కేంద్రమంత్రి భగవంత్‌ కూబాతో పాటిల్‌ చెట్టపట్టాల్‌?

ఆ అధికారపార్టీ ఎంపీ ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరుస్తున్నారా? సొంత సామాజికవర్గమే కావడంతో పక్క నియోజకవర్గ ఎంపీతో స్నేహబంధాన్ని బలోపేతం చేస్తున్నారా? ఇదంతా సేఫ్ గేమ్‌లో భాగమా లేక.. భవిష్యత్‌ రాజకీయ వ్యూహమా? సొంత పార్టీలోనూ అనుమానాలకు బీజం పడిందా? ఎవరా అధికార పార్టీ ఎంపీ? ఏంటా స్నేహగీతం..!

ఎంపీ పాటిల్‌ కొత్త స్నేహాలపై చర్చ!

బీబీ పాటిల్‌. జహీరాబాద్‌ ఎంపీ. టీఆర్‌ఎస్‌ నుంచి వరసగా రెండోసారి గెలిచారు. రాజకీయాలతో సంబంధం లేకపోయినా.. ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే ఎన్నికల్లో గెలిచి లోక్‌సభలో అడుగు పెట్టారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి చివరి నిమిషం వరకు టికెట్ కన్ఫామ్‌ కాలేదు. టికెట్‌ కష్టమే అనుకుంటున్న సమయంలో పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుని బరిలో నిలిచారు. 6వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచి సీటును కాపాడుకున్నారు పాటిల్‌. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఎంపీ పాటిల్‌ కొత్త స్నేహాలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. దానిపైనే గులాబీ శిబిరంలో హాట్ హాట్‌ డిస్కషన్‌గా మారింది.

భగవంత్‌, పాటిల్‌ ఇద్దరిదీ ఒకటే సామాజికవర్గం!
ఫంక్షన్లకు కేంద్రమంత్రితో కలిసి హాజరవుతున్న ఎంపీ పాటిల్‌!

జహీరాబాద్‌ లోక్‌సభకు ఆనుకునే ఉంటుంది బీదర్‌ లోక్‌సభ స్థానం. బీదర్‌ కర్నాటకలో ఉన్నా.. రాకపోకలన్నీ హైదరాబాద్‌ నుంచే జరుగుతాయి. బీదర్‌ నుంచి బీజేపీ నేత భగవంత్‌ కూబా రెండోసారి ఎంపీగా గెలిచారు. ఇటు పాటిల్‌.. అటు భగవంత్‌ కూబా ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం లింగాయత్‌. భగవంత్‌ కూబా జూలైలో కేంద్రమంత్రి అయినప్పటి నుంచీ ఆయనతో ఎంపీ పాటిల్‌ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారట. ఒకే సామాజికవర్గమనో ఏమో ఈ టీఆర్ఎస్‌ ఎంపీ మరీ అడ్వాన్స్‌ అవుతున్నారని గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. ప్రస్తుతం కేంద్రమంత్రి స్నేహంలో పడి.. జహీరాబాద్‌ పరిధిలోని టీఆర్ఎస్‌ కేడర్‌, లీడర్లను పాటిల్‌ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుభకార్యాలు, ఫంక్షన్లకు భగవంత్‌ కూబాతో కలిసి పాటిల్‌ హాజరవుతూ.. ఇటు బీజేపీ, అటు టీఆర్‌ఎస్‌ కేడర్‌కు బోల్డంత సర్‌ప్రైజ్‌ ఇస్తున్నారట.

కేంద్రమంత్రితో స్నేహంలో తప్పేం లేదంటున్న పాటిల్‌!

కొత్తలో బాగానే ఉన్నా.. ఇప్పుడిప్పుడే టీఆర్ఎస్‌ శ్రేణులు పాటిల్‌పై గుర్రుగా ఉన్నారట. టీఆర్ఎస్‌ పెద్దల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్టు సమాచారం. ఈ విషయం పాటిల్‌ చెవిన పడిందో ఏమో..
‘పార్టీలు వేరైనా..ఇద్దరం పక్క పక్క నియోజకవర్గాల ఎంపీలం. ఒకే సామాజికవర్గం కావడంతో కొన్ని కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటున్నాం.. ఇందులో తప్పేముంది’ అని ప్రశ్నిస్తున్నారట పాటిల్‌. గత నెలలో కేంద్రమంత్రి ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయానికి దర్శనానికి వచ్చారు. అక్కడ బీజేపీ నేతలకంటే ఎంపీ పాటిల్‌ అనుచరులే ఎక్కువగా హల్‌చల్‌ చేశారట. భగవంత్‌ కూబా కార్యక్రమాన్ని మొత్తం దగ్గరుండి పూర్తి చేయించారట. కేంద్రమంత్రి కూడా బీజేపీ లీడర్ల కంటే ఎంపీ పాటిల్‌ అనుచరులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు టాక్‌.

పాటిల్‌ సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నారా అని టీఆర్ఎస్‌ శ్రేణుల ఆరా?

ఈ పరిణామాలు చూసినవారంతా.. ఎంపీ పాటిల్‌ మనసులో ఏముంది అనే చర్చ మొదలుపెట్టేశారు.
టీఆర్‌ఎస్‌ ఎంపీ సేఫ్‌ గేమ్ ఆడుతున్నారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పాటిల్‌ మాత్రం వీటిని పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదట. పైగా అన్నింటికీ తాను సమాధానం చెప్పాల్సిన పనిలేదని.. ఏం చేయాలో తనకు తెలుసని బదులిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి పాటిల్‌ మాత్రం టీఆర్‌ఎస్‌లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్ అయిపోయారు. మరి.. సొంత పార్టీ ఎంపీపై జరుగుతున్న ప్రచారానికి గులాబీ పెద్దలు ఎలా ఎండ్‌ చేస్తారో చూడాలి.

-Advertisement-కేంద్రమంత్రి భగవంత్‌ కూబాతో పాటిల్‌ చెట్టపట్టాల్‌?

Related Articles

Latest Articles