క్లియర్ అజెండా.. ఎవరి రాజకీయం వారిది.. అమ్మ ఒక్కరే సెంటర్ పాయింట్!

వైఎస్ జగన్.. వైఎస్ షర్మిల. అన్నా చెల్లెళ్లు. అన్న.. ఆంధ్రను ఇప్పటికే ఏలుతున్నారు. చెల్లెలు తెలంగాణ వేదికగా రాజకీయం వేడిగా ప్రారంభించారు. ప్రతి మంగళవారం చెప్పినట్టుగా నిరుద్యోగుల తరఫున పోరాట దీక్ష చేస్తున్నారు. కడుపు మాడ్చుకుని మరీ.. దీక్షలతో వార్తలతో చోటు పొందుతున్నారు. విమర్శల ధాటి పెంచుతున్నారు. ఈ క్రమంలో.. జగన్ తీరుపై చాలా మందికి ఎప్పుడో స్పష్టత వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో తప్ప.. పొరుగున ఉన్న తెలంగాణలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని.. ఆయన క్యాంప్ నుంచి చాలా కాలం క్రితమే క్లారిటీ వచ్చింది. అయితే.. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారనగానే.. వెనకాల జగన్ ఉన్నారని.. ముందుకు ఆయనే నడిపిస్తున్నారని కొందరు అన్నారు. కానీ.. ఇప్పటివరకూ.. ఒక్కటంటే ఒక్క మాట కూడా.. షర్మిల గురించి జగన్ మాట్లాడనేలేదు.

కేవలం విజయమ్మ మాత్రమే.. తన కుమార్తె గురించి ఆమె సభలకు వెళ్లారు. ప్రసంగించారు. వైఎస్ తో ఉన్న అనుబంధాన్ని చాటారు. వైఎస్ బాటలో షర్మిల నడుస్తుందని చెప్పుకొచ్చారు. అందుబాటులో ఉన్న నేతలను షర్మిలకు దగ్గర చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. ఇదంతా చూస్తున్న జనాలు.. ఇప్పుడిప్పుడే ఓ స్పష్టతకు వస్తున్నారు. జగన్ రాజకీయాల్లో షర్మిల వేలు పెట్టే అవకాశం లేదు. షర్మిల రాజకీయ బాటలో.. జగన్ కలగజేసుకునే అవకాశం అంతకన్నా లేదు.

కానీ.. జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి.. ముఖ్యమంత్రి అయ్యే వరకూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ ఎలా ముందుండి నడిపించారో.. తన కుమార్తె షర్మిల బాధ్యతనూ.. అలాగే ముందుకు తీసుకుపోతున్నారన్నది అంతా గుర్తిస్తున్నారు. రాజకీయాల్లో షర్మిల ఏ స్థాయికి చేరుకుంటారన్నది.. తర్వాత మాట్లాడుకునే అవకాశం ఉన్న అంశం. కానీ.. ఇప్పుడు కాకపోతే.. తర్వాత అయినా సరే.. విజయమ్మ చూపిన బాటలో షర్మిల.. తన సోదరుడిలా ఉన్నత స్థానానికి చేరుకుంటారని.. ఆమె అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే.. బంధుత్వానికి మాత్రమే జగన్, షర్మిల సొంత అన్నాచెల్లెళ్లనీ.. రాజకీయాల్లో మాత్రం వారిది ఎవరి బాట వారిదే అని.. తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ వేదికగా జరిగిన వైఎస్ఆర్ ఆత్మీయ సమ్మేళనానికి జగన్ రాకపోవడం కూడా.. ఈ అభిప్రాయానికి బలాన్ని చేకూరుస్తోంది.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-