యనమల కుటుంబం రాజకీయ భవిష్యత్‌ ఏంటి?

ఆయన టీడీపీలో సీనియర్‌. అలాంటి నాయకుడి కుటుంబ రాజకీయ భవిష్యత్‌.. గందరగోళంలో పడిందా? ఆరుసార్లు గెలిచిన నాయకుడు.. ఒక్క ఓటమితో పక్కకెళ్లిపోయారు. ఆయన స్థానంలో బరిలో దిగిన తమ్ముడికీ వరస ఓటములే. దీంతో ఆ కుటుంబం పక్క నియోజకవర్గంపై కన్నేసినట్టు జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథా?

తుని సురక్షితం కాదని యనమల కుటుంబం భావిస్తోందా?

టీడీపీలో కీలకంగా వ్యవహరించే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. ఎన్నికల్లో పోటీ చేసి దశాబ్దంన్నరపైనే అయింది. 1983 నుంచి తూర్పుగోదావరి జిల్లా తునిలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు యనమల. 2009లో ఎదురైన ఓటమి.. ఆయన్ని ప్రత్యేక్ష ఎన్నికలకు దూరం చేసింది. అక్కడి నుంచి యనమల రామకృష్ణుడు తమ్ముడు కృష్ణుడు తునిలో పోటీ చేసినా కలిసి రాలేదు. రెండుసార్లూ వైసీపీ నుంచి దాడిశెట్టి రాజా ఎమ్మెల్యేగా గెలిచారు. వరస ఓటములతో ఇక తుని సురక్షితం కాదనే అంచనాకు వచ్చిందట యనమల కుటుంబం. అదే ఇప్పుడు పార్టీలోనూ.. స్థానికంగానూ చర్చగా మారింది.

ప్రత్తిపాడుపై యనమల కుటుంబం కన్నేసిందా?

ప్రస్తుత పరిస్థితుల్లో తునిలో మళ్లీ పట్టుసాధించడం ఇక సాధ్యం కాదనే అంచనాకు వచ్చిందట యనమల కుటుంబం. అందుకే తునికి సమీపంలోని ప్రత్తిపాడు నియోజకవర్గంపై కన్నేసిందట. కాపు సామాజికవర్గం ఓటర్లు ఉండే ప్రత్తిపాడులో యాదవ సామాజికవర్గం ఓటర్లు కూడా ఘణనీయంగానే ఉన్నారు. రౌతులపూడి, శంఖవరం మండలాల్లో యనమల కుటుంబీకులు కూడా ఉంటున్నారు. ఇక్కడ ఇతర బీసీ వర్గాలు కలిసి వస్తే ఫలితం అనుకూలంగా ఉంటుందని లెక్కలేస్తున్నారట యనమల అండ్‌ కో. వాస్తవానికి గడిచిన ఎన్నికల్లోనే ఈ అలోచన వచ్చినప్పటికీ మూడోసారి కూడా తునిలో పోటీ చేసి చేతులు కాల్చుకుంది మాజీ మంత్రి కుటుంబం.

యనమల పట్టుబడితే టీడీపీ అధినేత కాదనలేరా?

ప్రత్తిపాడులో ప్రస్తుతం వైసీపీ నుంచి గెలిచిన పర్వత పూర్ణ చంద్రప్రసాద్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. సొంత మండలం శంఖవరంతోపాటు ఏలేశ్వరంలోనూ ఎమ్మెల్యేకు గట్టిపట్టుంది. దాంతో ఆయన్ని ఢీకొట్టడం టీడీపీ సవాలే అన్నది పార్టీ వర్గాల వాదన. గత ఎన్నికల్లో పోటీ చేసిన వరుపుల రాజా వ్యవహారం ఊగిసలాటలో ఉంది. ఎన్నికల ఫలితాలు రాగానే టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఇటీవలే యాక్టివ్‌ అయ్యారు. పార్టీ కార్యక్రమాలు చురుకుగా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ యనమల కుటుంబం ప్రత్తిపాడుపై గట్టిగా పట్టుబడితే అధినేత ఆలోచించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

తునిలో యనమల తర్వాత ఎవరు?

యనమల కుటుంబం తునిని వీడితే ఆ నియోజకవర్గం రాజకీయాల్లోనూ కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది. మొదటి నుంచి తుని పట్టణంలో పెద్దగా పట్టు లేకపోయినా తొండంగి.. తుని రూరల్‌లో ఉన్న అనుకూలతతో యనమల రామకృష్ణుడు గట్టెక్కేవారు. కోటనందూరులో టీడీపీకి ఎదురు దెబ్బలు తగలడంతో యనమల హహాకి అడ్డుకట్ట పడింది. ఇప్పుడు యనమల తర్వాత ఎవరు? పట్టం కట్టేదెవరికి అనేది టీడీపీలో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి.. ఈ గజిబిజి గందరగోళం నుంచి యనమల కుటుంబం ఎలా బయటపడుతుందో చూడాలి.

Related Articles

Latest Articles