రెండేళ్లుగా జనాలకు ప్రత్యక్షంగా కనిపించని ఎమ్మెల్యే…!

ఆయనో ఎమ్మెల్యే. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. ప్రజలకు ప్రత్యక్షంగా కనిపించి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఇప్పటికే విపక్షాలకు టార్గెట్‌ అయ్యారు. ఇదే సమయంలో అధికారపార్టీలో మరో చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల నాటికి ఆయన పోటీ చేస్తారా? కొత్త వ్యక్తి బరిలో ఉంటారా? ఇంతకీ ఏంటా నియోజకవర్గం?

కొంతకాలంగా జర్మనీలోనే ఎమ్మెల్యే రమేష్‌!

చెన్నమనేని రమేష్‌. వేములవాడ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే. 2009 నుంచి ఆయన శాసనసభ్యుడిగా గెలుస్తూ వస్తున్నారు. స్థానిక రాజకీయాలు ఎలా ఉన్నా.. ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి వెంటాడుతున్న సమస్య ఒక్కటే. రమేష్‌కు జర్మనీ పౌరసత్వం ఉందని. ఈ వివాదంపై కోర్టులో విచారణ కూడా జరుగుతోంది. పలు సందర్భాలలో ఆయన ఈ విషయాన్ని కొట్టిపారేసినా.. రచ్చ మాత్రం ఆగడం లేదు. దేశంలో కరోనా ప్రభావం మొదలుకావడానికి ముందే జర్మనీ వెళ్లిన ఎమ్మెల్యే రమేష్‌.. ఇంకా తిరిగి రాలేదు. కొంతకాలంగా ఎమ్మెల్యే అక్కడే ఉంటున్నారు. నియెజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు. దీనిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఎమ్మెల్యే అందుబాటులో లేకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ప్రచారం

ఫోన్లో, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా నియోజకవర్గ ప్రజలతో టచ్‌లో ఉండేందుకు ఎమ్మెల్చయే రమేష్‌ ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల వేములవాడలో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటుపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల బృందం మంత్రి కేటిఆర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చింది. ఆ సమయంలో ఎమ్మెల్యే రమేష్‌.. మంత్రితో ఫోన్లో మాట్లాడారట. స్పెషల్‌ ఫుడ్‌ ప్రోసెసింగ్‌ జోన్‌ ఏర్పాటు కోసం విజ్ఞప్తి చేశారట. అయితే – తాజా రాజకీయ పరిస్థితుల్లో వేములవాడ నుంచి మరోసారి చెన్నమనేని ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందా లేదా అన్న చర్చ మొదలైంది. ఎక్కువ కాలం ఎమ్మెల్యే నియెజకవర్గంలో అందుబాటులో లేకపోతే రాజకీయంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న చర్చ జరుగుతోందట.

రమేష్‌ అంశాన్ని విపక్షాలు అడ్వాంటేజ్‌గా తీసుకుంటాయా?

పౌరసత్వం వివాదం కొలిక్కి రాకపోతే.. టీఆర్‌ఎస్‌ రమేష్‌కు మళ్లీ అవకాశం ఇస్తుందా లేదా అని పార్టీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి. వేములవాడలో కొత్తవారికి ఛాన్స్‌ ఇచ్చే అంశాన్ని టీఆర్‌ఎస్‌ పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు రమేష్ అందుబాటులో లేని అంశాన్ని విపక్షాలు రాజకీయంగా వాడుకుని అడ్వెంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. ఆ విమర్శలకు ఛాన్స్‌ ఇవ్వకూడదన్న అభిప్రాయం అధికారపార్టీలో ఉందట.

వచ్చే ఎన్నికల్లో కొత్త వ్యక్తి బరిలో దిగుతారా?

నియెజకవర్గంలోని సామాజిక, రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ను బరిలో దించుతారని కొందరు భావిస్తున్నారు. దీనిని కొట్టిపారేయలేమన్న ప్రచారం పార్టీవర్గాల్లో జరుగుతోంది. మొత్తంగా వచ్చే ఎన్నికలనాటికి వేములవాడలో రాజకీయలు, సమీకరణాలు మారతాయని అనుకుంటున్నారట. మరి.. రానున్న రోజుల్లో లోకల్‌ పాలిటిక్స్‌ ఎలాంటి మలుపు తిరుగుతాయో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-