్యే రాజా లక్ష్యంగా సొంతపార్టీ నేతలపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు. దీనిపై ఎమ్మెల్యే జక్కంపూడి స్పందించడంతో ఇన్నాళ్లూ గుంభనంగా ఉన్న వీరి ఆధిపత్యపోరు బహిరంగమైంది. ఎంపీ, ఎమ్మెల్యేలే ఒకరిపైఒకరు దూషించుకునే స్థాయికి చేరుకుంది. ఎంపీ భరత్‌పై ఎమ్మెల్యే రాజా చేసిన కామెంట్స్‌ డోస్‌ కాస్త గట్టిగానే ఉంది. టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి రాజమండ్రిలో వైసీపీని ఎంపీ భరత్‌ నాశనం చేస్తున్నారని ఆరోపించారు రాజా. రౌడీషీటర్లు, భుకబ్జాదారులను వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. ఇలా సొంతపార్టీకే చెందిన ఎంపీపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో హీట్‌ పెంచుతున్నాయి.

ఇద్దరి మధ్య లోలోన అగ్గి అలాగే ఉందా?

ప్రస్తుతం రాజమండ్రిలో వార్డుల వారీగా రాజన్న రచ్చబండ కార్యక్రమాన్ని భరత్ చేపడుతున్నారు. త్వరలో రాజమండ్రి మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికలు వైసీపీకి కీలకం కానున్నాయి. పట్టు సాధించేందుకు ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు చూస్తున్నాయి. అయితే తాజా గొడవలు చూశాక మేయర్‌ పీఠంపై వైసీపీ గురితప్పుతుందా అన్న ఆందోళన పార్టీ వర్గాల్లో ఉందట. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డికి తలనొప్పిగా మారినట్టు సమాచారం. ఇటీవలే రెండుసార్లు రాజమండ్రి వచ్చిన వైవీకి గతంలో ఎన్నడూ లేని విధంగా స్వాగతం అందుకున్నారు. భరత్, రాజా ఇద్దరూ సయోధ్యకు వచ్చినట్టు భావించారు. కానీ.. తాజా మాటల తూటాలు చూశాక.. ఇద్దరి మధ్య లోలోపల అగ్గి అలాగే ఉందని అర్థమైంది. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుంది. ఎవరికి ఇబ్బంది తెచ్చిపెడుతుంది అన్నది చర్చగా ఉంది. మరి.. రాజమండ్రి వైసీపీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.

-Advertisement-రాజమండ్రిలో ఎంపీ భరత్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే రాజా..!

Related Articles

Latest Articles