ఆనందయ్య మందు.. ఇరకాటంలో పడ్డ ఎమ్మెల్యే.. !

ఆ ఎమ్మెల్యే ఏం చేసినా డిఫరెంట్‌. ఎప్పుడూ ప్రజల అటెన్షన్‌ కోసం చూస్తారు. ఆనందయ్య మందు విషయంలోనూ అదే చేశారు. ఆయన చేపట్టిన పనికి నియోజకవర్గంలో పాజిటివ్‌ సిగ్నల్స్‌ వచ్చినా.. పబ్లిసిటీ మాత్రం తలనొప్పిగా మారిందట. అనుకున్నదొక్కటి.. జరుగుతున్నది ఇంకొకటి అనీ బాధపడుతున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే?

ఇరకాటంలోపడ్డ చెవిరెడ్డి

సాధారణంగా రాజకీయ నాయకులకు ఆబ్లిగేషన్స్‌ ఓ రేంజ్‌లో ఉంటాయి. ఇక ఎమ్మెల్యేలు, మంత్రుల విషయంలో ఇది ఇంకాస్త ఎక్కువ. వీటికీ ఒక లిమిట్‌ ఉంటుంది. ఆ గీత దాటితే మాత్రం నేతలు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి సైతం అదే పరిస్థితి ఎదురైందట.

ఆకర్షణీయంగా డబ్బాలు తయారు చేసి మందు పంపిణీ

కరోనా టైమ్‌లో ఆనందయ్య మందుకు పాపులారిటీ రావడంతో.. తన నియోజకవర్గ ప్రజల కోసం ఆ మందును డబ్బాల రూపంలో పంపిణీ చేస్తున్నారు చెవిరెడ్డి. కృష్ణపట్నం వెళ్లి ఆనందయ్యను కలిసి.. వారి అనుచరులను చంద్రగిరి తీసుకొచ్చి మందు తయారీ చేపట్టారు. ప్రజలకు ఇస్తున్న మందు డబ్బాలపై చెవిరెడ్డి ఫొటోలు కూడా ఉండటంతో ఆకర్షణీంగా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ మందు డబ్బాలు పాపులర్‌ అయ్యాయి. ఒకానొక సమయంలో మందు తయారీకి కావాల్సిన మూలికల సేకరణ ఇబ్బందిగా మారిందట. ఆ సమస్యను అధిగమించి హమ్మయ్య అని అనుకుంటున్న తరుణంలో చెవిరెడ్డికి కొత్త ఇక్కట్లు మొదలయ్యాయట. దానిపైనే ఇప్పుడు పార్టీ వర్గాలూ చర్చించుకుంటున్నాయి.

ఆనందయ్య మందు కావాలని చెవిరెడ్డికి నేతల ఫోన్లు

ఏపీలోని మంత్రులు.. వైసీపీ ఎమ్మెల్యేలు.. చెవిరెడ్డికి ఫోన్‌ చేసి.. తమకూ ఓ పది బాక్సులు ఆనందయ్య మందు పంపించాలని కోరుతున్నారట. కేవలం సొంత పార్టీ నుంచే కాకుండా.. ఇతర పార్టీ నాయకులు కూడా అన్నా..మాకు కూడా కొన్ని పంపండి అని మొహమాటం పెట్టేస్తున్నారట. అయితే ఇలాంటి ఆబ్లిగేషన్స్‌ ఏపీకే పరిమితం కాలేదట. తెలంగాణ నుంచి కూడా చెవిరెడ్డికి ఆనందయ్య మందును కావాలని ఫోన్లు వస్తున్నట్టు సమాచారం. పోలీసులు.. ఇతర ప్రభుత్వ అధికారుల నుంచి వచ్చే కాల్స్‌ సరేసరి.

ఆబ్లిగేషన్‌ ఫోన్లతో చెవిరెడ్డి ఉక్కిరిబిక్కిరి!

ఆకులు.. మూలికలే కదా.. ఒక 50 లక్షల్లో అంతా అయిపోతుందని.. చంద్రగిరి నియోజకవర్గంలో అందరికి ఆనందయ్య మందు ఇవ్వొచ్చని ప్లాన్‌ వేసుకున్నారట చెవిరెడ్డి. తీరా.. మందు తయారీ మొదలుపెట్టాక.. ఖర్చు లక్షల నుంచి కోట్లల్లోకి పెరిగిందట. ఈ తరుణంలో బయట నుంచి వస్తున్న ఫోన్లకు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారట చెవిరెడ్డి. లేదనలేక.. కాదనలేక సతమతం అవుతున్నారట. దాంతో ఏదో అనుకుని మొదలుపెడితే.. ఇప్పుడు ఇంకేదో అవుతోందని తలపట్టుకుంటున్నారట ఎమ్మెల్యే.

చంద్రగిరిలో పంపిణీ పూర్తయ్యాక.. తయారీ ఆపేస్తారా?

నియోజకవర్గంలోని ప్రజలకు ఒకటి కాకపోతే రెండుమూడు డబ్బాల మందైనా ఇస్తాను. కానీ.. బయటి వారికి కూడా అంటే ఎలా అని జడుసుకుంటున్నారట. ఖర్చు మాట ఎలా ఉన్నా.. వనమూలికల సేకరణ పెద్ద సమస్యగా భావించి ఆందోళన చెందుతున్నారట. దీంతో చంద్రగిరిలో త్వరగా ఆనందయ్య మందు పంపిణీ ముగించి.. తయారీకి స్వస్తిచెప్పాలని చూస్తున్నారట. మొత్తానికి ఆనందయ్య మందు పంపిణీ వల్ల వచ్చే ఆబ్లిగేషన్స్‌ను చెవిరెడ్డి అంచాన వేయలేకపోయారని అనుకుంటున్నారు.

Related Articles

Latest Articles

-Advertisement-