జల జగడంలో ఏపీ అధికారి గూఢచారి పాత్ర?

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం అతిపెద్ద హాట్‌టాపిక్‌ జల వివాదం. ఎవరి వ్యూహాలు వారివే. ఇలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రానికి సహకరించేలా గూఢచర్యం చేస్తే ఎలా ఉంటుంది? ఓ కీలక అధికారే అలాంటి గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు తెలిస్తే..!? రియాక్షన్‌ ఊహించలేం. తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్న ఆ ఆఫీసర్‌ను కంట్రోల్‌ చేయలేకపోతే కష్టమంటున్నాయి ఏపీ ఇరిగేషన్‌ వర్గాలు. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.

జలవివాదంలో పక్క రాష్ట్రానికి గూఢచర్యం?

కొందరు అధికారులు అవినీతికి పాల్పడితే.. ఇంకొందరు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా.. మరికొందరు అహంకారంతో ఉంటారు. వీటన్నింటినీ మించి పక్క రాష్ట్రానికి సహకరించేలా గూఢచర్యం చేస్తున్నారట ఓ ఆఫీసర్‌. ఏపీ ఇరిగేషన్‌ వర్గాల్లో ప్రస్తుతం ఆ అధికారిపైనే చర్చ జరుగుతోంది. ఇలాంటి అధికారిని ఎక్కడా చూడలేదని చెవులు కొరుక్కుంటున్నారు.

read also : వైసీపీకి ప్రచారం చేసిన.. కత్తి మహేశ్ కోసం ఒక్క ఎమ్మెల్యే రాలేదు

పొరుగు రాష్ట్రాలకు లీక్‌ కాకుండా జాగ్రత్త పడతారు అధికారులు!

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నడుస్తోంది. కృష్ణా నదిపై ప్రాజెక్టుల నిర్మాణం మొదలుకొని.. జల విద్యుత్‌ ఉత్పత్తి వరకు గడచిన కొన్ని రోజులుగా ఏపీ-తెలంగాణ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కేంద్ర ప్రభుత్వంతోపాటు KRMB, కోర్టుల తలుపులు తడుతున్నాయి రాష్ట్రాలు. బలమైన వాదనలు వినిపించేందుకు కసరత్తు చేస్తున్నాయి కూడా. జల వివాదాలు తెర మీదకు వచ్చినప్పుడు ఈ ఎత్తుగడలు సహజం. వ్యూహాలను వీలైనంత వరకు గుట్టుగానే ఉంచుతాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. తామేం చేస్తున్నాం? తమ ఆలోచనలేంటి? ఎవరికి ఫిర్యాదు చేయబోతున్నామనే విషయాలు లీకైతే పొరుగు రాష్ట్రం అలర్టయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని టాప్‌ సీక్రెట్‌గానే ఉంచుతారు.

ఏపీ అంశాలను పూసగుచ్చినట్టు చెప్పేస్తున్నారట

ఈ దఫా ఏపీ ఇరిగేషన్‌ వర్గాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొంచెం అనుమానాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది. జల వివాదాలకు సంబంధించి ఏపీలో జరుగుతున్న పరిణామాలను పూస గుచ్చినట్టు పొరుగు రాష్ట్రంలోని అధికారులకు అందిపోతున్నాయట. ఏపీ ఏం చేయబోతుందో తెలంగాణ అధికారులకు ముందుగానే తెలిసిపోతోందట. ఏపీ ఇరిగేషన్‌ శాఖలో ఉన్న ఓ కీలక అధికారి నుంచే ఈ సమాచారం అంతా పక్క రాష్ట్రానికి పొక్కుతుందనే చర్చ సచివాలయ వర్గాల్లో.. మరీ ముఖ్యంగా ఏపీ ఇరిగేషన్‌ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

కేంద్రానికి రాసిన లేఖలు.. కీలక పరిణామాలను చేరవేశారా?

కేంద్రానికి రాసిన లేఖలు.. కొన్ని కీలకమైన పరిణామాల గురించి సదరు అధికారి తెలంగాణ దృష్టికి తీసుకెళ్తున్నారట. ఈ రాష్ట్రంలో పనిచేస్తూ.. అక్కడి నుంచి సమాచారం రాబట్టాల్సింది పోయి.. తాను పని చేస్తున్న రాష్ట్రానికి అన్యాయం జరిగే విధంగా ఇక్కడి విషయాలు అక్కడకు చేరవేయడం ఎంత వరకు కరెక్ట్‌ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించి దాచి పెట్టే అంశాలు పెద్దగా లేకున్నా.. సదురు అధికారి ఈవిధంగా వ్యవహరించడం నైతికత కాదని చెవులు కొరుక్కుంటున్నారు.

పొరుగు రాష్ట్రంతో ఆ అధికారి ఎందుకు కుమ్మక్కయ్యారు?

ఇప్పటి వరకు సదురు అధికారి చేరవేసిన అంశాలు పెద్దగా ఏపీని ఇబ్బంది పెట్టకున్నా.. కీలక స్థానంలో ఉంటూ … ఆయన వ్యవహరించాల్సిన తీరు అది కాదని సచివాలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయట. ఏపీకి.. రాష్ట్ర రైతాంగానికి తీరని నష్టం వస్తుందనే అంశాన్ని ఆ అధికారి గమనించాలనే చర్చ ఉద్యోగుల మధ్య జరుగుతోంది. అసలు ఆ అధికారి పక్క రాష్ట్రంతో కుమ్మక్కు కావాల్సిన అవసరం ఏమొచ్చిందనే అంశంపై ఆరా తీయాలని ఇంకొందరు డిమాండ్‌ చేస్తున్నారట. మరి.. ఈ విషయాన్ని పాలకులు గమనించారో లేదో కానీ.. జలజగడంలో గూఢచారి గురించి మాత్రం సెక్రటేరియట్‌ వర్గాలు కథలు కథలుగా చెప్పుకొంటున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-