50 ఏళ్ళ ‘మేరే అప్నే’

(సెప్టెంబర్ 10న ‘మేరే అప్నే’కు 50 ఏళ్ళు పూర్తి)

మనసును కట్టి పడేసే కథలు ఎవరినైనా ఆకట్టుకుంటాయి. అలాంటి కథలను పేరున్నవారు సైతం రీమేక్ చేయడానికి ఇష్టపడతారు. బెంగాలీలో తపన్ సిన్హా రూపొందించిన ‘అపన్‌ జన్’ ఆధారంగా హిందీలో ‘మేరే అప్నే’ చిత్రాన్ని తెరకెక్కించారు గుల్జార్. ఈ ‘మేరే అప్నే’తోనే గుల్జార్ దర్శకునిగా మారడం విశేషం! ప్రముఖ చిత్ర నిర్మాత ఎన్.సి. సిప్పీ ఈ సినిమాను నిర్మించారు. మీనాకుమారి ప్రధాన పాత్రలో రూపొందిన ‘మేరే అప్నే’ చిత్రంతోనే వినోద్ ఖన్నా హీరోగా పరిచయం కావడం విశేషం. అలాగే ప్రముఖ నటుడు డానీ తొలిసారి తెరపై కనిపించింది కూడా ఈ చిత్రంతోనే. ఈ సినిమాలో శత్రుఘ్న సిన్హా మరో ప్రధాన భూమిక పోషించారు. 1971 సెప్టెంబర్ 10న విడుదలైన ‘మేరే అప్నే’ మంచి విజయం సాధించింది.

‘మేరే అప్నే’ కథ విషయానికి వస్తే- ఈ కథ ప్రధానంగా ఓ ముసలమ్మ చుట్టూ తిరుగుతుంది. మారుమూల పల్లెలో ఉన్న ముసలమ్మను దూరపు బంధువు వచ్చి పట్నం రమ్మని, తమతోనే ఉండమని బలవంత పెట్టి తీసుకుపోతాడు. అక్కడకు వెళ్ళాక తెలుస్తుంది- వారికి పని మనిషి దొరకనందున తనపై ప్రేమ ఒలకబోశారని. దాంతో ముసలమ్మ వేరే చోటు చూసుకుంటుంది. ఆమె ఉండే ప్రాంతంలోనే శ్యామ్, ఛేను అనే ఇద్దరు రెండు వర్గాలకు నాయకులుగా చెలామణీ అవుతుంటారు. తరచూ వారి వర్గాలు పోట్లాడుకుంటూ ఉంటాయి. శ్యామ్ కొన్నిసార్లు ఈ శత్రుత్వం వదిలేద్దామని ఛేనుతో అంటూ ఉంటాడు. కానీ, వారి వర్గాల్లోని మనుషుల వల్ల పోట్లాటలు సాగుతూనే ఉంటాయి. ఓ అనాథ బాలుడు పదిపైసలిస్తే ఏమైనా తింటానని ముసలమ్మను అడుగుతాడు. ఆమె ఆ బాబును తనతోపాటే సాకుతుంది. ఆ బాబు ‘నానీ మా’ అంటూ ఆమెను పిలుస్తూంటాడు. శ్యామ్, ఛేను కూడా అలాగే పిలుస్తారు. ఓ సారి మళ్ళీ శ్యామ్, ఛేను వర్గాల మధ్య గొడవలు – వారిలో ఓ వ్యక్తి నాటు బాంబు వేస్తాడు. పోట్లాట సాగుతుంది. అందులో నానీ మా మరణిస్తుంది. ఆమె మరణం రెండు వర్గాల వారిని కలచివేస్తుంది. అందరినీ పోలీసులు అరెస్ట్ చేసి వ్యానులో తీసుకుపోతారు. అదే సమయంలో ఆసుపత్రి వ్యానులో ముసలమ్మ శవాన్ని తీసుకెళ్తారు. మళ్ళీ అనాథ బాలుడు ఒంటరి కావడంతో కథ ముగుస్తుంది.

ఈ చిత్రంలో ‘నాని మా’గా మీనా కుమారి నటించారు. వినోద్ ఖన్నా, శత్రుఘ్న సిన్హా, అస్రానీ, డానీ, పైనిటాల్, దినేశ్ ఠాకూర్, సుమితా సన్యాల్, మెహమూద్ తదితరులు నటించారు.

ఈ కథలోని పోరాటాలు చూస్తే తరువాత వచ్చిన ‘శివ’లాంటి పలు చిత్రాలు గుర్తుకు వస్తాయి. పైగా ఇందులో రాజకీయ నాయకుల ఊసు కూడా పలు సినిమాల్లో మనకు తారసపడిందే కనిపిస్తుంది. ఈ చిత్రానికి ఇందిరా మిత్రతో కలసి గుల్జార్ మాటలు రాశారు. ఇందులోని నాలుగు పాటలనూ గుల్జార్ కలం పలికించింది. సలీల్ చౌదరి బాణీల్లో అన్ని పాటలూ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కిశోర్ కుమార్ పాడిన “కోయి హోతా జిస్కో అప్నా…” సాంగ్ ఇప్పటికీ సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంది.

Related Articles

Latest Articles

-Advertisement-