ఆ తెరాస ఎమ్మెల్యేపై పార్టీలో చర్చ..

ఆయన వేదిక ఎక్కితే పాట పాడకుండా ఉండలేరు. అప్పటికప్పుడు పదాలతో పాట కట్టేస్తారు. అలాంటి వ్యక్తి ఈ మధ్య పాడిన ఒకేఒక పాటతో సైలెంట్‌ అయిపోయారు. అదే ఆయన చివరి పాట. మీటింగ్‌కు వస్తే పాటల్లేవ్‌.. మాటల్లేవ్‌. ఎవరా వ్యక్తి?

పాటల్లేవు.. పొడి పొడి మాటలే!

తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో గుర్తింపు తెచ్చుకుని.. ఎమ్మెల్యే అయిన వ్యక్తి రసమయి బాలకిషన్‌. ఎమ్మెల్యే అయినా పాటను మర్చిపోలేదు. సభలు, సమావేశాల్లో రసమయి ఉంటే పాట కూడా ఉంటుంది. కానీ… మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎపిసోడ్‌ తర్వాత కరీంనగర్‌ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోందట. హుజురాబాద్‌లో జరుగుతున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశాలకు హాజరవుతున్నా.. పాటలు పాడకుండా.. ప్రసంగించి వెంటనే వెళ్లిపోతున్నారట. ఈటలతో ఉన్న సాన్నిహిత్యమో ఏమో… తన పాటలతో అలరించే ప్రయత్నం చేయడం లేదట.

టైమ్‌కు మీటింగ్‌కు వస్తున్నారు.. నాలుగు మాటలు చెప్పి సైలెంట్‌!

రసమయి మైకు పట్టుకుంటే ..సభకు, సమావేశాలకు హాజరయ్యేవారు ఆయన ఏ పాట పాడతారా అని ఎదురు చూసేవారు. సమావేశాల్లో ఉండే ప్రముఖుల్లోనూ ఒకింత ఉత్సుకత ఉండేది. యతి ప్రాసలతో ఆయన చేసే ప్రసంగాన్ని ఆసక్తిగా వినేవారు. ఉద్యమ సమయంలోను.. ఎమ్మెల్యే అయిన తర్వాత తన పాటల ప్రస్థానాన్ని రసమయి కొనసాగించారు. ఇప్పుడు హుజురాబాద్‌ ఉపఎన్నికకు టీఆర్‌ఎస్‌ పూర్తిస్థాయిలో శక్తులను మోహరిస్తోంది. వరస ఎన్నికల మీటింగ్‌లకు రసమయి వస్తున్నా నోటి నుంచి పొడి పొడిగా మాటలు తప్ప పాట ఊసే లేదట. దీంతో రసమయి పాటకోసం ఎదురు చూసేవారు నిరాశ చెందుతున్నారట. మీటింగ్‌ ఉందని చెబితే.. ఆ టైమ్‌కు వచ్చి మౌనంగా ఉండిపోతున్నారట రసమయి. తన వంతు రాగానే చెప్పాల్సిన నాలుగు ముక్కలు చెప్పేసి ఒక్క మాట ఎగస్ట్రా మాట్లాడటం లేదట.

హుజురాబాద్‌లో ఏ ప్రాంతానికీ ఇంచార్జ్‌గా లేని రసమయి

ఆ మధ్య పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు హాజరయ్యారు. అదే భేటీకి రసమయి కూడా వచ్చారు. మా రసమయి ఇప్పుడో పాట పాడతారని ప్రకటించిన కెప్టెన్‌.. మైక్‌ను ఎమ్మెల్యేకు అందజేశారట. కానీ.. నమస్కారంతో సరిపెట్టి కూర్చుండిపోయారట. ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని హుజురాబాద్‌లోని అన్ని మండలాలకు ఇంఛార్జ్‌లను నియమించిన టీఆర్‌ఎస్‌ రసమయికి ప్రాధాన్యం ఇవ్వలేదట. దీంతో ఆయన కినుక వహించారని ఒక టాక్‌. రసమయ తమతోపాటు హుజురాబాద్‌లో పార్టీ కోసం కలిసి పని చేస్తారని మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పినా.. ఆయన్ని ఏ ప్రాంతానికీ ఇంఛార్జ్‌గా వేయలేదు. దీనిపైనా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

రసమయి పాడిన కమలమ్మ పాట రాంగ్ సిగ్నల్‌ పంపిందా?

హుజురాబాద్‌కు పక్కనే మానకొండూరు నియోజకవర్గం ఉంటుంది. ఈ రెండు నియోజకవర్గాల ప్రజలకు అవినాభావ సంబంధాలు కూడా ఎక్కువే. అలాంటి రసమయికి హుజురాబాద్‌లో బాధ్యతలను ఎందుకు అధిష్ఠానం అప్పగించలేదో అన్న చర్చ జరుగుతోంది. హుజురాబాద్‌తో అంతగా సంబంధాలు లేని వారికి ఇక్కడి బాధ్యతలు అప్పగించారు. దీంతో ప్రాధాన్యం తగ్గిందా అని అనుమానించేవారు ఉన్నారట. ఈ మధ్య కాలంలో రసమయి పాడిన కమలమ్మ పాట రాంగ్‌ సిగ్నల్స్‌ పంపడంతో అప్పటి నుంచి ఆయన పాటలు పాడటం మానేశారు అని అనేవారూ ఉన్నారు. అయితే ఈటలతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా యాక్టివ్‌గా పనిచేయడం లేదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మొత్తానికి పాటలతో ఉర్రూతలూగించే ఎమ్మెల్యే ఈ విధంగా సైలెంట్‌ కావడం పెద్ద చర్చే జరుగుతోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-